రాజు గారి గది 2 రివ్యూ & రేటింగ్స్

మరిన్ని వార్తలు

తారాగణం: నాగార్జున, సమంతా, సీరత్ కపూర్, అశ్విన్, వెన్నెల కిషోర్, ప్రవీణ్
నిర్మాణ సంస్థ: PVP సినిమా, మ్యాటినీ ఎంటర్టైన్మెంట్, ఓక్ ఎంటర్టైన్మెంట్స్
సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: ఆర్. దివాకరణ్
మాటలు: అబ్బూరి రవి
నిర్మాతలు: PVP & నిరంజన్ రెడ్డి
రచన-దర్శకత్వం: ఓంకార్

యూజర్ రేటింగ్: 3.5/5

హార‌ర్ కామెడీ జోన‌ర్ల‌లో మంచి విజ‌యాన్ని అందుకొన్న సినిమా.. 'రాజుగారి గ‌ది'. ఈ చిత్రానికి సీక్వెల్ అంటే క‌చ్చితంగా అంచ‌నాలు ఏర్ప‌డ‌తాయి. దానికి తోడు.. నాగార్జున‌, స‌మంత‌, సీర‌త్‌క‌పూర్ వ‌చ్చి చేరారు. ఈ క‌థ‌కి స్టార్ డ‌మ్ పెంచారు.  స‌మంత‌.. అక్కినేని స‌మంత‌గా మారిన త‌ర‌వాత వ‌స్తున్న తొలి సినిమా, అందులోనూ మామా కోడ‌ళ్లు క‌ల‌సి న‌టిస్తున్నారు. దాంతో.. ఆ అంచ‌నాలు మ‌రింత‌గా పెరిగాయి. మ‌రి... 'రాజుగారి గ‌ది 2' ఆ అంచ‌నాల్ని అందుకొందా??  ఈ ప్ర‌య‌త్నం ఏ మేర‌కు మెప్పించింది??

* క‌థ‌

అశ్విన్ (అశ్విన్ బాబు), ప్ర‌వీణ్ (ప్ర‌వీణ్‌), ర‌వి (వెన్నెల కిషోర్‌) ఈ ముగ్గురు మిత్రులు క‌ల‌సి ఓ రిసార్ట్‌కి వెళ్లి ఎంజాయ్ చేద్దామ‌నుకొంటారు. ఆ రిసార్ట్‌లో వీళ్ల‌కు అనుకోని సంఘ‌ట‌న‌లు ఎదుర‌వుతాయి.  ప్ర‌తి నిమిషం భ‌యం భ‌యంగా గ‌డ‌పాల్సివ‌స్తుంది. రిసార్ట్ మిస్ట‌రీ ఛేదించ‌డానికి రుద్ర (నాగార్జున‌) అంటే మెంట‌లిస్ట్ సహాయం తీసుకొంటారు. ఈ రిసార్ట్‌లో ఓ ఆత్మ ఉంద‌న్న విష‌యం బ‌య‌ట‌పెడ‌తాడు రుద్ర‌.  ఆ ఆత్మ ఎవ‌రిది??  అమృత (అంజ‌లి) అనే అమ్మాయికీ, ఈ క‌థ‌కూ ఉన్న సంబంధం ఏమిటి??  అనేదే రాజుగారి గ‌ది 2 క‌థ‌.

* న‌టీన‌టుల ప్ర‌తిభ‌..

ప్ర‌ధ‌మార్థాన్ని నాగార్జున కాపాడితే, సెకండాఫ్ కోడ‌లు పిల్ల స‌మంత చూసుకొంది. అలా.. ఇది మామా కోడ‌ళ్ల సినిమాగా మారిపోయింది. నాగ్ త‌న అనుభ‌వాన్నంతా ఉప‌యోగించాడు. దానికి తోడు మెంట‌లిస్ట్ పాత్ర కొత్త‌గా అనిపిస్తుంది. స‌మంత అయితే.. ద్వితీయ‌ర్థాన్ని త‌న వైపుకు తిప్పుకొంది. నిజంగానే స‌మంత‌కు ఇదో కొత్త పాత్ర‌.  వెన్నెల కిషోర్ కామెడీ అక్క‌డ‌క్క‌డ వ‌ర్క‌వుట్ అయ్యింది. కిషోర్, ప్ర‌వీణ్‌, అశ్విన్‌, ష‌క‌ల‌క శంక‌ర్‌... డిటోగా మెప్పించారు.

* విశ్లేష‌ణ‌..

రాజుగారి గ‌దికి సీక్వెల్ అని చెప్పారు గానీ, ఈ రెండు సినిమాల క‌థ‌ల‌కూ ఏమాత్రం పొంతన లేదు. కేవ‌లం బ్రాండ్ ఇమేజ్‌ని వాడుకోవ‌డానికి ఆ టైటిల్ పెట్టుకొన్నారేమో అనిపిస్తుంది. ఫ‌స్టాఫ్‌లో కామెడీకి  ఎక్కువ స్కోప్ ఉంది. వెన్నెల కిషోర్‌, అశ్విన్, ప్ర‌వీణ్ భ‌యంలోంచి కామెడీ పండించే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు. అది అక్క‌డ‌క్క‌డ కాస్త వ‌ర్క‌వుట్ అయ్యింది. నాగ్ ఎంట్రీతో క‌థ‌లో ఊపొస్తుంది. మెంట‌లిస్ట్ పాత్ర‌ని ఓంకార్ బాగా డిజైన్ చేసుకొన్నాడు. మిగిలిన హార‌ర్ కామెడీ సినిమాల‌కూ, రాజుగారి గ‌ది 2కీ ఉన్న ప్ర‌ధాన‌మైన తేడా ఈ పాత్రే.  సమంత ఫ్లాష్ బ్యాక్‌, ఆమెతో  ఈ క‌థ‌కు ఉన్న లింక్ ఈ చిత్రానికి ప్రాణం. ద్వితీయార్థంలో కామెడీ, హార‌ర్ డోసు పూర్తిగా త‌గ్గిపోతుంది. దాని స్థానంలో ఎమోష‌న‌ల్ స‌న్నివేశాలొస్తుంటాయి. కుటుంబ ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యే ప్ర‌య‌త్నం చేశాడు దర్శ‌కుడు. ఆ విష‌యంలో బాగా స‌క్సెస్ అయ్యాడ‌నే చెప్పాలి. ప‌తాక స‌న్నివేశాలు, అక్క‌డి మ‌లుపులు బాగా ర‌క్తి క‌ట్టాయి. స‌మంత చెప్పిన డైలాగులు క‌దిలిస్తాయి. దాంతో కామెడీగా మొద‌లై, హార‌ర్‌గా మారిన ఈ సినిమా ఎమోష‌న‌ల్ ట‌ర్న్ తీసుకొని  ఓ సంపూర్ణ‌మైన సినిమా చూసిన ఫీలింగ్ క‌లుగుతుంది. ప్ర‌ధ‌మార్థంతో పోలిస్తే, ద్వితీయార్థానికి ఎక్కువ మార్కులు ప‌డ‌తాయి. క‌థ‌ని సెకండాఫ్‌లో డీల్ చేసిన విధానం న‌చ్చుతుంది. న‌టీన‌టుల ప్ర‌తిభ, విజువ‌ల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాని మ‌రో స్థాయికి తీసుకెళ్లాయి.

* సాంకేతిక వ‌ర్గం..

టెక్నిక‌ల్ టీమ్ స‌పోర్ట్ ఈ క‌థ‌కు బాగా కుదిరింది. ఓంకార్ ఓ సాధార‌మైన క‌థ‌ని టెక్నిక‌ల్ టీమ్ స‌హ‌కారంతో నిల‌బెట్ట‌గ‌లిగాడు. త‌మ‌న్ సంగీతం ప్రాణం పోసింది.  అబ్బూరి ర‌వి సంభాష‌ణ‌లు మెప్పిస్తాయి. మ‌రీ ముఖ్యంగా క్లైమాక్స్‌లో అత‌ని క‌లం బ‌లం క‌నిపించింది. వీఎఫ్ఎక్స్ ప్ర‌మాణాలూ ఆక‌ట్టుకొంటాయి. ద‌ర్శ‌కుడిగా ఓంకార్ త‌న టీమ్‌ని సమ‌ర్థంగా న‌డిపించ‌గ‌లిగాడు. త‌న నుంచి మ‌రిన్ని మంచి చిత్రాలు ఆశించొచ్చు.

* బ‌లాలు

+ నాగ్ - స‌మంత‌
+ క్లైమాక్స్‌
+ టెక్నిక‌ల్ టీమ్‌

* బ‌ల‌హీన‌త‌లు

- ఫ‌స్టాఫ్‌లో కొన్ని రొటీన్ సీన్లు

* ఫైన‌ల్ వ‌ర్డిక్ట్‌:  'రాజుగారి గ‌ది 2' మామా కోడ‌ళ్ల మ్యాజిక్‌

రివ్యూ బై శ్రీ
 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS