తారాగణం: రజనీకాంత్, త్రిష, సిమ్రన్, విజయ్ సేతుపతి, నవాజుద్ధీన్ సిద్ధిఖీ & తదితరులు
సంగీతం: అనిరుద్ రవిచందర్
ఎడిటర్: వివేక్ హర్షన్
సినిమాటోగ్రఫీ: యస్ తిరు
నిర్మాతలు: అశోక్ వల్లభనేని, కళానిథి మారన్
దర్శకత్వం: కార్తీక్ సుబ్బరాజ్
విడుదల: 10 జనవరి 2019
రేటింగ్: 2.75/5
రజనీ కాంత్ సినిమా అంటేనే ఓ ప్రభంజనం. ఆ స్టైల్‌కి కాస్త హీరోయిజం, కాస్త కథ దొరికితే చాలు... బాక్సాఫీసు కళకళలాడిపోతుంది. రజనీకాంత్ కెరీర్‌లో సూపర్ డూపర్ హిట్టయిన సినిమాలన్నీ ఇదే ఫార్ములాతో తెరకెక్కినవే. అయితే.. ఈమధ్య కాలంలో ఈ కాంబినేషన్ మిస్సయ్యింది. తెరపై రజనీకాంత్ రకరకాల ప్రయోగాలు, ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఆ స్టైల్ మాత్రం కనిపించడం లేదు. ఈమధ్య విడుదలైన 2.ఓ ఫర్వాలేదనిపించినా అందులోనూ రజనీ తాలుకూ మాయాజాలం కనిపించకుండా పోయింది.
అయితే `పేటా` ప్రచార చిత్రాలు కొత్త ఆశల్ని కలిగించాయి. ఇందులో రజనీ అభిమానులు కోరుకునే అన్ని అంశాలూ ఉంటాయన్న భరోసా దక్కింది. పైగా ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కార్తీక్ సుబ్బరాజు రజనీకి తోడయ్యాడు. మరి ఈ కాంబినేషన్ అదరగొట్టిందా? రజనీ అభిమానులకు కావల్సిన ఫుల్ మీల్స్ అందేసిందా?
కథ
సిమ్లాలోని ఓ హాస్టల్లో వార్డెన్‌గా చేరతాడు కాళి (రజనీకాంత్). అక్కడి పరిస్థితుల్ని చక్కబెడతాడు. ర్యాగింగ్‌ని అరికడతాడు. కాంట్రాక్టర్‌ల ఆగడాలకు అడ్డుగా నిలుస్తాడు. ఓ ప్రేమ జంటని కలిపే ప్రయత్నం చేస్తాడు. అయితే ఈ ప్రయత్నంలో తనకు ఓ ముఠా నుంచి సమస్యలు ఎదురవుతాయి. ఓసారి కాళిపై ఆ ముఠా ఎటాక్ చేసి హత్య చేయడానికి ప్రయత్నిస్తుంది. ఆ సమయంలోనే కాళి అసలు పేరు పెట్టా అని తెలుస్తుంది. అసలు పెట్టా తన పేరు ఎందుకు మార్చుకోవాల్సివచ్చింది? ఏరి కోరి కాళి హాస్టల్ వార్డెన్ గా రావడానికి కారణం ఏమైనా ఉందా? పేటా కాళిగా ఎందుకు మారాడు? అనేది తెలియాలంటే... `పేటా` చూడాల్సిందే.
నటీనటుల పనితీరు..
రజనీ గురించి చెప్పేదేముంది? ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే. కుర్రాళ్లలో కుర్రాడిగా కలసిపోయాడు. తన కాస్ట్యూమ్స్ బాగున్నాయి. మేకప్ విషయంలో ఇంకాస్త శ్రద్ద తీసుకోవాలి. కథల్ని ఎంపిక చేసుకోవడంలో రజనీ చాతుర్యం ఏమైందో అర్థం కావడం లేదు. విజయ్ సేతుపతి ఆకట్టుకున్నా.. తన స్థాయికి తగిన పాత్ర కాదనిపిస్తుంది. నవాజుద్దీన్ కూడా అంతే. బాబీ సింహా ఫర్వాలేదనిపిస్తే... త్రిష, సిమ్రన్‌లను సరిగా వాడుకోలేదు.
విశ్లేషణ...
కథానాయకుడు తన పేరు మార్చుకుని, మారు పేరుతో మరో చోట అనామకుడిగా బతకడం.. ఇంట్రవెల్ బ్యాంగ్‌లో అతని గురించి అంత వరకూ దాచి పెట్టిన రహస్యాలు తెలియడం.. ఇదంతా బాషా నాటి ఫార్ములా. ఈ ట్రెండ్‌ని ప్రవేశ పెట్టింది రజనీనే. ఇప్పుడు.... ఇంత కాలానిని మళ్లీ అరిగిపోయిన ఆ భాషా ఫార్ములా వాడుకున్నాడు. అది కూడా నిస్సారంగా. తొలి సగం గడిచినా.. దాదాపు 30 సన్నివేశాలు వచ్చి వెళ్లిపోయినా.. అప్పటి వరకూ జరిగిన కథేమిటి? అని అడిగితే ఏమీ చెప్పలేని పరిస్థితి.
తొలి సగం మొత్తం హాస్టల్ సన్నివేశాలకే వాడుకున్నాడు. విశ్రాంతికి ముందు కాళికి బలమైన ఫ్లాష్ బ్యాక్ ఒకటి ఉందన్న విషయం అర్థం అవుతుంది. ఫ్లాష్ బ్యాక్ బాగుంటే.. కచ్చితంగా పేటా అనుకున్న లక్ష్యాన్ని చేరుకుందుడు. కానీ.. అదీ జరగలేదు. ఇంత సాదా సీదా ఫ్లాష్ బ్యాక్ రజనీ సినిమాల్లోనే చూడలేదు. ఆ తరవాత.. హీరో ప్రతీకారం తీర్చుకోవడానికి రంగంలోకి దిగుతాడు. అది కూడా సుదీర్ఘ ప్రహసనంలా ఉంటుంది. ఊటీ నుంచి... ఉత్తర ప్రదేశ్ వెళ్లడం, అక్కడ విలన్ కోసం స్కెచ్ వేయడం ఈ సన్నివేశాలు చాలా నిదానంగా సాగుతూ నీరసం తెప్పిస్తాయి.
కార్తీక్ సుబ్బరాజు తన స్టైల్ చూపించుకోవడానికి ఓ ట్విస్ట్ అట్టిపెట్టుకున్నాడు. ఆ ట్విస్టు బాగుంది కూడా. కానీ అప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకులకు ఓ అభిప్రాయం కలిగేస్తుంది. కాబట్టి.. ఆ మలుపునీ ఆస్వాదించలేరు. అక్కడక్కడ రజనీ సినిమాల్లో ఉండే కొన్ని మెరుపులు, స్టైల్, మేనరిజం, డైలాగులు కనిపించినా.. అది పూర్తి స్థాయిలో సంతృప్తి పరచలేదు. ఓ యువ దర్శకుడితో సినిమా తీస్తూ.. ఇంత పసలేని కథ ఎంచుకోవడం రజనీ అభిమానుల్ని సైతం నిరాశ పరుస్తుంది.
సాంకేతిక వర్గం...
అనిరుథ్ పాటలు ఓకే అనిపిస్తాయి. నేపథ్య సంగీతం, బీజియమ్స్ అదరగొట్టాడు. టెక్నికల్‌గా ఈ సినిమా బాగుంది.
అయితే కథకుడిగా కార్తీక్ సుబ్బరాజు విఫలం అయ్యాడు. ఇంత పేలవమైన కథతో రజనీతో సినిమా తీద్దామని ఎలా అనుకున్నాడో అర్థం కాదు. కేవలం ట్విస్ట్‌ని నమ్ముకుని తీసిన సినిమా అనిపిస్తుంది. కనీసం అభిమానుల్ని పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయాడు.
* ప్లస్ పాయింట్స్
+ రజనీ చరిష్మా
+ స్టైల్
+ చివర్లో ట్విస్ట్
* మైనస్ పాయింట్స్
- కథ
- కథనం
- సాగదీత
పైనల్ వర్డిక్ట్: ఫలించని వేట
రివ్యూ రాసింది శ్రీ.