నటీనటులు: సుందీప్ కిషన్, అన్య సింగ్, వెన్నెల కిశోరె తదితరులు
దర్శకత్వం: కార్తీక్ రాజు.
నిర్మాణ సంస్థలు: దయ పాణెం, సుందీప్ కిషన్, విజి సుబ్రహ్మణ్యం
సంగీతం: థమన్
సినిమాటోగ్రఫర్: పీ.కే. వర్మ
విడుదల తేదీ: 12 జులై, 2019
రేటింగ్: 2.5/5
సందీప్‌కిషన్‌కి తెలుగుతోపాటు తమిళంలోనూ మంచి గుర్తింపు ఉంది. అయితే తెలుగుతో పోలిస్తే తమిళంలోనే ఆయనకి ఎక్కువ విజయాలు లభించాయి. రచ్చే కాదు... ఇంట కూడా గెలవాలనే తపన ఆయనలో ఉందిప్పుడు. ఈసారి కాస్త కొత్తగా హారర్ కథని ఎంచుకుని `నిను వీడని నీడని నేనే` అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చాడు.
ప్రచార చిత్రాలు ఆసక్తిని రేకెత్తించాయి. సందీప్‌కిషన్ ఈ చిత్రంకోసం నిర్మాతగా కూడా మారడం విశేషం. మరి సినిమా ఎలా ఉంది? కథానాయకుడిగా, నిర్మాతగా సందీప్‌కిషన్‌కి ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్నిస్తుంది? తదితర విషయాల్ని తెలుసుకుందాం పదండి.
* కథ
అర్జున్ (సందీప్‌కిషన్)కి ఆవేశం ఎక్కువ. కానీ మాధవి ( అన్యాసింగ్) చెబితే మాత్రం వింటాడు. కాలేజీలోనే ఆ ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. అది పెళ్లివరకు దారితీస్తుంది. ఇంట్లోవాళ్లని ఎదురించి పెళ్లి చేసుకున్న ఇద్దరూ హాయిగా జీవితం వెళ్లదీస్తుంటారు. ఇంతలో అనుకోకుండా ఓ ప్రమాదం. అక్కడ్నుంచే కథ మలుపు తిరుగుతుంది.
అద్దంలో చూసుకుంటే ఇద్దరికీ వేరే మొహాలు కనిపిస్తుంటాయి. ఆ మొహాలు రిషి (వెన్నెలకిషోర్), ఆయన భార్య దియాలవని తెలుస్తుంది. ఇంతకీ రిషి, దియాలతో అర్జున్, మాధవిలకి సంబంధమేమిటి? వాళ్లు నిజంగా ప్రమాదంలో చనిపోయారా లేక ఎవరైనా హత్య చేశారా? ఎన్నాళ్లు ఒకరి దేహంలో మరొకరు ఉన్నారు? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
* నటీనటులు
సందీప్‌కిషన్, అన్యాసింగ్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఇద్దరి మధ్య రొమాంటిక్ సన్నివేశాలు బాగా పండాయి. సందీప్‌కిషన్ స్టైలిష్‌గా కనిపిస్తూనే, హారర్ కథలకి తగ్గట్టుగా అక్కడక్కడా అలరించారు. సెంటిమెంట్‌ని కూడా బాగా పండించాడు.
అన్యాసింగ్ సహజంగా నటించింది. వెన్నెలకిషోర్ ప్రథమార్థంలో అద్దంలో మాత్రమే కనిపిస్తుంటారు. కానీ ఆయన కనిపించిన ప్రతిసారీ మంచి వినోదం పండుతుంటుంది. ద్వితీయార్థంలో ఆయన నేరుగా కనిపించి సెంటిమెంట్‌ని కూడా పండిస్తారు.
పోసాని కృష్ణమురళి దెయ్యాలంటే భయపడే పోలీసు అధికారిగా నవ్విస్తారు. మురళీశర్మ, ప్రగతి, పూర్ణిమా భాగ్యరాజ్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు.
* సాంకేతిక వర్గం
సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. తమన్ నేపథ్య సంగీతం, ప్రమోద్ వర్మ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. కార్తీక్ రాజు కొత్త అంశాన్ని స్పృశించాడు. సందీప్‌కిషన్ స్వీయ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. సినిమా స్థాయికి తగ్గట్టుగా నిర్మాణ విలువలున్నాయి.
థ‌్రిల్లర్ కథల్లో మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించిన చిత్రమిది. కథ కొత్తగా ఉన్నప్పటికీ... కథనం పరంగా మాత్రం దర్శకుడి కసరత్తులు సరిపోలేదు. ఇలాంటి కథలకి మరింత వినోదం, ఉత్కంఠ తోడైనప్పుడే ఫలితాలొస్తాయి. సందీప్‌కిషన్ మాత్రం నిర్మాతగా తొలి ప్రయత్నం కొత్తగానే చేశాడు. కథానాయకుడిగా కూడా ఆయన ఇలాంటి కథలో కనిపించింది తొలిసారి.
* విశ్లేషణ
సూపర్‌నేచురల్ థ్రిల్లర్ కథతో రూపొందిన చిత్రమిది. ఆరంభ సన్నివేశాలు హారర్ సినిమాని తలపించినా... ఆ తర్వాత మిస్టరీనే కీలకంగా మారుతుంది. చాలా సినిమాల్లో అకారణంగా భయపెట్టే ఆత్మలు ఇందులో మాత్రం ఫ్రెండ్లీగా మారిపోతాయి. అసలు ఒకరిలోకి మరొకరి ఆత్మ ఎలా వచ్చిందన్న విషయాన్ని పసిగట్టేందుకే ఆత్మలు, మనుషులు కలిసిమెలిసి పనిచేస్తాయి. ఆ క్రమంలో తెలిసే విషయాలే ఆసక్తిని రేకెత్తిస్తాయి. తరచూ వచ్చే ఆత్మల కథతో పోలిస్తే ఇందులోని మూలకథ భిన్నంగా ఉంటుంది.
అదే సినిమాకి ప్రధానబలం కూడా. అద్దంలో చూసుకుంటున్నప్పుడు ఒకరి బదులు మరొకరు కనిపించడమే ఆసక్తిని రేకెత్తించే విషయం. అదెలా జరుగుతోందనే మిస్టరీని ఛేదించడమే ఇందులో కీలకం. అది తెలుసుకొనేందుకు డాక్టర్లనీ, పోలీసులని సంప్రదిస్తుంటారు అర్జున్, మాధవి. అక్కడ తెలిసే విషయాలే కథలో మలుపులకి కారణమవుతుంటాయి. ప్రథమార్థం మొత్తం ఒకెత్తైతే, విరామ సన్నివేశాలు మరో ఎత్తు. అక్కడే అర్జున్, మాధవి, రిషి, దియాల మధ్య ఏం జరిగిందన్నది తెలుస్తుంది.
విరామం తర్వాత సన్నివేశాలు కాస్త గందరగోళం అనిపించినా... అక్కడ దర్శకుడు తెలివిగా వ్యవహరించి మళ్లీ కథని గాడిలో పెట్టాడు. మధ్యలో హత్య చేశారా అనే అనుమానాన్ని రేకెత్తించి ఆ నేపథ్యంలో సన్నివేశాల్ని తీర్చిదిద్దినా అవన్నీ కూడా సాగదీతలా అనిపిస్తాయి తప్ప కథనాన్ని మాత్రం ఆసక్తికరంగా మార్చలేకపోయాయి. దాంతో సినిమా ద్వితీయార్థం అంతగా ఆకట్టుకోదు. పతాక సన్నివేశాలు సెంటిమెంట్, సందేశాలతో ముడిపెట్టారు. ఇలాంటి కథల్ని కొనసాగించడానికి ఇష్టపడుతుంటారు దర్శకులు. తర్వాత సినిమాకి కూడా మరో బేస్ వేస్తూ కథకి ముగింపునిచ్చారు.
* ప్లస్ పాయింట్స్
+నటీనటులు
+సాంకేతిక వర్గం
* మైనస్ పాయింట్స్
-కాస్త సాగదీత
* ఫైనల్ వర్డిక్ట్: టైమ్ పాస్ వరకూ ఓకే!
- రివ్యూ రాసింది శ్రీ.