డార్లింగ్ మూవీ రివ్యూ & రేటింగ్

మరిన్ని వార్తలు

చిత్రం: డార్లింగ్
దర్శకత్వం: అశ్విన్ రామ్


నటీనటులు: ప్రియదర్శి, నభా నటేష్


నిర్మాతలు: కె నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య


సంగీతం: వివేక్ సాగర్
డీవోపీ: నరేష్ రామదురై
ఎడిటర్: ప్రదీప్ ఇ రాఘవ


బ్యానర్: ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్
విడుదల తేదీ: 19 జూలై 2024

 

ఐక్లిక్ మూవీస్ రేటింగ్‌: 1.5/5

 

టాలీవుడ్ లో కమెడియన్లు హీరోలుగా మారిపోతున్నారు. ఒకప్పుడు కమెడియన్ గా అలరించిన ప్రియదర్శి కూడా ఇపుడు హీరోగా అవతారమెత్తాడు. 'మల్లేశం ' సినిమాతో మొదటి సక్సెస్ అందుకున్నాడు. విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న ఈ సినిమా ప్రియదర్శికి బాగానే కలిసి వచ్చింది. తరవాత బలగం అనే చిన్న సినిమాతో మంచి ప్రయత్నం చేశాడు. ఇప్పుడు ముచ్చటగా మూడో సారి హీరోగా డార్లింగ్ అంటూ థియేటర్స్ లో సందడి చేస్తున్నాడు. మరి ప్రియదర్శి హీరోగా హ్యాట్రిక్ కొట్టాడో లేదో డార్లింగ్ రివ్యూ లో తెలుసుకుందాం. 


కథ:

రాఘవ్ (ప్రియదర్శి) ఓ ట్రావెల్ ఏజెన్సీ ఏజెంట్. తన బాల్యం నుంచే పెళ్లి, అందమైన పెళ్లాం అనే కలలతో పెరుగుతాడు. పెద్దయ్యాక పెళ్లి చేసుకుని, పెళ్లాన్ని హనీమూన్ కోసం ప్యారిస్‌ తీసుకెళ్లడమే జీవిత లక్ష్యం. అందుకోసమే కష్టపడి చదివి ఉద్యోగం సంపాదిస్తాడు. రాఘవ్ కి సైకాలజిస్ట్ నందిని(అనన్య నాగళ్ల)తో పెళ్లి నిశ్చయం అవుతుంది. ఈ పెళ్ళికి ఓకే చెప్పిన రాఘవ్ కి నిరాశే ఎదురవుతుంది. నందిని వేరే వ్యక్తిని ప్రేమించి, లాస్ట్ మినిట్ లో  పెళ్లి పీటలపై నుంచి పారిపోతుంది. రాఘవ్ పెళ్లి ఆగిపోతుంది. దీంతో మనసు విరిగిపోయిన రాఘవ్ చనిపోవాలని అనుకుంటాడు. అదే టైంలో ఆనంది (నభా నటేష్) పరిచయం అవుతుంది. పరిచయం అయిన  కొద్ది సేపటికే వారిద్దరి వ్యవహారం పెళ్లి వరకు వెళ్తుంది. వెంటనే పెళ్లి జరిగిపోతుంది. కానీ ఆనంది సంబంధించిన ఏ డిటైల్స్ రాఘవ్ తెలుసుకోడు. ఆమె గతం ఏంటి? ఆమె తల్లిదండ్రులు ఎవరు? ఆమెకు ఉన్న సమస్యలు ఏంటి? అన్నది ఏవీ కూడా రాఘవ్‌కి తెలియవు. తొలి రాత్రే ఆనంది చేతిలో చావు దెబ్బ‌లు తింటాడు రాఘ‌వ‌. కారణం ఆమె మ‌ల్టిపుల్ స్ప్లిట్‌ ప‌ర్స‌నాలిటీ డిజార్డ‌ర్‌తో బాధ ప‌డుతుండ‌ట‌మే. ఆనంది కారణంగా రాఘ‌వ ఎన్ని తిప్ప‌లు ప‌డ్డాడు? అసలు ఆనంది ఎవరు? ఆనందిలో ఉన్న ఐదు పర్స‌నాలిటీస్ (ఆది, మాయ‌, ఝాన్సీ, పాప‌, శ్రీశ్రీ) ఎవ‌రు? వాళ్ల ల‌క్ష్యం ఏంటి? అన్న‌ది తెర‌పై చూసి తెలుసుకోవాలి.  


విశ్లేషణ: 

అసలు ఈ టైటిల్‌కు, కథకి సంబంధం ఏంటో అర్థం కాదు. దర్శకుడు ఏం రాసుకున్నాడో, ఏం తీసాడో అతనికి అయినా క్లారిటీ ఉందో లేదో తెలియదు. ఏం చెప్పాలనుకున్నాడో కూడా ప్రేక్షకుడికి అర్థం కాదు. అపరిచితుడు సినిమా నభా నటేష్‌తో తీసాడు అని మాత్రం తెలుస్తోంది. నభా నటేష్ కనిపిస్తే చాలు ఆడియన్స్ వామ్మో అనుకునేంతలా విసిగించింది. భార్య‌తో క‌లిసి పారిస్‌కు హ‌నీమూన్‌కు వెళ్లాల‌ని క‌ల‌లు క‌నే కుర్రాడి జీవితంలోకి అప‌రిచితురాల్లాంటి అమ్మాయి భార్య‌గా వ‌స్తే ఏమైంద‌నేది క్లుప్తంగా ఈ చిత్ర క‌థాంశం. సరిగ్గా ఉపయోగించుకుంటే మంచి కామెడీ పండి ఉండేది. కానీ దర్శకుడు కథ ఏ జోనర్లో కొనసాగించాలో కన్ఫ్యూజ్ అయ్యి పట్టు కోల్పోయాడు. మొదట్లో కొంచెం కామెడీ నడిపించినా, సెకండ్ హాఫ్ లో దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలో మర్చిపోయాడు. హీరోయిన్ పాత్రని ఎమోషనల్ గా చూపించటం లో విఫలమయ్యాడు. ఆమె డిసీజ్ ని పోగొట్టేందుకు హీరో చేసే ప్రయత్నాలు సిల్లీగా, సినిమాటిక్‌గా అనిపిస్తాయి. చాలా స‌న్నివేశాలు సుదీర్ఘంగా సాగి ప్రేక్ష‌కుల స‌హ‌నానికి ప‌రీక్ష పెడ‌తాయి. హీరో ఎమోష‌న‌ల్ గా డైలాగులు చెప్పినా ప్రేక్ష‌కులు క‌నెక్ట్ కారు. ఇలాంటి క‌థ‌ల‌కు కామెడీ చాలా అవ‌స‌రం. అస‌లు ఆ విష‌యంలో ద‌ర్శ‌కుడు తేలిపోయాడు. 


నటీ నటులు:

ఈ మూవీలో ఎంతో కొంత చెప్పుకోదగినది ఉంటే అది ప్రియదర్శి కామెడీ. సినిమాలో  హీరోకంటే  హీరోయిన్ కే స్క్రీన్ స్పేస్‌ ఎక్కువ. ఫస్ట్  హాఫ్ లో  ప్రియదర్శి కామెడీ పరంగా కొంత నడిపించినా, సెకండ్ హాఫ్ లో తనకి పెద్దగా ఛాన్స్ రాలేదు. కథలో లేనిది తను మాత్రం ఏం చేస్తాడు. మల్లేశం, బలగం లాంటి అద్భుత కథలు ఎంచుకున్న ప్రియదర్శ ఎలా ఈ కథకి ఒప్పుకున్నాడు అనిపించక మానదు. చాలా గ్యాప్ తరవాత  నభా నటేష్‌ ఈ మూవీ లో నటించింది. గ్రాండ్ కమ్ బ్యాక్ ఇస్తుంది అనుకుంటే ఆమె ఛాయిస్ తుస్సుమంది. చాలా వేరియేషన్స్ ఉన్నాయి పాత్రలో అనగానే కథ కూడా వినకుండా ఓకే చేసి ఉంటుంది. నిజంగానే నభా పాత్రలో ఉన్న వేరియేషన్స్ కథకి తగ్గట్టు వాడుకుంటే సినిమాకు హైలేట్ అయ్యేది. ఏదో కావాలని అలా ఆమెని చూపిస్తున్నట్టు, బలవంతంగా ప్రేక్షకుడు మైండ్ కి ఎక్కించుకోవాలి. ఏవో ఒకటి రెండు సీన్లు తప్ప గొప్పగా ఏం లేవు. అన‌న్య నాగ‌ళ్ల‌, ముర‌ళీధ‌ర్ గౌడ్ త‌దిత‌రుల పాత్ర‌లు ప‌రిధి మేర‌కు నటించారు. సుహాస్‌, బ్ర‌హ్మానందం, నిహారిక కొణిదెల అతిథి పాత్ర‌ల్లో మెరిశారు. 


టెక్నికల్ గా:

ద‌ర్శ‌కుడు ఎంచుకున్న క‌థ‌ పాతదే అయినా కొత్తగా చెప్పటంలో విఫలమయ్యాడు. తాను ఎంచుకున్న జోనర్ కి న్యాయం చేకూర్చలేకపోయాడు. దర్శకుడికే క్లారిటీ మిస్ అయ్యింది. క‌థ‌లోని ఎమోష‌న్‌ను, కామెడీని బ్యాలెన్స్ చేయ‌లేక‌పోయారు. ఆడియన్స్ ముగింపు కోసం టైం చూసుకునే పరిస్థితి తెచ్చారు.  ఆనందిలో ఉన్న ప్ర‌తీ క్యారెక్ట‌ర్ కీ ఏదో ఓ ఫ్లాష్ బ్యాక్ ఉండి ఉంటుంది అనే ఆలోచ‌న‌లో ఉన్న ప్రేక్ష‌కుడుకి నిరాశే మిగిల్చాడు దర్శకుడు.  విజువల్స్ గ్రాండ్ గా అనిపిస్తాయి. కెమెరా వర్క్ కూడా చాలా రిచ్‌గా ఉంది. వివేక్ సాగ‌ర్ సంగీతం సినిమాకి ప్ర‌ధాన బ‌లం. పాటలు అంత గుర్తు పెట్టుకునేలా  లేకపోయినా, ఆర్ఆర్ కొన్ని చోట్ల బాగుంది. నిర్మాణ విలువ‌లు ఉన్న‌తంగా ఉన్నాయి.                      


ప్లస్ పాయింట్స్ 

ప్రియదర్శి కామెడీ 
ఫస్ట్ హాఫ్   


మైనస్ పాయింట్స్ 

ఎమోషన్స్ మైనస్ 
హీరోయిన్ వేరియేషన్స్ 
కథ 


ఫైనల్ వర్దిక్ట్ : కామెడీ మరిచిన 'డార్లింగ్'


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS