తారాగణం: శర్వానంద్, సాయి పల్లవి, మురళీ శర్మ, సునీల్ & తదితరులు
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
ఎడిటర్: ఎ. శ్రీకర్ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: జయకృష్ణ
నిర్మాణ సంస్థ: శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్
నిర్మాతలు: ప్రసాద్ చుక్కపల్లి, చెరుకూరి సుధాకర్
దర్శకత్వం: హను రాఘవపూడి
రేటింగ్: 2.5/5
ప్రేమ కథల్లో ఓ సౌలభ్యం ఉంటుంది.. ఒక సాధారణ ప్రేమకథను కూడా హృదయాన్ని స్పృశించే భావోద్వేగాల కలబోతతో అందంగా చెప్పవచ్చు. మరోమార్గంలో.. ప్రయోగాత్మక కథను ఎంచుకొని మునుపెన్నడూ ఆస్వాదించని కొత్త అనుభూతిని ప్రేక్షకులకు అందివ్వడం. ఈ రెండు పద్ధతులు సక్సెస్‌ఫుల్ ఫార్ములాలే. అయితే ఏ కథలో అయినా భావోద్వేగాలు, సంఘర్షణ, అర్థవంతమైన ముగింపు ప్రధానాంశాలుగా ఉండాలి. కథతో ప్రేక్షకులు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతూ కన్విన్స్ కావాలి. అంతేగాని ఏదో కొత్త కథను చెబుతున్నామనే భ్రమలో వారికి కన్‌ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేయకూడదు. ఈ ఉపోద్ఘాతాన్ని పడి పడి లేచె మనసు చిత్రానికి చక్కగా అన్వయించవొచ్చు..ఈ సినిమా నాయకానాయికలు శర్వానంద్, సాయిపల్లవి ఇద్దరూ గత కొంతకాలంగా మంచి విజయాలు సాగిస్తున్నారు. దీంతో నిర్మాణం నుంచే ఈ సినిమా అందరిలో ఆసక్తిని పెంచింది. ప్రేమకథా చిత్రాల్ని తనదైన ప్రత్యేకమైన ముద్రతో తెరకెక్కిస్తారని దర్శకుడు హను రాఘవపూడికి పేరుంది. ఇలా ఎన్నో ప్రత్యేకతల సమాహారంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన పడి పడి లేచె మనసు ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం...
కథ
కలకత్తాలో ఫుట్‌బాల్ ప్లేయర్ అయిన సూర్య (శర్వానంద్) మెడికో వైశాలి (సాయిపల్లవి) తొలిచూపులోనే ప్రేమిస్తాడు. ఆమె మనసు గెలుచుకుంటాడు. సూర్యకు ప్రేమ మీద ప్రగాఢమైన నమ్మకం ఉంటుంది. కానీ పెళ్లి అంటే అయిష్టత. తన చిన్నతనంలోనే అమ్మానాన్న మనస్పర్థలతో విడిపోవడంతో పెళ్లి అంటే విముఖత చూపిస్తుంటాడు. ఈ నేపథ్యంలో నేపాల్‌లో ఓ మెడికల్ టూర్‌కు వెళ్లిన వైశాలి అక్కడే సూర్యకు పెళ్లి ప్రపోజల్ చేస్తుంది. వైశాలి ప్రతిపాదనను సూర్య తిరస్కరిస్తాడు. తనకు పెళ్లంటే నమ్మకం లేదని చెబుతాడు. దాంతో ఇద్దరు ఓ ఒప్పందానికి వస్తారు.
ఓ సంవత్సరం తర్వాత నేపాల్‌లోని అదే ప్రదేశంలో తిరిగి కలుకుకుంటే తమ అనుబంధం నిజమని, ఇద్దరం కలిసి జీవితాన్ని సాగించవొచ్చని అనుకుంటారు. ఈ క్రమంలో ఏం జరిగింది? సూర్య, వైశాలి నేపాల్‌లో కలుసుకున్నారా? నేపాల్‌లో సంభవించిన ఓ విపత్తు వారి జీవితాల్ని ఎలా ప్రభావితం చేసింది? వైష్టవికున్న మానసిక రుగ్మత ఏమిటి? చివరకు వారిద్దరి ప్రయాణం సుఖాంతమైందా? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానమే మిగతా చిత్ర కథ..
నటీనటుల పనితీరు..
శర్వానంద్, సాయిపల్లవి జంట చూడముచ్చటగా అనిపించింది. ఇద్దరి మధ్య చక్కటి కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఇద్దరి స్ర్కీన్‌ప్రజెన్స్ అద్భుతంగా అనిపిస్తుంది. శర్వానంద్‌కు ప్రేమకథలు కొత్తేమి కాదు. ఈ సినిమాలో మరింత పరిణితితో కూడిన నటనను కనబరిచాడు. ఇక సాయిపల్లవి కథకు కీలకంగా నిలిచించి. వైశాలి పాత్రకు పూర్తిగా న్యాయం చేసింది. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో సాయిపల్లవి నటన హార్ట్‌టచింగ్‌గా అనిపించింది. కథలో ఎక్కువ భాగం వీరిద్దరి పాత్రల చుట్టూ తిరగడంతో మిగతా పాత్రలకు పెద్దగా ప్రాధాన్యతలేకుండా పోయింది. ప్రియదర్శి, వెన్నెల కిషోర్, సునీల్ తమ పరిధుల మేరకు నవ్వించే ప్రయత్నం చేశారు.
విశ్లేషణ...
కలకత్తా నేపథ్యంలో నడిచే ప్రేమకథ ఇది. ప్రథమార్థమంతా హీరోహీరోయిన్ల మధ్య ప్రేమకు దారితీసే సన్నివేశాల చుట్టే నడుస్తుంది. ఓ అజ్ఞాత ప్రేమికుడిని సృష్టించి..అతని చుట్టూ సన్నివేశాల్ని అల్లుకొని వైష్టవి మనసు గెలుచుకోవడానికి సూర్య చేసే ప్రయత్నాలు ఏమాత్రం ఆకట్టుకునేలా లేవు. అయితే కలకత్తా నేపథ్యం, అక్కడి అందమైన విజువల్స్, శర్వానంద్-సాయిపల్లవి మధ్య రొమాంటిక్ కెమిస్ట్రీ ఫీల్‌గుడ్‌గా ఫ్యాక్టర్‌గా అనిపిస్తుంది. వైశాలిని ఎంతగానో ఇష్టపడి..ఆమె ప్రేమకోసం ఎన్నో ప్రయత్నాలు చేసి విజయం సాధించిన సూర్య...తీరా పెళ్లి ప్రస్తావన వచ్చే సరికి తిరస్కరించడం లాజిక్‌కు అందదు.
అసలు ఇద్దరి మధ్య ప్రేమ కలగడానికి చూపించిన సన్నివేశాలు కూడా అంత బలంగా అనిపించవు. నేపాల్‌లో సంభవించిన భూకంపం ఎపిపోడ్‌తో ఇంటర్వెల్ వేయడం ద్వితీయార్థం ఎలా వుంటుందోననే ఆసక్తిని పెంచింది. అయితే సెకండాఫ్ ఆసాంతం దర్శకుడు తడబడినట్లుగా అనిపిస్తుంది. ఏదో జరుగుతందని ఊహించిన నేపాల్ ఎపిసోడ్‌ను సింపుల్‌గా ముగించి తిరిగి కథను కలకత్తాకు చేర్చడంతో కథనంలో ఉన్న క్యూరియాసిటీ పోయింది. ఇక ద్వితీయార్థంలోని సన్నివేశాలన్నీ సాగతీతగా అనిపిస్తాయి. వైశాలికి ఆమ్నేషియా అనే మానసిక రుగ్మతను ఆపాదిస్తూ కథలో భావోద్వేగాల్ని పండించే ప్రయత్నం కూడా ఏమాత్రం మెప్పించలేదు.
వైశాలి క్రమంగా గత జ్ఞాపకాల్ని కోల్పోతుండటంతో సూర్య ఆమెను కార్తీక్‌గా కొత్తగా పరిచయం చేసుకొని తిరిగి ప్రేమను పొందాలనుకోవడం లాజిక్‌కు అందదు. ప్రీ క్లైమాక్స్ సన్నివేశాలు భావోద్వేగభరితంగా సాగినప్పటికీ కథను ఏమాత్రం జస్టిఫై చేయలేకపోయాయి. మానసిక రుగ్మత చుట్టూ అల్లుకున్న ప్రేమకథలు గతంలో చాలా వచ్చాయి. దాంతో ఈ సినిమాలో కథానాయికకు ఆపాదించిన ఆమ్నేషియా అనే పాయింట్ ఏ మాత్రం కొత్తగా అనిపించదు. క్లైమాక్స్‌ను కూడా ఊహించిన రీతిలోనే ముగించారు. వెన్నెల కిషోర్, శర్వానంద్, సునీల్ మధ్య సెకండాఫ్‌లో వచ్చిన కొన్ని సన్నివేశాలు నవ్వించాయి. అక్కడక్కడా కొన్నిసంభాషణలు హార్ట్ టచింగ్‌గా అనిపించాయి.
సాంకేతిక వర్గం...
జేకే సినిమాటోగ్రఫీ కలకత్తా అందాల్నికన్నులపండువగా ఆవిష్కరించింది. కొన్ని విజువల్స్ సూపర్బ్‌గా అనిపించాయి. ఆర్ట్ వర్క్ కూడా బాగుంది. విశాల్ చంద్రశేఖర్ మంచి సంగీతాన్నందించాడు. కొన్ని పాటలు మెలోడీ ప్రధానంగా ఆకట్టుకున్నాయి. నేపథ్య సంగీతం బాగా కుదిరింది. సాంకేతికంగా అన్ని అంశాలు బాగున్నాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా అనిపించాయి. నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మాణ విషయంలో ఎక్కడా రాజీపడలేదు.
* ప్లస్ పాయింట్స్
- శర్వా, సాయి పల్లవి
- పాటలు
- సంగీతం, ఫోటోగ్రఫీ
* మైనస్ పాయింట్స్
- ద్వితీయార్ధం
- లాజిక్
పైనల్ వర్డిక్ట్: ఈ ప్రేమకథకు శర్వానంద్, సాయిపల్లవి చక్కగా కుదిరారు. కలకత్తా నేపథ్యం సినిమాకు కొత్త శోభను చేకూర్చింది. అయితే పాజిటివ్ అంశాల్ని ఏమాత్రం అనుకూలంగా మలచుకోలేకపోయారు. అంతగా ఆకట్టుకోని కథ, హృదయాన్ని హత్తుకునే బలమైన సన్నివేశాలు లేకపోవడం సినిమాకు మైనస్‌గా నిలిచాయి.
రివ్యూ రాసింది శ్రీ.