తారాగణం: రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి
నిర్మాణ సంస్థ: దృశ్యం ఫిలిమ్స్
ఛాయాగ్రహణం: స్వప్నిల్
కథ: అమిత్
కథనం: అమిత్ & మయంక్
నిర్మాతలు: మనిష్ ముంద్ర
దర్శకత్వం: అమిత్
యూజర్ రేటింగ్: 3.5/5
హిందీ చలనచిత్ర పరిశ్రమలో ఈ తరంలో వచ్చిన ప్రతిభావంతులైన నటుల్లో ముందు వరుసలో ఉండే నటుడు ఎవరు అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చే పేరు- రాజ్ కుమార్ రావు. అతితక్కువ కాలంలోనే ఇతని నటనతో అనేక అవార్డులని తన ఖాతాలో వేసుకోవడంతో పాటుగా ప్రేక్షకుల మనస్సులో సైతం చోటు దక్కించుకోగలిగాడు. ఇక ఇతను నటించిన తాజా చిత్రం న్యూటన్ మన దేశం నుండి ఆస్కార్ అవార్డులకి ఎంట్రీగా పంపడంతో ఈ చిత్రం పై ఆసక్తి మరింత పెరిగింది. ఇక ఈ చిత్రానికి సంబందించిన సమీక్షని ఈ క్రింద చదవండి-
కథ...
న్యూటన్ కుమార్ (రాజ్ కుమార్ రావు) ఒక ప్రభుత్వ క్లర్క్, ఇతను సమయపాలనకి అలాగే నిజాయితీకి పెట్టింది పేరు. దేశంలో ఎన్నికల నేపధ్యంలో ఈయన చత్తీస్గఢ్ రాష్ట్రంల్లోని దండకారణ్యంలో ఎలక్షన్ నిర్వహించేందుకు ప్రీసైడింగ్ ఆఫీసర్ గా నియమింపబడతాడు. అక్కడికి చేరుకున్న తరువాత న్యూటన్ కి అక్కడ శాంతిభద్రతలు నిర్వహిస్తున్న కమాండ్ ఆఫీసర్ (పంకజ్ త్రిపాఠి)కి మధ్య అభిప్రాయ భేధాలు రావడం వాటితో పాటే అక్కడ ఉన్న గోండ్లని ఒప్పించి ఎలా ‘ఫ్రీ అండ్ ఫెయిర్’ ఎలక్షన్ జరపడంలో విజయవంతం అయ్యాడా లేదా అనేది తెర పై చూడాలి.
కొసమెరుపేంటంటే- వీరు వెళ్లే పోలింగ్ బూత్ లో ఉండే ఓట్ల సంఖ్య 76.
నటీనటుల పనితీరు..
రాజ్ కుమార్ రావు: ఇతను చాలా భాగా నటించాడు అని చెబితే అది హాస్యాస్పదమే, ఎందుకంటే అత్యంత ప్రతిభావంతుడు అయిన ఈ నటుడుకి ఈ పాత్రలో ఇమిడిపోవడానికి పెద్దగా సమయం పట్టలేదు అన్నది ఈ చిత్రం చూస్తుంటే మనకి తెలిసిపోతుంది. ఒక నిజాయీతీ, ఎటువంటి పరిస్థితుల్లోనూ రూల్స్ అతిక్రమించకుండా వాటికి లోబడి పనిచేసే ఒక ఉద్యోగిగా న్యూటన్ పాత్రలో ఒదిగిపోయాడు.
పంకజ్ త్రిపాఠి: సెక్యూరిటీ ఆఫీసర్ గా తన దర్పాన్ని చూపెడుతునే అక్కడ ఉండే పరిస్థితుల్లో తను ఏవిధంగా నడుచుకుంటే సమంజసం అనేది తన నటన ద్వారా మనకి చెప్పగలిగాడు. పంకజ్ తనకున్న అనుభవంతో ఈ పాత్రని చాలా సమర్ధవంతంగా చేసాడు అనే చెప్పాలి.
రఘుబీర్ యాదవ్: న్యూటన్ కి సహాయకుడిగా ఈయన చేసిన నటన అందరిని ఆకట్టుకుంటుంది. ఇతను పలికే సంబాషణలు ధియేటర్ లో నవ్వులు పూయిస్తాయి. అక్కడ నివసించే మహిళ అయిన మల్కో పాత్రలో అంజలి పాటిల్ చాలా బాగా నటించింది.
లెజెండరీ నటుడు సంజయ్ మిశ్రా కొన్ని నిముషాలు పాటే కనిపించినా అతని డైలాగ్స్ గుర్తుండిపోతాయి.
విశ్లేషణ:
ఈ న్యూటన్ చిత్రానికి కథారచయత-దర్శకుడు ఒకడే కావడం ఈ చిత్రానికి ప్రధానంగా జరిగిన లాభం. ఎందుకంటే ఇటువంటి కథాంశాలు తెరకెక్కించే సమయంలో స్క్రిప్ట్ పరంగా అన్ని చూపించలేకపోవచ్చు. అయితే అమిత్ ఈ చిత్రానికి రెండు పాత్రలు నిర్వహించడంతో ఒక విధంగా తను రాసుకున్న కథకి న్యాయం చేశాడనిపిస్తుంది.
ఇదే సమయంలో ఆయన ప్రస్తావించిన ‘ఆదివాసీలు’ జీవితాలు అలాగే వారికి మన దేశంలోని మిగితా ప్రాంతాలకి ఎటువంటి తేడా ఉంది అని చూపెట్టగలిగాడు. ఇందులో మల్కో పాత్ర చెప్పే ఒక డైలాగ్ ఉంటుంది- “మీరు మాతో కొన్ని గంటల దూరంలోనే ఉంటారు అయినా సరే మేము ఏంటి అనేది మీకు తెలియదు”.
అలానే దండకారణ్యంలో పోలీసులకి-మావోయిస్టులకి జరిగే ఆధిపత్య పోరులో గోండ్లు నరకం చూస్తున్నారు అనే విషయం చెప్పడం వంటివి ఈ చిత్రానికి హైలైట్ అని చెప్పొచ్చు. అమిత్ ఒకరకంగా మన దేశం ఇంత అభివృద్ధి చెందుతున్నా ఇంకా కొన్ని ప్రాంతాల్లో అభివృద్ధి ఛాయలు కూడా కనిపించడంలేదు అని అందరికి చెప్పే ప్రయత్నం చేశాడు.
మరీ ముఖ్యంగా ఆదివాసీలు తమలో నాటుకుపోయిన భావాన్ని ఈ చిత్రం ద్వారా చెప్పాడు. అదే- ఏ ఎలక్షన్ జరిగినా తమ జీవితాల్లో వచ్చే మార్పు ఏమి లేదు అని వాళ్ళు చెప్పే మాటే దీనికి నిదర్శనం.
ఒక మంచి కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తమ నటనతో నటీనటులంతా మరో స్థాయికి తీసుకెళ్ళారు. ఇక మన దేశం నుండి ఆస్కార్ ఎంట్రీ కి వెళ్ళిన ఈ సందర్భంగా మా తరపున ‘ఆల్ ది బెస్ట్’ చెబుతున్నాము.
ప్లస్ పాయింట్స్:
+ కథాంశం
+ నటీనటులు
+ దర్శకత్వం
+ సంభాషణలు
మైనస్ పాయింట్:
- అన్ని వర్గాలని ఆకర్షించకపోవచ్చు
ఆఖరి మాట: ఒక మంచి అదే సమయంలో ఒక కొత్త సబ్జెక్ట్ ని చూడాలంటే ‘న్యూటన్’ చూడొచ్చు..
రివ్యూ బై సందీప్