తారాగణం: సుధీర్ బాబు, నభ నటేష్, వైవా హర్ష, సుదర్శన్, గిరి, జీవా, తులసి తదితరులు
నిర్మాణ సంస్థ: సుధీర్ బాబు ప్రొడక్షన్స్
సంగీతం: అజనీష్
ఎడిటర్: చోటా కే ప్రసాద్
నిర్మాత: సుధీర్ బాబు
రచన-దర్శకత్వం: RS నాయుడు
రేటింగ్: 3/5
భిన్నదృవాలైన నాయకానాయికల మధ్య ఓ సంఘర్షణను సృష్టించి అందులోంచి సరిపడినంత డ్రామాను పండించడం ప్రేమకథా చిత్రాల్లో సాధారణ ఫార్ములానే. అయితే కథా వస్తువులోని వైవిధ్యం, ఆవిష్కరించే విధానంలో కొత్తదనం, పాత్రల చిత్రణలో నవ్యత ఉంటే ఈ రొటీన్ ఫార్ములానూ ఎన్నిసార్లయినా జనరంజకంగా తీర్చిదిద్దవచ్చు.
నన్ను దోచుకుందువటే చిత్రానికి నూతన దర్శకుడు ఆర్.ఎస్.నాయుడు ఇదే సూత్రాన్ని పాటించాడు. సమ్మోహనం చిత్రంతో ఈ ఏడాది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సుధీర్‌బాబు ఈ సినిమాతో నిర్మాణరంగంలోకి అడుగుపెట్టాడు. ఆయన సంస్థ నుంచి వస్తున్న మొదటి చిత్రంగా నన్ను దోచుకుందువటే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఇంతకి ఈ ప్రేమకథ విశేషాలేమిటో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే..
కథ
కార్తీక్ (సుధీర్ బాబు) ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తుంటాడు. పనిలో చాలా స్ర్కిక్ట్. ఆఫీసులో అందరిని హడలెత్తిస్తుంటాడు. ప్రతి విషయంలో ప్రాక్టికల్‌లో ఆలోచిస్తుంటాడు. ప్రమోషన్ ద్వారా అమెరికా వెళ్లాలన్నది అతని లక్ష్యం. మరోవైపు తన కూతురును కార్తీక్ కు ఇచ్చి పెళ్లిచేయాలని ఊళ్లో ఉండే అతని మేనమామ కోరుకుంటాడు. అయితే తాను మరో యువకున్ని ఇష్టపడుతున్నానని, తనకు పెళ్లి ఇష్టంలేదని కార్తీక్‌తో చెబుతుంది అతని మరదలు (వర్షిణి).
ఈ పెళ్లి నుంచి తప్పించుకోవడానికి ఆఫీసులో తాను సిరి అనే ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నానని తండ్రి నాజర్‌తో అబద్ధం చెబుతాడు కార్తీక్. ఆ అమ్మాయిని చూడటానికి కార్తీక్ తండ్రి హైదరాబాద్‌కు వస్తాడు. దీంతో షార్ట్‌ఫిలిమ్స్‌లో నటించే మేఘన (నభ నటేష్)ను కొన్ని రోజుల పాటు తన ప్రేయసిగా వుండమని కార్తీక్ కోరతాడు. ఈ క్రమంలో ఏం జరిగింది? అబద్ధంతో మొదలైన కార్తీక్, మేఘన పరిచయం ఎలాంటి మలుపులు తిరిగింది? వీరిద్దరి ప్రయాణంలో ఎదురైన సంఘటనలేమిటి? చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన కార్తీక్ తన తండ్రి ఆశయాన్ని నెరవేర్చడానికి చివరకు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానమే మిగతా చిత్ర కథ.
నటీనటుల పనితీరు..
ఈ సినిమాలో సుధీర్‌బాబు ఎక్కువశాతం సీరియస్‌గా కనిపిస్తాడు. అయితే పాత్రోచితంగా మంచి నటనను కనబరిచాడు. క్లైమాక్స్ ఘట్టాల్లో మరింత ఉద్వేగాల్ని పండిస్తే బాగుండేదనిపించింది.
ఇక ఈ సినిమాలో కథానాయిక నభ నటేష్ పాత్ర ప్రతి ఒక్కరికి గుర్తిండిపోతుంది. చలాకీ అమ్మాయిగా చక్రాల్లాంటి కన్నులతో అద్బుతమైన అభినయాన్ని ప్రదర్శించింది. థియేటర్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి రావడం వల్ల నభ నటేష్ సహజమైన నటనను ప్రదర్శించగలిగింది. తెలుగులో ఆమె కెరీర్‌కు ఈ సినిమాను శుభారంభంగా చెప్పవచ్చు.
ఇక నాజర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమి లేదు. క్లైమాక్స్ ఘట్టాల్లో తనదైన నటనతో ప్రాణం పోశాడు. వైవా హర్ష మంచి కామెడీ పండించాడు. సుదర్శన్, గిరి, జీవా తమ పరిధుల మేరకు నటించారు. కథానాయిక తల్లిగా తులసి మెప్పించింది.
విశ్లేషణ..
భిన్న మనస్తత్వాలు కలిగిన నాయకానాయికల మధ్య జరిగే సాధారణ ప్రేమకథ ఇది. అయితే చక్కటి హాస్యం, అక్కడక్కడా ఆర్థ్రమైన భావోద్వేగాలతో దర్శకుడు ఈ చిత్రాన్ని అందమైన ప్రేమకథగా మలిచాడు. తనదైన ప్రాక్టికల్ ప్రపంచంలో జీవిస్తుంటాడు కార్తీక్. అమెరికా వెళ్లడం, ఊరిలో తండ్రి కోల్పోయిన పొలాల్ని తిరిగి సంపాందించుకోవడం అతని లక్ష్యం.
అతనికి పూర్తి భిన్న మనస్తత్వం మేఘనాది. షార్ట్‌పిలిమ్స్‌లో తనకంటూ ఓ ఐడెంటిటీని సృష్టించుకుని ఎలాంటి బాదరబందీ లేకుండా జీవితాన్నిగడపాలనుకుంటుంది. ప్రతి విషయాన్నిసరదాగా తీసుకుంటుంది. ఓ సన్నివేశంలో గుడిలో బిచ్చగాడికి వందరూపాయలు ఇస్తుంది మేఘన. ఆ బిచ్చగాడిదంతా నటన..అతను నిన్ను మోసం చేశాడని కార్తీక్ అంటాడు. వాడి నటన నచ్చే వందరూపాయలు ఇచ్చానని చెబుతుంది మేఘన. ఈ ఒక్క సీన్‌లోనే మేఘన, కార్తీక్ పాత్రల తాలూకు స్వరూపాల్ని చక్కగా తెలియజేశాడు దర్శకుడు.
ప్రథమార్థంలో మంచి వినోదం పండింది. కార్తీక్ తన ఆఫీస్ కొలీగ్స్‌తో ప్రవర్తించే తీరు, మేఘన, కార్తీక్ తండ్రి మధ్య చోటుచేసుకునే సంఘటనలు చక్కటి వినోదాన్ని పండించాయి. ముఖ్యంగా వైవాహర్ష దర్శకుడిగా షార్ట్ ఫిల్మ్ ఎపిపోడ్ కడుపుబ్బా నవ్వించింది. వీడు నవరసాల్లో ఏ రసాన్ని దగ్గరకు రానివ్వడం లేదు...అంటూ వైవా హర్ష కార్తీక్ మీద విసుక్కునే సన్నివేశంలో మంచి పంచ్‌లు పడ్డాయి. ప్రేయసిగా నటిద్దామని కార్తీక్ దగ్గరకు వచ్చిన మేఘన క్రమంలో అతని ప్రేమలో పడుతుంది. అయితే ఇందుకు దారితీసిన బలమైన సన్నివేశాల్ని దర్శకుడు రాసుకోలేదనిపించింది. అయితే ప్రథమార్థమంతా చక్కటి వినోదంతో హాయిగా సాగింది.
ఇక ద్వితీయార్థంలో కార్తీక్, మేఘన పరస్పరం తమ ప్రేమను వ్యక్తం చేసుకోవడానికి ప్రయత్నించడం, ఈ క్రమంలో ఏర్పడే మనస్పర్థలు, అపోహల్ని భావోద్వేగభరితంగా ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. సెకండాఫ్‌లోని కొన్ని సన్నివేశాల్లో కథాగమనం మందగించినట్లుగా కనిపించింది. అయితే పతాక ఘట్టాల్లో మంచి సెంటిమెంట్‌ను పండించాడు.
సుధీర్‌బాబు, నాజర్ మధ్య క్లైమాక్స్ హార్ట్ టచింగ్‌గా అనిపించింది. నేను ఇన్నిరోజులు కోల్పోయింది పొలాల్ని, ఆస్తుల్ని కాదు..మీ అమ్మను..ఆ వెలితితోనే నా మోముపై చిరునవ్వు మాయమైందంటూ నాజర్ చెప్పే సంభాషణలు హృద్యంగా అనిపించాయి. షార్ట్ ఫిలిమ్ నేపథ్యంలోనే కథకు ముగింపుకు తీసుకురావడం బాగుంది. మొత్తంగా ద్వితీయార్థంలో కొన్ని సన్నివేశాలు సాగతీతగా అనిపించినా సన్నివేశాల్లోని ఎమోషన్ వల్ల ప్రేక్షకులకు ఎక్కడా బోర్ అనిపించదు.
ఇక సాంకేతికాంశాల విషయానికొస్తే ..
సురేష్ రగుతు ఛాయాగ్రహణం కొన్ని సన్నివేశాల్ని అందంగా తెరపైకి తీసుకొచ్చింది. అజనీష్ లోకనాథ్ సంగీతం ఏమంతగా ఆకట్టుకోలేదు. ఒక్క పాట కూడా గుర్తుంచుకునేలా లేకపోవడం లోటుగా చెప్పవచ్చు. అయితే నేపథ్య సంగీతం కొన్ని సన్నివేశాలకు బాగానే కుదిరింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. స్వీయనిర్మాణంలో తొలి చిత్రం కాబట్టి ఈ సినిమాపై సుధీర్‌బాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు.
ఇక దర్శకుడు ఆర్.ఎస్.నాయుడుకి చక్కటి హాస్య చతురత వుంది. మామూలు సీన్‌లో కూడా మంచి కామెడీని పండించే ప్రయత్నం చేశాడు. రొటీన్ కథను తనదైన సృజనాత్మకతతో ఆసక్తికరంగా చెప్పే ప్రయత్నం చేశాడు. దర్శకుడిగా అతను ప్రతి విషయంలో సఫలీకృతుడయ్యాడని చెప్పవచ్చు.
ఆఖరి మాట:
రొటీన్ ప్రేమకథ అయినా ఇందులో ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని అందించాడు దర్శకుడు. నాయకానాయికల పాత్ర చిత్రణలో నవ్యత ప్రధానంగా ఆకట్టుకుంటుంది. ఈ ప్రేమకథలో మంచి భావోద్వేగాలు పండాయి. ఎక్కువ నాటకీయత లేకుండా సహజంగా సాగిపోవడం ప్రధానాకర్షణగా నిలుస్తుంది. ట్రెండీ లవ్‌స్టోరీగా ప్రేక్షకుల హృదయాల్ని దోచుకుంటుంది..
రివ్యూ రాసింది శ్రీ