తారాగణం: జగపతిబాబు, పద్మప్రియ, తాన్యా హోప్, సుబ్బరాజు, పోసాని కృష్ణమురళి, రఘుబాబు, శుభలేఖ సుధాకర్, కబీర్‌సింగ్, పృధ్వీ, బేబీ డాలీ తదితరులు
సంగీతం: వసంత్
సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె నాయుడు
దర్శకత్వం: వాసు పరిమి
నిర్మాత: రజిని కొర్రపాటి
నిర్మాణం: వారాహి చలనచిత్రం
యావరేజ్ యూజర్ రేటింగ్: 2.5/5
కథా కమామిషు:
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ని ఓల్డ్ గెటప్‌లో అక్కడి అభిమానులు చూడగలరు. మరీ అంత వయసు అయిపోకపోయినా, తమిళ హీరో అజిత్ తెల్లటి జుట్టు, గడ్డంతో కనిపిస్తే అభిమానులు ఊగిపోతున్నారక్కడ. అదొక స్టైలిష్ లుక్. మరి, మన తెలుగులో ఓ హీరో తెల్లటి జుట్టుతో, మాసిన గడ్డంతో హీరోయిజం ప్రదర్శిస్తే ఎలా ఉంటుంది? ఈ ఆలోచన సంగతెలా ఉన్నా అంతటి డేరింగ్ అయితే చేసేశారు జగపతిబాబు. ఇదొక్కటే 'పటేల్ సర్' సినిమాపై ఎనలేని ఆసక్తిని క్రియేట్ చేసింది. సినిమా ప్రారంభానికి ముందు టీజర్ కట్ చేసిన వైనం, సినిమాపై అంచనాల్ని ముందుగానే పెంచేసింది. 'పటేల్ సర్' అసలు కథేంటంటే, సుభాష్ పటేల్ (జగపతిబాబు) ఇండియన్ ఆర్మీలో మేజర్. తన ముందుతరం వారిలానే తన తర్వాతి తరం కూడా సైన్యంలో చేరి, దేశానికి సేవ చెయ్యాలనుకుంటాడు పటేల్. ఉద్యోగ విరమణ తర్వాత పటేల్, కొత్త బాధ్యతను భుజానికెత్తుకుంటాడు. అదే నలుగుర్ని శతృవులుగా టార్గెట్ పెట్టుకోవడం. ఎవరా నలుగురు? వారినెందుకు పటేల్ టార్గెట్‌గా చేసుకున్నాడన్నది తెరపైనే చూడాలి.
నటీనటులెలా చేశారు?
ఊరికే గెటప్ వేసేసుకుంటే పవర్ వచ్చేయదు. ఆ పాత్రలోకి ఒదిగిపోవాలి. అది తెలుసు గనకనే కథ వినగానే ముందుగా ఫోకస్ గెటప్ మీద పెట్టారు జగపతిబాబు. గెటప్ అదిరింది, జగపతిబాబు నటన సింప్లీ సూపర్బ్. ఈ సినిమా జగపతిబాబు తప్ప ఇంకెవరూ చేయలేరనడం అతిశయోక్తి కాకపోవచ్చు. రెండు వేరియేషన్స్‌లో జగపతిబాబు నటన, ఆహార్యం అంతా అద్బుతం. పద్మ ప్రియ, తాన్యా హోప్ తమ పాత్రల పరిధి మేర బాగానే చేశారు. కబీర్ సింగ్, పృధ్వీ, ప్రభాకర్ నెగెటివ్ రోల్స్‌లో కనిపించారు. ఓకే అనిపిస్తారు కూడా. మిగతా పాత్రధారులంతా బాగానే చేశారు.
సాంకేతిక వర్గం పనితీరు...
సినిమాటోగ్రఫీ బాగుంది. మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. నిర్మాణపు విలువలు బాగానే ఉన్నాయి. మాటలు ఓకే. ఎడిటింగ్ అక్కడక్కడా అవసరం అనిపిస్తుంది. కాస్ట్యూమ్స్, ఆర్ట్ డిపార్ట్‌మెంట్ పనితీరు బాగుంది.
విశ్లేషణ...
ఇదొక రివెంజ్ స్టోరీ. రివెంజ్ ప్లాట్ బాగానే ఉన్నా, రివెంజ్ తీర్చుకునే సన్నివేశాలు ఇంకా ఎఫెక్టివ్‌గా తీసి ఉంటే బాగుండేది. సినిమాలో జగపతిబాబు వన్ మేన్ షో చేశారు. ఆయన వరకూ వంక పెట్టలేం. ఆయన కోసమే మళ్ళీ సినిమా చూడాలనిస్తుంది. అంత బాగా చేశారాయన. విలన్ పాత్రల్ని ఇంకొంచెం ఎఫెక్టివ్‌గా తీసి ఉంటే, హీరోయిజం ఇంకా బాగా ఎలివేట్ అయి ఉండేది. కథ విషయంలో ఇంకాస్త కసరత్తు చేసి ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. సాధారణంగా ఇలాంటి సినిమాల నుంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ని ఆశిస్తారు ఆడియన్స్. జగపతిబాబు తప్ప మరో థ్రిల్లింగ్ ఎలిమెంట్ పెద్దగా కనిపించదు. ఓవరాల్‌గా ఓ మంచి ప్రయత్నమైతే చేశారనిపిస్తుంది.
ఫైనల్ వర్దిక్ట్.. పటేల్ సర్ - జగపతి వన్ మేన్ షో
రివ్యూ బై శేఖర్