'ఆపరేషన్ 2019' మూవీ రివ్యూ & రేటింగ్

మరిన్ని వార్తలు

తారాగణం:  శ్రీకాంత్‌,  దీక్షా పంత్‌, యగ్న శెట్టి, పోసాని కృష్ణమురళి & తదితరులు
సంగీతం:  రాప్‌ రాక్‌ షకీల్
నిర్మాత: అలివేలు
దర్శకత్వం: కరణం బాబ్జీ

రేటింగ్: 1.5/5

పొలిటిక‌ల్ సెటైర్ల‌కు మంచి డిమాండ్ ఉంటుంది. బీ, సీ సెంట‌ర్ల‌లో వీటికి క్రేజ్ ఎక్కువ‌. ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ మంచి ఫామ్‌లో ఉన్న‌ప్పుడు మ‌ధ్య‌మ‌ధ్య‌లో ఒక‌ట్రెండు పొలిటిక‌ల్ సినిమాలు వ‌దిలేవారు. ప‌రుచూరి త‌ర‌వాత‌.. పోసాని కృష్ణ‌ముర‌ళి ఆ బాట ప‌ట్టాడు. `ఆప‌రేష‌న్ దుర్యోధ‌న‌` అప్ప‌ట్లో ఓ షాక్ ట్రీట్మెంట్‌గా త‌గిలింది. శ్రీ‌కాంత్ కెరీర్‌లో అదో మేజ‌ర్ హిట్‌. చాలాకాలం త‌ర‌వాత‌.. శ్రీ‌కాంత్ మ‌రోసారి పూర్తి స్థాయి రాజ‌కీయ నేప‌థ్యం ఉన్న క‌థ‌ని ఎంచుకున్నాడు. ఈసారీ `ఆప‌రేష‌న్‌`ని గుర్తుకు తెచ్చేలా... `ఆప‌రేష‌న్ 2019` అనే పేరు పెట్టాడు. మ‌రి ఈ ప్ర‌య‌త్నం ఎంత వ‌ర‌కూ స‌ఫ‌లమైంది..??  ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నిక‌ల వేడి రాజుకుంటున్న త‌రుణంలో వ‌ర్త‌మాన రాజ‌కీయాల‌కు ఎంత వ‌ర‌కూ అద్దం ప‌ట్టింది?

క‌థ‌

ఎన్‌.ఆర్. ఐ ఉమా శంక‌ర్ (శ్రీ‌కాంత్‌) జైలు నుంచి అడుగుపెడ‌తాడు. ఎమ్‌.ఎల్‌.ఏ కావాల‌న్న‌ది త‌న ఆశ‌. అందుకే కోట్లు వెచ్చించి  ఎమ్‌.ఎల్.ఏ సీటు కొంటాడు. ఓట్ల‌కు నోట్లు ఎర‌వేసి... భారీ మెజారిటీతో గెలుస్తాడు. అక్క‌డి నుంచి రాష్ట్ర రాజ‌కీయాలు తారుమారు అవుతాయి.  ఉమా శంక‌ర్ వ‌ల్ల సీ.ఎం సీటు కూడా ప్ర‌మాదంలో ప‌డుతుంది. ప్ర‌జ‌ల‌కు త‌ప్పుడు వాగ్థానాలు ఇచ్చి ఎం.ఎల్.ఏగా నిలిచిన ఉమాశంక‌ర్‌, ఏ మాట‌నీ నిల‌బెట్టుకోడు. పైగా అడ్డ‌గోలుగా కోట్లు సంపాదిస్తాడు. ఇదంతా ఎందుకు చేస్తున్నాడు..?  త‌న ఉద్దేశం ఏమిటి?  అస‌లు ఉమాశంక‌ర్ వెనుక ఉన్న క‌థేమిటి?  ఇదంతా తెలుసుకోవాలంటే.... `ఆప‌రేష‌న్ 2019` చూడాలి.

న‌టీన‌టుల ప‌నితీరు..

శ్రీ‌కాంత్‌కి ఈమ‌ధ్య సినిమాల్లేవు. ఖాళీగా ఉండ‌డం ఇష్టం లేక ఒప్పుకున్న సినిమాలా అనిపిస్తోంది. ఆప‌రేష‌న్ దుర్యోధ‌న‌లానే .. ఇందులోనూ ఎప్పుడూ సీరియెస్‌గా ఉండ‌డానికే ప్ర‌య‌త్నించాడు. బిల్డ‌ప్ షాట్లు మాత్రం బోలెడ‌న్ని ఉన్నాయి. క‌థానాయిక పాత్ర ఉన్నా లేన‌ట్టే.  నాగినీడు చెప్పుకున్న డ‌బ్బింగ్ ఏదో తేడాగా అనిపించింది. కోట‌కు అస్స‌లు డైలాగులు లేవు. సుమ‌న్‌దీ అతిథి పాత్రే.

విశ్లేష‌ణ‌...

టైటిల్ పెట్టినందుకో ఏమో.. `ఆప‌రేష‌న్ దుర్యోధ‌న‌` ల‌క్ష‌ణాలు ఈ క‌థ‌లో పుష్క‌లంగా క‌నిపిస్తాయి.  క‌ల్ల‌బొల్లి వాగ్దానాల‌తో ఓట‌ర్ల‌ని మ‌భ్య‌పెట్ట‌డం, వాళ్ల ఓట్లు కొని.. ఎమ్‌.ఎల్‌.ఏ అవ్వ‌డం.. ఆ త‌ర‌వాత‌..  ప్ర‌జ‌ల్ని ప‌ట్టించుకోక‌పోవ‌డం - ఇవ‌న్నీ ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో చూస్తున్న విష‌యాలే. ఆప‌రేష‌న్ దుర్యోధ‌న‌లో పోసాని కృష్ణ ముర‌ళి శ్రీ‌కాంత్ తో చెప్పించిన విష‌య‌మూ అదే. అదే పాయింట్‌ని ఈసారి క‌ర‌ణం బాబ్జీ శ్రీ‌కాంత్‌తో చెప్పించాడు. అంతే తేడా.  వ‌ర్త‌మాన విష‌యాల్ని క‌థ‌లో జొప్పిస్తే..  త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల్ని మెప్పించొచ్చు. ఈ విష‌యాన్ని ఇది వ‌ర‌కు చాలా సినిమాలు రుజువు చేశాయి.

ప్ర‌స్తుతం దేశంలో ఎన్నిక‌ల వేడి బాగా రాజుకుంటోంది. ఈ ద‌శ‌లో వ‌చ్చిన సినిమా కాబ‌ట్టి... అంతో ఇంతో.. అటెన్ష‌న్ ఉండ‌డం ఖాయం. దాన్ని ఈ చిత్ర‌బృందం చేచేతులా పాడు చేసుకుంది. రాజ‌కీయాల‌పై సెటైర్ ఇది. దాన్ని  ఎంత బ‌లంగా చెబితే అంత బాగుంటుంది. పైపైన రాసుకున్న స‌న్నివేశాలు, ద‌ర్శ‌కుడికి విష‌య ప‌రిజ్ఞానం బొత్తిగా లేక‌పోవ‌డం ఈ చిత్రానికి ప్ర‌ధాన స‌మ‌స్య‌లుగా మారాయి. ఓ ఎం.ఎల్‌.ఏ అభ్య‌ర్థి ఎన్నిక‌ల్లో నిల‌బ‌డి.. `నేను అధికారంలోకి వ‌స్తే... మ‌ద్య‌పానం నిషేదిస్తా` అని ఎలా మాట ఇవ్వ‌గ‌ల‌డు?  అది సాధ్య‌మా?

సీ.ఎమ్ స్థాయి వ్య‌క్తి చేయ‌ల్సిన వాగ్దానం ఓ ఎమ్.ఎల్‌.ఏ చేయ‌లేడు అని ద‌ర్శ‌కుడికి తెలీదా?  సినిమాలోని స‌న్నివేశాల‌న్నీ నేల విడ‌చి సాము చేస్తూనే ఉంటాయి. ఏవేవో జ‌రిగిపోతుంటాయి. ఏదీ ప్రేక్ష‌కుల మ‌న‌సుల్ని హ‌త్తుకోదు. తొలి స‌గం.. రైతుల స‌మ‌స్య‌లు, శ్రీ‌కాంత్‌కి ఎదురయ్యే చేదు అనుభ‌వాల‌తోనే సాగింది. వాటిలో కొంత కూడా ఎమోష‌న్ పండ‌దు. ద్వితీయార్థంలో రాజ‌కీయ నాయ‌కుడిగా  శ్రీ‌కాంత్ చేసే అవినీతే క‌నిపిస్తుంది.

అదంతా.. డిట్లో ఆప‌రేష‌న్ దుర్యోధ‌న సినిమాని మ‌ళ్లీ చూసిన‌ట్టే అనిపిస్తుంది. చివ‌ర‌కు ఓట్ల డ‌బ్బుల‌కు అమ్ముకోకండి. కులాన్ని బ‌ట్టి, పార్టీని బట్టి కాదు.. మంచి మ‌నుషుల‌కు ఓటేయండి అని తేల్చేశారు. ఈమాత్రం నీతి వాక్యాలు చెప్ప‌డానికి రెండు గంట‌ల కాల‌క్షేపం చేయ‌డం ఎందుకు..?

సునీల్‌, మంచు మ‌నోజ్‌లు ఈ సినిమాలో ప్ర‌త్యేక పాత్ర‌ల్లో క‌నిపించార‌ని, వాళ్ల పాత్ర‌లు చాలా కీల‌క‌మ‌ని చిత్ర‌బృందం గొప్పగా చెప్పింది. వాళ్లు చేసిందేమీ లేదు. సునీల్ ఓ ఇకిరించిన పాట‌లో క‌నిపించి, ఇబ్బందిగా స్టెప్పులేశాడు. మ‌నోజ్ చివ‌ర్లో ఎక్క‌డి నుంచో ఊడిప‌డి.. ఫైట్ చేశాడు. మొత్తానికి ఇవి రెండూ అతికించిన స‌న్నివేశాల్లానే ఉన్నాయి.

సాంకేతిక వర్గం...

ఇలాంటి సినిమాల‌కు పాట‌లు అన‌వ‌స‌రం. కానీ మూడు ఐటెమ్ పాట‌లు ఇరికించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌గా ఓ పాట వాడుకున్నారు. పాట‌లు ఓకే అనిపించినా... నేప‌థ్య సంగీతం లో మాత్రం హోరు ఎక్కువ‌గా వినిపించింది. నిర్మాణ ప‌రంగా చాలా లోటు పాట్లు ఉన్నాయి. బ‌డ్జెట్ స‌హ‌క‌రించ‌లేదేమో. వీలైనంత వ‌ర‌కూ సినిమాని చుట్టేశారు. ద‌ర్శ‌కుడు పాత విష‌యాన్నే  అటు తిప్పి ఇటు తిప్పి చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు. సంభాష‌ణ‌ల్లో ప‌దును చాల లేదు.

* ప్ల‌స్ పాయింట్స్‌

టైటిల్‌

* మైన‌స్ పాయింట్స్‌ 

అన్నీ

పైన‌ల్ వ‌ర్డిక్ట్‌: ప‌రేష‌న్ 2019

రివ్యూ రాసింది శ్రీ.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS