తారాగణం: నందమూరి బాలకృష్ణ, శ్రీయ శరణ్, ముస్కాన్, కైరా దత్, కబీర్ బేడి, అలీ, పృద్వీ తదితరులు.
నిర్మాణ సంస్థ: భవ్య క్రియేషన్స్
సంగీతం: అనూప్ రూబెన్స్
ఛాయాగ్రహణం: డి.ముఖేష్
ఎడిటర్: జునైద్ సిద్ధిఖీ
నిర్మాత: వి. ఆనంద్ ప్రసాద్
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం : పూరి జగన్నాధ్
యావరేజ్ యూజర్ రేటింగ్: 3/5
నందమూరి బాలకృష్ణ - పూరి జగన్నాథ్ కాంబినేషన్ పరిశ్రమని ఆశ్చర్యపరిచింది. ఈ కాంబినేషన్ ఎలా సెట్టయిందబ్బా అనే షాక్‌లోంచి తేరుకొనేలోపే... ఆ సినిమా పూర్తయిపోయి - విడుదలైపోయింది. అదే పైసా వసూల్! టైటిల్, స్టంపర్, బాలయ్య పాడిన పాట... ఈ సినిమాపై హైప్ పెంచేశాయి. ఈ సినిమాలో ఏదో ఉండే ఉంటుంది అనే నమ్మకాన్ని కల్పించింది. మరి దాన్ని పూరి నిలుపుకొన్నాడా? ఈసారైనా కొత్త పూరి కనిపించాడా? బాలయ్యని ఎలా చూపించాడు?? తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
* కథ...
బాబ్ మార్లే (విక్రమ్ జిత్) ఇంటర్నేషనల్ మాఫియా డాన్. పోర్చుగల్‌లో ఉండి ఇండియాలో విధ్వంసాలు సృష్టిస్తుంటాడు. అతన్ని పట్టుకొనేందుకు భారత నిఘా వ్యవస్థ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం ఉండదు. చట్టబద్దంగా బాబా మార్లేని ఏం చేయలేకపోతున్నామని గ్రహించిన 'రా' అధిపతి (కబీర్ బేడీ) ఓ నీచ్ కమీనే గ్యాంగ్ స్టర్ కోసం అన్వేషిస్తాడు. అతని ద్వారా బాబ్ ని పట్టుకోవాలన్నది వ్యూహం. ఈ క్రమంలో తేడా సింగ్ (బాలకృష్ణ) కనిపిస్తాడు. తీహార్ జైల్ నుంచి వచ్చిన బ్యాచ్. ఫుల్ మాస్. పక్కా నేల టికెట్. పోలీసుల అండర్ కవర్ ఆపరేషన్‌ని తేడా సింగ్ ఒప్పుకొన్నాడా? బాబ్ మార్లేని ఎలా పట్టుకొన్నాడు?? అనేదే `పైసా వసూల్` కథ.
* నటీనటులు...
ఇది బాలయ్య వన్ మాన్ షో! బాలయ్య ఫ్యాన్స్ అయితే నిరభ్యంతరంగా ఈ సినిమా చూసేయొచ్చు. వాళ్ల టికెట్‌కి సరిపడా.. పైసా వసూల్ గ్యారెంటీ. ఆ స్థాయిలో బాలయ్య విజృంభించాడు. తన ఎనర్జీ సూపర్. ప్రతీ సీన్‌ని ఒకే తరహా ట్యూనింగ్‌తో చేశాడు. ఫైటూ.. పాట... రెండింటిలో బాలయ్య జోష్ ఒకేలా ఉంటుంది. డైలాగ్ చెప్పడంలో కూడా కొత్త రిథమ్ ఫాలో అయ్యాడు. శ్రియ నటన ఆకట్టుకొంటుంది. అయితే గ్లామర్ పరంగా నిరుత్సాహపరుస్తుంది. కైరా దత్, ముస్కాన్‌లవి చిన్న చిన్న పాత్రలే. ఫృథ్వీ రాజ్, అలీ ఉన్నా వాళ్ల స్థాయిలో నవ్వులు పండించలేకపోయాడు. విలన్లకూ చేయడానికి ఏం లేకుండా పోయింది.
* విశ్లేషణ..
పోకిరి తరవాత... పూరి జగన్నాథ్ అదే `లైన్` పట్టుకొని సినిమాలు తీయడం మొదలెట్టాడు. ఆ అలవాటు.. పైసా వసూల్ లోనూ కనిపించింది. పోకిరి.. పైసా వసూల్ కథల మూల సూత్రం ఒక్కటే. అండర్ కవర్ ఆపరేషన్. అయితే ఆ ఆపరేషన్ సాగే పద్ధతి వేరు, చేసే హీరో వేరు.. అంతే తేడా! బాలయ్య తో సినిమా అవకాశం రాగానే.. కేవలం బాలయ్య ఫ్యాన్స్‌ని మెప్పించేలా సినిమా తీస్తే చాలు అని డిసైడ్ అయినట్టున్నాడు పూరి. దానికి తగ్గట్టే రాత - తీత సాగింది. బాలయ్య కనిపించే ప్రతీ సన్నివేశం, వినిపించే ప్రతీ డైలాగ్.. అభిమానుల్ని ఆకట్టుకొంటుంది.
తేడా సింగ్ పాత్రని ఆ స్థాయిలో రాసుకొన్నాడు పూరి. ఈ సినిమాకి వినోదం అందించినా, యాక్షన్‌తో థ్రిల్ చేసినా, డైలాగులతో కిర్రెక్కించినా.. తేడా సింగే చేశాడు. అక్కడి వరకూ పైసా వసూల్ అయిపోతుంది. ఆ చుట్టూ ఉన్న వ్యవహారాలు మాత్రం అంతగా పండలేదు. రొటీన్ కథ పట్టుకొని వేలాడితే.. ఇంతకు మించి ఏం చేయగలడు? ఏం చూపించగలడు?? విశ్రాంతి ఘట్టం ముందొచ్చే ట్విస్ట్, పతాక సన్నివేశాలకు ముందొచ్చే మలుపు.. రెండూ ఊహించడానికి పెద్ద కష్టపడక్కర్లెద్దు. పోర్చులల్ ఎపిసోడ్ ఒక్కటే పూరి కాస్త మనసు పెట్టి తీసినట్టు అనిపిస్తుంది. అక్కడ శ్రియతో సన్నివేశాలు బాగానే వచ్చాయి. ఫస్టాఫ్‌లో తేడా సింగ్ డైలాగులు, మేనరిజంగా ఆఖర్లో ట్విస్టు - పైసా వసూల్ అంటే ఇంతే. యాక్షన్ మోతాదు కూడా ఎక్కువే కనిపిస్తుంది. బాలయ్య కనిపించిన ప్రతీ సన్నివేశం ఓ యాక్షన్ ఎపిసోడ్‌లానే ఉంటుంది. అన్నట్టు ఈ సినిమాలో ఓ డైలాగ్ ఉంది. `ఓన్లీ ఫ్యాన్స్ అండ్ ఫ్యామిలీ, అవుటర్స్ నాట్ ఎలౌడ్` అని. ఈ సినిమా కూడా అలానే తయారైంది.
* సాంకేతిక వర్గం...
పూరి తరహా డైలాగులు ఈ సినిమాలో చాలా ఉన్నాయి. రైటర్‌గా పూరి సక్సెస్. దర్శకుడిగా మాత్రం కాలేకపోయాడు. బాలయ్య లాంటి హీరోని కొత్తగా చూపించాడు గానీ, కొత్త కథ రాసుకోలేకపోయాడు. అనూప్ బాణీలు ఓకే అనిపిస్తాయి. నేపథ్య సంగీతం కూడా అంతంత మాత్రమే. పోర్చుగల్ లో కార్ ఛేజింగులు బాగా తీశారు.యాక్షన్ పార్ట్‌కి ఎక్కువ ఛాన్సున్న సినిమా ఇది. అయితే ప్రతీ ఫైటూ ఒకేలా ఉంది.
* ప్లస్ పాయింట్స్
+ తేడా సింగ్
+ డైలాగులు
+ ట్విస్టులు
* మైనస్ పాయింట్స్
- రొటీన్ కథ
* ఫైనల్ వర్డిక్ట్
పైసా వసూల్ : స‌్ట్రిక్ట్లీ ఫర్ బాలయ్య హార్డ్ కోర్ ఫ్యాన్స్!
రివ్యూ బై శ్రీ