నటీనటులు: సూర్య శివకుమార్, సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్, జగపతిబాబు తదితరులు.
దర్శకత్వం: సెల్వ రాఘవన్
నిర్మాతలు: ఎస్ ఆర్ ప్రభు, ప్రకాష్ బాబు ఎస్ ఆర్
సంగీతం: యువన్ శంకర్ రాజా
సినిమాటోగ్రఫర్: శివకుమార్ విజయన్
విడుదల తేదీ: మే 31, 2019
రేటింగ్: 2/ 5
రాజకీయం.... సినిమాకథలకు ఓ మాంఛి ముడిసరుకయ్యింది. అదీ.... ఇలాంటి హాట్ పొలిటికల్ సీజన్‌లో అయితే అలాంటి కథలకు ఉన్న డిమాండే వేరు. అందుకే పొలిటికల్ థ్రిల్లర్లు వరుస కడుతున్నాయి. పెద్ద హీరోలు కూడా ఇలాంటి కథల్లో నటించడానికి సిద్ధమైపోతున్నారు. ఓ సామాన్యుడు రాజకీయ శక్తిగా ఎదగడం, వ్యవస్థలో మార్పు తీసుకురావడం లాంటి కథలు ఇది వరకు చాలా చూశాం. విన్నాం. `ఎన్‌జీకే` కూడా ఆ తరహా కథే. మరి `ఎన్‌జీకే`లో పొలిటికల్ డ్రామా ఎంత వరకూ పండింది?? సూర్య తన అభిమానుల్ని ఎంత వరకూ మెప్పించగలిగాడు? సుదీర్ఘ విరామం తరవాత మెగాఫోన్ పట్టిన శ్రీరాఘవ ఫామ్‌లోకి వచ్చాడా, లేదా?
* కథ
నందగోపాల కృష్ణ (సూర్య) ఇంజనీరింగ్ పట్టభద్రుడు. అయితే సొంతూరిలో ఉంటూ సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేసుకుంటుంటాడు. చుట్టుపక్కల వాళ్లకు తనకు తోచిన రీతిలో సాయం చేస్తూ... మంచి వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకుంటాడు. అయితే గోపాలకృష్ణతో స్థానిక ఎం.ఎల్.ఏకి గొడవ మొదలవుతుంది. అది సద్దుమణి తన దగ్గరే సహాయకుడిగా పని ఇస్తాడు. ఎం.ఎల్.ఏ దగ్గర పనిచేస్తూనే, రాజకీయంగా ఓనమాలు నేర్చుకోవడం మొదలెడతాడు గోపాలకృష్ణ. అలా మొదలైన గోపాలకృష్ణ ప్రయాణం.. రాష్ట్ర రాజకీయాల్ని ప్రభావితం చేసేంతగా మలుపు తిరుగుతుంది. ఆ మలుపుకి కారణం ఏమిటి? రాజకీయంగా నందగోపాలకృష్ణ ప్రజల్లో తీసుకొచ్చిన మార్పు ఎలాంటిది? ఈ ప్రయాణంలో తనకు ఎదురైన ఒడిదుడుకులేంటి? అనేదే కథ.
* నటీనటులు
సూర్యలోని నటుడి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. కాకపోతే శ్రీరాఘవ శైలి విభిన్నం. ఆ స్టైల్‌లోకి కూడా సూర్య బాగానే ఇమిడిపోగలిగాడు. సీరియస్ డైలాగులు చెబుతున్నప్పుడు సూర్య నటన మరింత బాగుంది. ఇద్దరు కథానాయికలున్నా.. ఎవరి పాత్రకూ సరైన న్యాయం జరగలేదు. సాయిపల్లవిలాంటి నాయికకి ఇలాంటి పాత్ర ఇస్తారా? రకుల్ పాత్రకున్న ప్రాధాన్యం కూడా చాలా తక్కువ.
* సాంకేతిక వర్గం
యువన్ శంకర్ రాజా పాటలెందుకో... ఈసారి రాణించలేదు. దానికి తోడు పాటల్లో తమిళ వాసన ఎక్కువ. కెమెరాపనితనం ఆకట్టుకుంటుంది. నిర్మాణపరంగా ఎక్కడా రాజీ పడలేదని అర్థం అవుతుంది. తప్పు కథ విషయంలోనే జరిగిపోయింది. ఇంత సాధారణమైన కథకి శ్రీరాఘవ న్యాయం చేయలేకపోయాడు. తన టేకింగ్ మినహాయిస్తే... మలుపులు, మెరుపులూ కరువయ్యాయి. వినోదానికి ఏమాత్రం ఆస్కారం ఇవ్వకుండా ఓ సీరియస్ పొలిటికల్ డ్రామాని మహా బోరింగ్ గా తీర్చిదిద్దాడు.
* విశ్లేషణ
ఎన్‌జీకే చూస్తుంటే రానా- తేజల సినిమా `నేనే రాజు నేనే మంత్రి` గుర్తొస్తుంది. ఈ రెండు సినిమాల్లోనూ కథానాయకుడి పాత్ర చిత్రణ, తను రాజకీయంగా ఎదిగిన విధానం ఒకేలా ఉంటాయి. కాకపోతే.. ఈ కథని శ్రీరాఘవ తనదైన స్టైల్లో తీసే ప్రయత్నం చేశాడు. ఓ సామాన్యుడు, అసామాన్య రాజకీయ శక్తి గా ఎదగడం అనే పాయింట్ చిత్రసీమకు కొత్త కాదు. చాలాసార్లు నలిగిపోయినదే. దాన్ని శ్రీరాఘవ కొత్తగా ఎలా తీశాడో? సూర్య ఎలా చేశాడో? అనే ఆసక్తి రేగడం సహజం.
అయితే.. శ్రీరాఘవ అదే పాత కథని, అదే పాత పద్ధతిలో తీస్తూ... ఆ ఆసక్తిని సీను సీనుకూ చంపుకుంటూ వెళ్లాడు. కథలోకి వెళ్లడానికీ, పాత్రల్ని పరిచయం చేయడానికీ దర్శకుడు చాలా సమయం తీసుకున్నాడు. ఎక్కడో సేంద్రియ వ్యవసాయం అంటూ మొదలైన కథ - రాజకీయంగా మలుపు తీసుకోవడానికి చాలా సమయం పడుతుంది. పొలిటికల్ టర్న్ తీసుకున్న తరవాత కథలో వేగం వస్తుందని ఆశించడం కూడా అత్యాసే అవుతుంది. బలవంతంగా ఇరికించిన ఇంట్రవెల్ బ్యాంగ్‌తో... `హమ్మయ్య సగం సినిమా అయ్యింది` అనిపిస్తుంది.
ద్వితీయార్థంలో సన్నివేశాలు చూస్తే... తొలి సగమే బాగుందన్న ఫీలింగ్ కలుగుతుంది. కథలో బలం లేనప్పుడు, మలుపులు కరువైనప్పుడు సన్నివేశాల్ని పేర్చుకుంటూ వెళ్లి, దానికి శుభం కార్డు జోడించడం తప్ప చేసేదేం ఉండదు. ఎన్‌జీకే విషయంలోనూ అదే జరిగింది. ఇంత బలహీనమైన కథని క్లైమాక్స్ వరకూ ఈడ్చుకెళ్లడానికి దర్శకుడు చాలా కష్టపడ్డాడు. ద్వితీయార్థంలో లాజిక్కులు లేని సన్నివేశాలు చాలా వచ్చిపోతుంటాయి. రాజకీయంగా ఏమాత్రం బలం లేని ఓ యువకుడ్ని చూసి, రాష్ట్ర ప్రభుత్వం తల్లడిల్లిపోవడం - చాలా కృతకంగా అనిపిస్తుంది.
సన్నివేశాల అల్లికలో సహజత్వం కోసం తపించే శ్రీరాఘవ.. ఇలాంటి లాజిక్కు లేని సన్నివేశాలతో వస్తాడని ఎవ్వరూ ఊహించలేరు. ఇదే కథని తేజ ఇంతకంటే బాగా, గొప్పగా తీశాడపిపిస్తుంది. `నేనే రాజు నేనే మంత్రి` బాగా ఆడిందంటే కారణం.. దాన్ని కేవలం పొలిటికల్ డ్రామా కోణంలోనే చూడలేదు. అందులో భార్యాభర్తల అనుబంధానికీ పెద్ద పాట వేశాడు. నేటి రాజకీయాలపై చురక అంటించాడు. కనీసం అలాంటి ప్రయత్నాలేం ఈ సినిమాలో కనిపించవు.
* ప్లస్ పాయింట్స్
+ సూర్య
* మైనస్ పాయింట్స్
- మిగిలినవన్నీ
* ఫైనల్ వర్డిక్ట్: బోరింగ్ పొలిటికల్ డ్రామా
- రివ్యూ రాసింది శ్రీ.