తారాగణం: శ్రీదేవి, నవాజుద్దీన్ సిద్ధికీ, అక్షయ్‌ఖన్నా, సాజల్ అలీ, అభిమన్యు సింగ్ తదితరులు
సంగీతం: ఎ.ఆర్.రెహమాన్
సినిమాటోగ్రఫీ: అనయ్ గోస్వామి
దర్శకత్వం: రవి ఉద్యవార్
నిర్మాత: బోనీకపూర్
నిర్మాణం: మ్యాడ్ ఫిలింస్, థర్డ్ ఐ పిక్చర్స్
యావరేజ్ యూజర్ రేటింగ్: 3.25/5
కథా కమామిషు:
అలనాటి అందాల తార శ్రీదేవి, చాలాకాలం తర్వాత 'ఇంగ్లిష్ వింగ్లిష్' సినిమాలో కనిపించి మెప్పించింది. కొత్త ఇన్నింగ్స్‌లో సొసైటీకి మెసేజ్ ఇచ్చే సినిమాలే చేయాలనుకుంటోందో ఏమో, 'మామ్' అనే డిఫరెంట్ మూవీతో తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది శ్రీదేవి. 'మామ్' కథా కమామిషు ఎలా ఉందంటే, దేవకి (శ్రీదేవి) అనే టీచర్, ఆనంద్ (అద్నాన్ సిద్ధికి)ని పెళ్ళాడుతుంది. దేవకి, ఆనంద్‌లకు ఇద్దరు పిల్లలు ఆర్య, ప్రియ. ఆర్యకి దేవకి సవతి తల్లి. తన తల్లి స్థానంలో దేవకిని ఊహించుకోలేక ఆమెతో అయిష్టంగా ఉంటుంది ఆర్య. తన స్నేహితులతో ఓ పార్టీకి వెళ్ళిన ఆర్యపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి ఒడిగడతారు. పోలీసులకు నిందితులు దొరికినా, సరైన సాక్ష్యాలు లేకపోవడంతో నిర్దోషులుగా విడుదలవుతారు. వారిపై దేవకి తీర్చుకునే ప్రతీకారమే 'మామ్' కథ.
నటీనటులెలా చేశారు?
శ్రీదేవి నటన గురించి కొత్తగా ఏం చెబుతాం? ఆమె గొప్ప నటి. తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది శ్రీదేవి. తల్లి పాత్రలో శ్రీదేవి ఒదిగిపోయిన తీరు అద్భుతం. తెరపై సినిమా చూస్తున్నట్లుగా కాక, దేవకిని మనం దగ్గర్నుంచి చూస్తున్నట్లే ఉంటుంది. అంతలా దేవకి పాత్రలో శ్రీదేవి ఒదిగిపోయింది. భావోద్వేగాలు పండించే క్రమంలో శ్రీదేవి చూపిన ప్రత్యేకమైన శ్రద్ధకు హేట్సాఫ్ అనాల్సిందే. ఆర్య పాత్రలో కనిపించిన అమ్మాయికి నటిగా మంచి మార్కులు పడతాయి. నవాజుద్దీన్ సిద్ధికీ కూడా అద్భుతంగా నటించాడు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో అక్షయ్ ఖన్నా పాత్ర ఆకట్టుకుంటుంది.
సాంకేతిక వర్గం పనితీరు...
సినిమాటోగ్రఫీ, సంగీతం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. సినిమా మూడ్‌కి తగ్గట్టుగా సినిమాటోగ్రఫీ ఉంది. సంగీతం అయితే సింప్లీ సూపర్బ్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో సినిమాని నెక్స్‌ట్ లెవల్‌కి తీసుకెళ్ళారు. కథ, కథనం అన్నీ బాగున్నాయి. మాటలు ఆకట్టుకుంటాయి. ఎడిటింగ్ బాగుంది, అక్కడక్కడా అవసరం అనిపిస్తుంది.
విశ్లేషణ....
కూతురికి అన్యాయం జరిగితే తల్లి ఆ అన్యాయాన్ని ప్రశ్నించి, దోషులపై పగ తీర్చుకోవడం అనేది ఎప్పటినుంచో సినిమాల్లో చూస్తున్న అంశమే. అయితే ఎన్నిసార్లు అలాంటి కథల్ని చూసినా, మంచి సినిమా వస్తే ఆ కథని ఎప్పుడూ విజయం వరిస్తుంది. ఆ కాన్సెప్ట్‌లో ఉన్న కిక్ అలాంటిది. దర్శకుడు ఈ సినిమాని కూడా అంతే పకడ్బందీగా రూపొందించాడు. నటీనటుల ప్రతిభ, సినిమా టేకింగ్ అన్నీ బాగున్నా, అన్యాయం చేసినవారిపై పగ తీర్చుకునే క్రమంలో వచ్చే సన్నివేశాలు కొంత డల్‌గా అనిపిస్తాయి. ఆ ఒక్క విభాగంపైనా దృష్టిపెడితే ఇంకా చాలా బాగుండేది. ఓవరాల్‌గా శ్రీదేవి కోసం, ఆమె నటన కోసం మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా ఉందీ మామ్.
ఫైనల్ వర్డ్..
'మామ్'లో శ్రీదేవి నటించలేదు, జీవించింది.
రివ్యూ బై శేఖర్