'రాజ‌రాజ చోర' మూవీ రివ్యూ & రేటింగ్!

మరిన్ని వార్తలు

నటీనటులు : శ్రీవిష్ణు, మేఘా ఆకాశ్, సునైన, రవిబాబు తదితరులు 
దర్శకత్వం : హసిత్ గోలి
నిర్మాత‌లు : టి.జి.విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగర్వాల్
సంగీతం : వివేక్ సాగర్
సినిమాటోగ్రఫర్ : వేదారమన్ శంకరన్
ఎడిటర్ : విప్లవ్ నైషాడం


రేటింగ్: 2.75/5


కొత్త  ర‌క‌మైన క‌థ‌ల్ని ఎంచుకుంటాడ‌నే పేరున్న  హీరో శ్రీవిష్ణు.   మ‌ధ్య మ‌ధ్య‌లో ప‌రాజ‌యాలు ఎదురవుతూనే ఉన్నా...  ఆయ‌న చేసే ప్ర‌తి సినిమాపైన ప్రేక్ష‌కులు, ప‌రిశ్ర‌మ ప్ర‌త్యేక‌మైన అంచ‌నాల‌తో క‌నిపిస్తుంటుంది.  `రాజ రాజ చోర‌`పై  ప్రేక్ష‌కుల అంచ‌నాలే కాదు.. వెంకీ సినిమాల్ని గుర్తు చేస్తుందంటూ శ్రీవిష్ణు కూడా మ‌రింత హైప్ తీసుకొచ్చాడు. మ‌రి అందుకు త‌గ్గ‌ట్టుగా సినిమా ఉందా? ఈ చోరుడు ప్రేక్ష‌కుల మ‌న‌సుల్ని దోచాడా?  ఆ విష‌యాలు తెలుసుకునే ముందు  క‌థేమిటో చూద్దాం...


* కథ‌


భాస్క‌ర్ (శ్రీ‌విష్ఱు) ఓ చిల్ల‌ర దొంగ‌. ఎప్పుడూ అబ‌ద్ధాల‌తో.. చిన్న చిన్న మోసాల‌తో గ‌డిపేస్తుంటాడు. సంజ‌న (మేఘా ఆకాష్‌) అనే అమ్మాయిని చూసి ఇష్ట‌ప‌డ‌తాడు. త‌న ద‌గ్గ‌ర తానో దొంగ అనే విష‌యాన్ని క‌ప్పిపుచ్చి... సాఫ్ట్ వేర్ ఉద్యోగ‌స్థుడినంటూ.. న‌మ్మిస్తుంటాడు. సంజ‌న కూడా భాస్కర్ ని ప్రేమిస్తుంది. డ‌బ్బులు బాగా కూడ‌బెట్టి, ఆ డ‌బ్బుల‌తో ఇల్లు కొనుక్కుని జీవితంలో సెటిల్ అవ్వాల‌ని అనుకుంటారు. అయితే సంజ‌న‌కు మ‌రో కోణం ఉంటుంది. బాబాయ్ విలియ‌మ్స్ (ర‌విబాబు) ఓ పోలీస్ అధికారి. అయితే భాస్కర్, సంజ‌న‌కు ఉన్న‌ట్టే విలియ‌మ్స్ కి కూడా ఓ సీక్రెట్ లైఫ్ ఉంటుంది. ఈ ర‌హ‌స్య జీవితాలేంటి?  అవెలా బ‌య‌ట‌ప‌డ్డాయి?  ఆ త‌ర‌వాత ఏమైంద‌న్న‌దే అస‌లు క‌థ‌.


* విశ్లేష‌ణ‌


ప్ర‌తీ ఒక్క‌రూ.. త‌మ‌కు తెలియ‌కుండానే ఓ ర‌హ‌స్య జీవితాన్ని అనుభ‌విస్తుంటారు.. అనే పాయింట్ చెప్పాల‌నుకున్నాడు ద‌ర్శ‌కుడు. అలాంటి పాత్రల్న‌నీ ఓ చోట చేర్చి, ఓ గ‌మ్మ‌త్తైన క‌థ అల్లాడు. దానికి వినోదం పూత పూశాడు, చివ‌రికి ఎమోష‌న్ అద్దాడు. అయితే.. ఈ క్ర‌మంలో కొన్ని విష‌యాల్లో స‌క్సెస్ అయ్యాడు. ఇంకొన్ని విష‌యాల్లో దొరికిపోయాడు.


ఈ క‌థ‌ని ప్రారంభించిన విధానం స‌ర‌దాగా ఉంటుంది. పాత్ర‌ల ప‌రిచ‌యానికే ఎక్కువ స‌మ‌యాన్ని తీసుకున్నా - ప్ర‌తీ స‌న్నివేశంలోనూ ఫ‌న్ ఉండేలా చూసుకోవ‌డంతో ప్రేక్షకులు స‌ర్దుకుపోవొచ్చు. శ్రీ‌విష్ణు ఒక్క‌డే కాదు. త‌న చుట్టు ప‌క్క‌ల ఉన్న ప్ర‌తీ పాత్రా.. ఈ క‌థ‌లో కీల‌కమే. అందుకే ప్ర‌తీ పాత్ర‌నీ అంత డిటైల్డ్ గా పరిచయం చేసుకుంటూ వెళ్లాడు. సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్ అంటూ... శ్రీ‌విష్ణు బిల్డ‌ప్ ఇచ్చే స‌న్నివేశాలు, సంజ‌న‌ని ల‌వ్ లో ప‌డేయ‌డానికి చేసే ప్ర‌య‌త్నాలు, అల్ల‌రి దొంగ‌త‌నాలు.. ఇవ‌న్నీ స‌ర‌దాగా ఉంటాయి. మ‌ధ్య‌మ‌ధ్య‌లో వ‌చ్చే పాట‌లు.. కామెడీ ట్రాకులు ఈ సినిమాపై న‌మ్మ‌కాన్ని పెంచుతుంటాయి. ఇంట్ర‌వెల్ బ్యాంగ్ లో మాత్రం.. ద‌ర్శ‌కుడు త‌న తెలివితేట‌ల‌న్నీ చూపించేశాడు. ఆ ఎపిసోడ్ బాగా పేలింది. ఇంట్ర‌వెల్ చూశాక‌.. ఈ సినిమా ఎక్క‌డికో వెళ్లిపోతుంద‌న్న ఫీలింగ్ క‌లుగుతుంది.


అయితే సెకండాఫ్ లో ఎక్క‌డా ఆ జోష్ ఉండ‌దు. క‌థ‌ని మ‌రీ ఫ్లాట్ చేసేశాడు. క‌థ‌నంలో స్పీడుండ‌దు. చూసిన స‌న్నివేశ‌మే మ‌ళ్లీ చూసిన ఫీలింగ్. పాత్ర‌ల ప్ర‌వ‌ర్త‌న‌, వాళ్ల‌లో మార్పులు, ఓ జీవితాన్ని వ‌దిలి.. వాస్త‌వంలోకి వ‌చ్చే స‌న్నివేశాల‌న్నీ భారంగా సాగుతాయి. తొలి స‌గంలో ఉన్న ఫ‌న్‌.. ద్వితీయార్థంలో మిస్ అయిపోవ‌డం నిరాశ క‌లిగిస్తుంది. చాలా స‌న్నివేశాలు లాజిక్ కి దూరంగా సాగుతాయి. భాస్క‌ర్ ని ప‌ట్టుక‌న్న పోలీస్‌.. చిన్న చిన్న డైలాగుల‌కే క‌దిలిపోయి త‌న‌ని వ‌దిలేయ‌డం లాజిక్కుల‌కు అంద‌దు. పాత్రలెక్కువ అవ్వ‌డం, ద‌ర్శ‌కుడు ప్ర‌తీ పాత్ర‌పై ప్రేమ పెంచుకోవ‌డం, ప్ర‌తీ పాత్ర‌కీ ఓ ముగింపు ఇవ్వాల‌నుకోవ‌డం.. ఈ సినిమా జోరుకి క‌ళ్లాలు వేశాయి. స‌బ్ ఫ్లాటులు ఎక్కువ అవ్వ‌డం వ‌ల్ల‌.. ఏం జ‌రుగుతుందో?  చెప్ప‌డానికి ఈ సినిమా ఓ సాక్ష్యం. రెండేళ్లు జైలు శిక్ష అనుభ‌వించి `నేను చేసిన త‌ప్పుల‌కు ఇదే ప్ర‌యాశ్చిత్తం.. నేను మారిపోయా` అంటాడు హీరో. అది కూడా బ‌ల‌వంత‌పు క్లైమాక్సే అనిపిస్తుంది.


* న‌టీన‌టులు


శ్రీ‌విష్ణు కామెడీ టైమింగ్ ముందు నుంచీ బాగానే ఉంటుంది. ఈ సినిమాలో ఇంకో స్థాయిలో ఉంది. చాలా చోట్ల శ్రీ‌విష్ణు కొత్త‌గా క‌నిపించాడు. కొన్ని ఎపిసోడ్లు హిలేరియ‌స్ గా పేల‌డానికి శ్రీ‌విష్ణు న‌ట‌నే కార‌ణం. ఎమోష‌న‌ల్ సీన్లు బాగా చేస్తాడు. త‌న కోస‌మే క్లైమాక్స్ ఎమోష‌న‌ల్ గా మార్చార‌నిపిస్తుంది. సున‌య‌న‌, మేఘా ఆకాష్.. రెండు పాత్ర‌ల్నీ ద‌ర్శ‌కుడు బాగా రాసుకున్నాడు. వాళ్లూ బాగా చేశారు. కామెడీ ట‌చ్ ఉన్న విల‌నిజం పండించాడు. త‌నికెళ్ల భ‌ర‌ణి, శ్రీ‌కాంత్ అయ్యంగ‌ర్‌.. ఇలా ప్ర‌తీ పాత్ర‌నీ ద‌ర్శ‌కుడు చాలా ఇష్ట‌ప‌డి రాసుకున్నాడు. కాబ‌ట్టే ఆయా పాత్ర‌లు బాగా వ‌చ్చాయి. గంగ‌వ్వ పాత్ర‌ని మాత్రం స‌రిగా డిజైన్ చేయ‌లేద‌నిపిస్తుంది.

 

* సాంకేతిక వ‌ర్గం


ద‌ర్శ‌కుడికి ఇది తొలి సినిమా. తొలి ప్ర‌య‌త్నంలోనే మంచి పాయింట్ చెప్పాల‌నుకున్నాడు. కొన్ని చోట్ల స‌క్సెస్ అయ్యాడు కూడా. అయితే ఎక్కువ పాత్ర‌లు రాసుకోవ‌డంతో దొరికిపోయాడు. దాని వ‌ల్ల సినిమా బాగా స్లో అయ్యింది. కేవ‌లం ఫ‌న్‌పైనే దృష్టి పెట్టుంటే బాగుండేది. ఈ సినిమాకి ఎమోష‌న‌ల్ కోటింగ్ ఇవ్వాల‌నుకుని... ఇబ్బంది పెట్టాడు. వివేక్ సాగ‌ర్ సంగీతం అది పెద్ద ప్ల‌స్ పాయింట్. త‌నే చాలా స‌న్నివేశాల్ని నిల‌బెట్టాడు. మాట‌లు బాగున్నాయి. నిర్మాణ విలువ‌లు అంతంత మాత్ర‌మే.


* ప్ల‌స్ పాయింట్స్‌


శ్రీ విష్ణు న‌టన‌
ఇంట్ర‌వెల్ బ్యాంగ్
కామెడీ ఎపిసోడ్లు


* మైన‌స్ పాయింట్స్


సెకండాఫ్‌
ఎమోష‌న‌ల్ పార్ట్


* ఫైన‌ల్ వ‌ర్డిక్ట్:  కామెడీ దొంగ‌!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS