నటీనటులు: షారుఖ్ ఖాన్. దీపికా పాడుకొన్, జాన్ అబ్రహం తదితరులు
దర్శకుడు : సిద్దార్థ్ ఆనంద్
నిర్మాత: ఆదిత్య చోప్రా
సంగీత దర్శకులు: సంచిత్ బాళ్హరా అంకిత్ బాళ్హరా
సినిమాటోగ్రఫీ: సత్చిత్ పాలౌస్
ఎడిటర్: ఆరిఫ్ షేక్
రేటింగ్ : 2.75/5
బాలీవుడ్ బాద్ షాగా పేరు తెచ్చుకొన్నాడు షారుఖ్ ఖాన్. ఒకప్పుడు తెరపై షారుఖ్ కనిపిస్తే చాలు కాసులు కురిసేవి. రికార్డులకు కేరాఫ్‌గా నిలిచిన షారుఖ్ కొన్నేళ్లుగా హిట్ కి ఆమడ దూరంలో ఉండిపోయాడు. తన నుంచి సినిమా వచ్చే నాలుగేళ్లయ్యిందంటే పరిస్థితి అర్థం చేసుకోవొచ్చు. షారుఖ్ మాత్రమే కాదు... బాలీవుడ్ లో బడా స్టార్ల పరిస్థితి ఇలానే ఉంది. సౌత్ సినిమాల హవా మధ్య... బాలీవుడ్ కనిపించకుండా పోయింది. ఇప్పుడు షారుఖ్‌కే కాదు.. బాలీవుడ్ కి కూడా ఓ సూపర్ హిట్టు అత్యవసరం. ఇలాంటి పరిస్థితుల్లో బాక్సాఫీసు ముందుకు వచ్చాడు.. `పఠాన్`. యాక్షన్ చిత్రాల స్పెషలిస్టుగా పేరు గాంచిన సిద్దార్థ్ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకుడు.యశ్ రాజ్ ఫిల్మ్స్ భారీ బడ్జెట్ తో రూపొందించింది. `బేషరమ్` పాట వివాదాలకు కేంద్ర బిందువు అయిన నేపథ్యంలో... ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. మరింతకీ భారీ అంచనాల మధ్య వచ్చిన `పఠాన్` ఎలా ఉన్నాడు? షారుఖ్ తన అభిమానుల ఆశలు నెరవేర్చాడా లేదా? తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
* కథ
భారత్ లో మారణహోమం సృష్టించాలని శత్రుదేశమైన పాక్... జిమ్ (జాన్ అబ్రహం) సహాయం కోరుతుంది. జిమ్ భారత మాజీ సైనికుడు. దేశంపై ప్రేమతో ఆర్మీలో చేరిన జిమ్... చివరికి భారత్ కు శత్రువుగా మారిపోతాడు. దేశంపై పగతో రగిలిపోయే జిమ్‌తో పాక్ చేతులు కలుపుతుంది. భారత్ పై బయోవార్ ప్రకటిస్తాడు జిమ్.దాన్ని అడ్డుకోవడానికి ఇండియన్ ఏజెంట్ పఠాన్ (షారుఖ్ ఖాన్) రంగంలోకి దిగుతాడు. ఈ యుద్ధంలో జిమ్‌ని పఠాన్ ఎలా ఎదిరించాడు? అసలు బయోవార్ నేపథ్యం ఏమిటి? ఏజెంట్ రూబై (దీపిక పదుకొణె) షారుఖ్ కి ఎలా సహాయం అందించింది..? ఇదంతా తెరపై చూడాలి.
* విశ్లేషణ
యాక్షన్, స్పై థ్రిల్లర్‌లో ఇంతకంటే కథేం ఉండదు. దేశాన్ని రక్షించడానికి హీరో ఏం చేశాడన్నదే పాయింట్. ఇక్కడా అంతే. దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ కథకంటే.. కమర్షియల్ ఎలిమెంట్స్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు. యాక్షన్ ఎపిసోడ్లూ, ట్విస్టులతో.. ఈ సినిమాని ఓ మంచి కమర్షియల్ ప్యాకేజీ గా రూపొందించాడు. షారుఖ్ ది రొమాంటిక్ ఇమేజ్. తనని ఇలా పూర్తి స్థాయి యాక్షన్ సినిమాలో చూసి చాలా కాలం అయ్యింది. పైగా జాన్ అబ్రహాం, దీపిక పదుకొణెలాంటి స్టార్లు.. ఈ సినిమాకి మరింత ప్లస్ అయ్యారు. అన్నింటికంటే సల్మాన్ ఖాన్ ఎంట్రీ ఆకట్టుకొంటుంది. పాటలూ, ఫైట్లూ, దేశ భక్తీ.. ఇలా అన్నింటినీ రంగరించిన దర్శకుడు.. దీన్ని ఓ భారీ యాక్షన్ సినిమాగా డిజైన్ చేసి, ప్రేక్షకుల ముందు పెట్టాడు.
దేశానికి ఓ ఆపద రావడం, హీరో దాన్ని సాల్వ్ చేయడం ఇది వరకు చాలా సినిమాల్లో చూసిందే. అయితే.. ఈ సినిమాలో బయోవార్ సృష్టించాడు దర్శకుడు. వైరస్ రూపంలో వార్ వస్తే.. ఎలా ఉంటుందో ఓ సన్నివేశంలో చూపించి భయపెట్టాడు. భవిష్యత్తులో దేశాల మధ్య యుద్ధాలు ఇలానే జరుగుతాయేమో? అనే ఊహతో ఒళ్లు జలదరిస్తుంది. దాని చుట్టూ వచ్చే యాక్షన్ సీన్లు, ప్రతినాయకుడిని హీరో అడ్డుకొనే విధానం ఇవన్నీ యాక్షన్ మూడ్ లో సాగిపోతాయి. షారుఖ్ పరిచయ సన్నివేశం నుంచి చివరి వరకూ హై స్పీడులో సినిమా సాగుతూనే ఉంటుంది. మధ్యలో దీపికా - షారుఖ్ రొమాన్స్ కి చోటున్నా దర్శకుడు అటువైపుగా వెళ్లలేదు. పాటలూ తక్కువే. వివాదాలకు కేంద్ర బిందువైన బేషరమ్ పాట గ్లామర్ హంగులతో, పక్కా కమర్షియల్ మీటర్‌లో సాగుతుంది. పాటలకు ఎక్కడా స్పేస్ దొరకలేదు. చివర్లో... ఎండ్ టైటిల్స్ పడుతున్నప్పుడు పాట పెట్టడం బాలీవుడ్ జనాలకు అలవాటు. ఇక్కడా అదే ఆనవాయితీ కొనసాగింది. అయితే దీపిక, షారుఖ్‌ల మాస్ స్టెప్పులు, పాటలోని బీట్ కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తాయి. ఆ పాట అయిపోయిన తరవాత కూడా కొంత సినిమా కొనసాగుతుంది. షారుఖ్, సల్మాన్ కూర్చుని కబుర్లు చెప్పుకొనరే సీన్.. ఆ హీరోల అభిమానులకు పిచ్చ పిచ్చగా నచ్చేస్తుంది. కొన్ని యాక్షన్ ఎపిసోడ్లు మరీ టూమచ్‌గా అనిపిస్తాయి. అదేదో వీడియో గేమ్ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. గ్రాఫిక్స్‌కూడా అక్కడక్కడ తేలిపోతాయి. అయితే షారుఖ్, జాన్ అబ్రహాం, సల్మాన్, దీపికల స్క్రీన్ ప్రజెన్స్ తో ఆ లోపాల్ని కూడా మసిపూసి మారేడుకాయ చేసింది చిత్రబృందం.
* నటీనటులు
షారుఖ్ ఇమేజ్ కి భిన్నమైన కథ ఇది. తనని ఇంత పవర్ ప్యాక్డ్ యాక్షన్ డ్రామాలో ఇది వరకు చూడలేదు. ఈ సినిమాతో కొత్త తరహా అభిమానుల్ని షారుఖ్ సంపాదించుకొంటాడు. జులపాల జుత్తుతో షారుఖ్ లుక్ కొత్తగా ఉంది. సిక్స్ ప్యాక్‌తో మరింత ఎక్ట్రాక్టీవ్‌గా, మాన్లీగా కనిపించాడు.
దీపిక ది షాకింగ్ పాత్ర. తనని ఇలా యాక్షన్ మోడ్‌లో ఇది వరకు చూడలేదు. ఇంట్రవెల్ ట్విస్టుకి దీపిక పాత్ర కారణమవుతుంది. జాన్ అబ్రహాం పోటా పోటీగా నటించాడు. అయితే.. ఇంట్రవెల్ కి ముందు ఆ పాత్ర సైలెంట్ అయిపోతుంది. అదెందుకో అర్థం కాదు. మిగిలిన పాత్రలు పరిధి మేర ఉంటాయి.
* సాంకేతిక వర్గం
టెక్నికల్‌గా సినిమా రిచ్‌గా ఉంది. యాక్షన్ సీన్స్ భారీగా తీశారు. అయితే త్రీడీ గ్రాఫిక్స్ తొ కొన్ని సీన్లు తీయడం వల్ల రియాలిటీకి దూరంగా అనిపిస్తాయి. రెండు పాటలే అయినా మాస్ కి నచ్చుతాయి. నేపథ్య సంగీతం కూడా యాక్షన్ సీన్లకు తగ్గట్టుగానే అనిపిస్తుంది. మాటలు కొన్ని బాగా పేలాయి. ముఖ్యంగా సల్మాన్ - షారుఖ్ మధ్య డైలాగులు ఆకట్టుకొంటాయి. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్‌గా ఉన్నాయి.
దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ అన్నీ చక్కగా మేనేజ్ చేశాడు. స్టార్ బలం, అదనపు హంగులూ అన్నీ ఉన్నాయి. కథలో కూడా వైవిధ్యం ఉంటే బాగుండేది. షారుఖ్, దీపికల ఫ్లాష్ బ్లాక్ సీన్లు.. రొటీన్‌గా ఉంటాయి. రష్యాలో జరిగే యాక్షన్ సీన్ కూడా నమ్మశక్యం కానీ రీతిలో డిజైన్ చేశారు.
ఈ సినిమా బాలీవుడ్ లో రికార్డులు తిరగ రాయకపోవొచ్చు కానీ.. 2023లో మాత్రం తొలి విజయం అందించే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. షారుఖ్ ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న విజయం పఠాన్ అందించాడనే అనుకోవాలి.
* ప్లస్ పాయింట్స్
షారుఖ్
దీపిక
సల్మాన్ ఎంట్రీ
యాక్షన్ సీన్లు
* మైనస్ పాయింట్స్
ఓవర్ ది బోర్డ్ యాక్షన్ సీన్లు
కథ
* ఫైనల్ వర్డిక్ట్: షారుఖ్ ధమాకా