తారాగణం: రవితేజ, మేహ్రీన్, రాజేంద్రప్రసాద్, ప్రకాష్ రాజ్, సంపత్ రాజ్, రాధిక
నిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
సంగీతం: సాయి కార్తీక్
ఛాయాగ్రహణం: మోహన కృష్ణ
ఎడిటర్: తమ్మిరాజు
నిర్మాతలు: దిల్ రాజు
రచన-దర్శకత్వం: అనిల్ రావిపూడి
రవితేజ అంటేనే ఎనర్జీ. ఆ జోరుకి తగిన కథ దొరికితే, క్యారెక్టరైజేషన్ లభిస్తే రెచ్చిపోతాడు. పటాస్, సుప్రీమ్ లతో తనలోనూ ఆ ఎనర్జీ ఉందని నిరూపించుకొన్నాడు అనిల్ రావిపూడి. మరి వీరిద్దరూ కలిస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లెద్దు. దాంతో రాజా ది గ్రేట్‌పై అంచనాలు భారీగా పెరిగాయి. దానికి తోడు ప్రచార చిత్రాలూ ఆకట్టుకొన్నాయి. మరి వీరిద్దరూ తమ అంచనాల్ని అందుకొన్నారా?? రాజా నిజంగానే ది ట్రేట్ అనిపించుకొన్నాడా?? చూద్దాం.. రండి
* కథ..
రాజా (రవితేజ) అంధుడు. కాకపోతే ఆత్మ విశ్వాసం ఎక్కువ. చూపు లేకపోయినా నేర్పరి తనంతో బతికేస్తుంటాడు. తల్లి (రాధిక) అంటే ప్రాణం. తనో కానిస్టేబుల్. కొడుకుని కూడా పోలీస్ గా చూడాలనుకొంటుంది. మరోవైపు సీఐ (ప్రకాష్‌రాజ్) కూతురు లక్కీ (మెహరీన్) ప్రాణానికి అపాయం ఏర్పడుతుంది. తనని కాపాడ్డానికి ఐజీ (సంపత్) ఓ స్పెషల్ టీమ్‌ని ఏర్పాటు చేస్తాడు. వాళ్లకు సహాయంగా రాజా కూడా డార్జిలింగ్ వెళ్తాడు. అసలు లక్కీకి పొంచిఉన్న ప్రమాదం ఏమిటి?? తనని అంధుడైన రాజా ఎలా కాపాడాడు? అనేదే కథ
* నటీనటుల ప్రతిభ...
ఈ కథ, రాజా పాత్ర కేవలం రవితేజని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేసినట్టు, పర్‌ఫెక్ట్‌గా సెట్ అయిపోయింది. మామూలు కథని రవితేజ తన ఎనర్జీతో మరో స్థాయికి తీసుకెళ్లాడు. అంధుడిగా కనిపిస్తూనే, తనలోని మాస్ యాంగిల్స్ బయటకు తీసుకొచ్చాడు. మరోసారి తన ఎనర్జీకి ఫిదా అయిపోవాల్సిందే. మెహరీన్ సినిమా అంతా కనిపిస్తుంది. కానీ తన ప్రత్యేకత చూపించలేకపోయింది. అమ్మ పాత్రలో రాధిక సెట్ అయిపోయింది. క్లైమాక్స్‌లో తన డైలాగులు క్లాప్స్ కొట్టిస్తాయి. విలన్ క్యారెక్టర్‌ని కూడా బాగా డిజైన్ చేసుకొన్నాడు అనిల్ రావిపూడి. కానీ లిప్ సింక్ ఎక్కడా సెట్ కాలేదు. పోసాని, ప్రకాష్‌రాజ్ ఓకే అనిపిస్తే,.. శ్రీనివాస రెడ్డి తన కామెడీ టైమింగ్‌తో మరోసారి ఆకట్టుకొంటాడు.
* విశ్లేషణ..
ఓ హీరోయిన్‌ని హీరో కాపాడడం అనేది రొటీన్ స్టోరీ. ఒక విధంగా అనిల్ రావిపూడి కూడా రొటీన్ కథనే ఎంచుకొన్నాడు. కాకపోతే హీరోని అంధుడ్ని చేయడంలోనే గమ్మత్తు ఉంది. ఓ అంధుడు కథానాయికని ఎలా కాపాడాడు అనే పాయింట్ చుట్టూనే ఆసక్తి నెలకొంది. దాన్ని వీలైనంత కమర్షియల్‌గా తీయడానికి ప్రయత్నిస్తూ, రవితేజ తాలుకూ ఎంటర్‌టైన్ మిస్ కాకుండా చూసుకొన్నాడు అనిల్ రావిపూడి. ప్రకాష్ రాజ్ - మెహరీన్ తండ్రీ కూతుర్ల ఎపిసోడ్‌తో కథ మొదలవుతుంది. హీరోయిన్ ప్రమాదంలో పడడం.. అప్పుడే హీరో ఇంట్రడక్షన్... ఇలా ఈ కథని పక్కా కమర్షియల్ పంథాలో రాసుకొన్నాడు. కబడ్డీ ఎపిసోడ్ మాస్‌తో కేకలు పెట్టిస్తుంది. డార్జిలింగ్ ఎపిసోడ్లలోనూ ఫన్ మిస్ కాకుండా చూసుకొన్నాడు. హీరో - విలన్‌ల పోరాటాన్ని ద్వితీయార్థానికి కేటాయించాడు. అక్కడ ఫైట్లు, పాటలు.. ఇలా ఏ ఒక్క కమర్షియల్ యాంగిల్ మిస్ కాకుండా చూసుకొన్నాడు. క్లైమాక్స్ ముందే అయిపోవాల్సింది. కానీ దాన్ని సాగదీసినట్టు అనిపిస్తుంది. ఫైటూ, పాట.. ఫైటూ, పాట.. ఇలా రొటీన్ గా సాగిపోయే సెకండాఫ్‌కి రవితేజ స్టైల్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ కాపాడింది. గున్నా గున్నా మామిడి ఎపిసోడ్ ఓ రేంజులో ఉంటుందనుకొంటే.. అంత కిక్ లేకుండా పోయింది. దర్శకుడు చాలా లాజిక్కుల్ని విడిచిపెట్టేశాడు. బ్యాంకు దోపిడి ఇంత సిల్లీగా ఉంటుందా?? అనిపిస్తుంది ఆ ఎపిసోడ్ చూస్తే. సినిమా కాబట్టి లాజిక్కుల గురించి ఆలోచించకుండా చూడాలి.
* సాంకేతిక వర్గం..
దర్శకుడిగా అనిల్ రావిపూడి సక్సెస్ అయితే, కథకుడిగా విఫలం అయ్యాడు. హీరో అంధుడు అని తప్పిస్తే మిగిలిన వన్నీ రొటీన్ కమర్షియల్ సీన్లే. పాటల్లో ఒకట్రెండు ఆకట్టుకొంటాయి. నేపథ్య సంగీతంలో దమ్ములేదు. టెక్నికల్‌గా సినిమా బాగుంది. కథ పరంగా ఇంకాస్త శ్రద్ద పెట్టాల్సింది.
* ప్లస్ పాయింట్స్
+ రవితేజ
+ కామెడీ బిట్లు
* మైనస్ పాయింట్లు
- రొటీన్ కథ
- సెకండాఫ్
- లాజిక్ లేకపోవడం
* ఫైనల్ వర్డిక్ట్: పైసా వసూల్
రివ్యూ బై శ్రీ