నటీనటులు : నితిన్, కీర్తి సురేష్, నరేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్
దర్శకత్వం : వెంకీ అట్లూరి
నిర్మాతలు : సూర్యదేవర నాగ వంశీ
సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ : పి. సి. శ్రీరామ్
ఎడిటింగ్ : నవీన్ నూలి
రేటింగ్: 2.5/5
ప్రేక్షకులు కొత్తదనం ఏమీ ఆశించడం లేదని, కాలక్షేపం అయిపోతే చాలని.... దర్శకులు కూడా ఫిక్సయిపోతున్నారేమో అనిపిస్తోంది. కొన్ని కథలు చూస్తుంటే... `ఇవి పాత చింతకాయ పచ్చడే కదా` అని ఇట్టే తెలిసిపోతుంది. ఆ విషయం దర్శకులకూ తెలుసు. కానీ.. ఎక్కడో నమ్మేస్తారు. కథనమో, లేదంటే... హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీనో బలంగా ఉంటే సినిమా వర్కవుట్ అయిపోతుందని భావిస్తుంటారు. `రంగ్ దే` కూడా అలాంటి సినిమానే. హీరో హీరోయిన్ల మధ్య గిల్లికజ్జాలు, వాళ్లిద్దరూ కలిసిపోవడం, మళ్లీ విడిపోవడం, మళ్లీ కలుసుకోవడం ఇదీ స్థూలంగా కథ. ఇలాంటి సినిమాలు చాలానే వచ్చాయి. కానీ.. రంగ్ దే.. దేన్ని నమ్ముకుంది? ఈ పాత కథని కొత్త రంగులో చూపించిందా, లేదా?
* కథ
అర్జున్ (నితిన్), అను (కీర్తి సురేష్) చిన్నప్పటి నుంచీ పక్క పక్క ఇళ్లల్లో పెరిగారు. అర్జున్ తో పోలిస్తే.. అను అన్ని విషయాల్లోనూ ముందంజలో ఉంటుంది. చదువులో ఫస్టు. అర్జున్... లాస్టు. `అనుని చూసి నేర్చుకో` అంటూ.. అర్జున్ ని ఇంట్లో వాళ్లు క్లాసు పీకుతుంటారు. అందుకే.. అనుని అర్జున్ ఓ శత్రువుని చూసినట్టు చూస్తాడు. అయితే అనుకోకుండా అను - అర్జున్ ఇద్దరూ పెళ్లి చేసుకోవాల్సివస్తుంది. వాళ్ల కాపురం ఎలా సాగింది? ఈ పంతాలూ, పట్టింపులూ.. పెళ్లయ్యాక కూడా ఉన్నాయా, ఒకరి కోసం ఒకరు తగ్గారా? ఈ విషయాలన్నీ తెలసుకోవాలంటే `రంగ్ దే` చూడాలి.
* విశ్లేషణ
ఈ సినిమా చూస్తుంటే ఆనందం, నువ్వే కావాలి, ఖుషీ లాంటి సినిమాలు తప్పకుండా గుర్తొస్తాయి. అందులోనూ ఇందులోనూ... ఒక్కటే పాయింట్. హీరో - హీరోయిన్ల మధ్య లవ్ అండ్ హేట్ రిలేషన్ షిప్.
కాబట్టి.. కథ విషయంలో `రంగ్ దే` చేసిందేం లేదు. పాత పేట్రన్ ఫాలో అయిపోయారు. ఇలాంటి సినిమాలకు వినోదం, భావోద్వేగాలూ వెన్నుదన్నుగా నిలవాలి. మొదటి విషయంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ప్రతీ సన్నివేశంలోనూ ఏదో ఓ దశలో వినోదం పుట్టేలా చూసుకున్నాడు. మాటల ద్వారానో, చేతల ద్వారానో, తిట్ల రూపంలోనో కామెడీ వర్కవుట్ అయ్యేలా జాగ్రత్త పడ్డాడు. హీరో హీరోయిన్ల పరిచయం, వాళ్ల మధ్య గొడవ, బీటెక్ పాస్ అవ్వడానికి నితిన్ పడే పాట్లు, బ్రహ్మజీ ఎపిసోడ్ ఇవన్నీ ఫన్నీగా సాగాయి. కామెడీ బాగా వర్కవుట్ అయ్యింది. ఇంట్రవెల్ లో ఓ చిన్న ట్విస్ట్ ఉంది. ఇవన్నీ కలిసి... ఫస్ట్ ఆఫ్ ని పాస్ చేసేశాయి.
ఇలాంటి కథల్ని సెకండాఫ్‌లోనూ కూర్చోబెట్టాలంటే.. ఎమోషన్ బాగా వర్కవుట్ అవ్వాలి. ఆ విషయంలో దర్శకుడు తేలిపోయాడు. కథలో సంఘర్షణ లేదు. ఉన్నా రేఖామాత్రమే. ఎమోషన్ లేని సన్నివేశాల్ని ప్రేక్షకుడు ఎంత వరకూ భరిస్తాడు? హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ, ద్వేషం పుట్టడానికి పెద్దగా కారణాలుండవు. దాంతో తెరపై ఓ నాటకం చూస్తున్న ఫీలింగ్ కలుతుంది. వెన్నెల కిషోర్ పాత్ర, తాను చేసే కామెడీ లేకపోతే ద్వితీయార్థం భరించడం మరింత కష్టంగా మారేది. పతాక సన్నివేశాలు పరమ రొటీన్ గా సాగాయి. ఇంతకంటే దర్శకుడు మరోలా ముగించలేడని ప్రేక్షకుడికీ తెలుసు. ముందే చెప్పినట్టు ఆనందం, ఖుషీ లాంటి సినిమాల్లో ఎమోషన్ పార్ట్ కూడా బాగా వర్కవుట్ అయ్యింది. కాబట్టే అవి గుర్తుండిపోయాయి. కథ విషయంలో ఎలాంటి ప్రయోగాల జోలికీ వెళ్లని దర్శకుడు.. కథనంలోనూ మరీ సేఫ్ గేమ్ ఆడేశాడనిపిస్తుంది.
* నటీనటులు
నితిన్ - కీర్తిల జోడీ ఈ సినిమాకి ప్రధాన బలం. వాళ్ల కెమిస్ట్రీనే ఈ సినిమాని నడిపించింది. నితిన్ చాలా ఈజ్ తో చేశాడు. కీర్తి ఈమధ్య బాగా సన్నబడింది. దాంతో మొహంలో కాస్త కళ తగ్గింది. అయినా చూడ్డానికి అందంగానే ఉంది. నరేష్ అలవాటైన పాత్రలో మరోసారి అల్లుకుపోయాడు. వెన్నెల కిషోర్, బ్రహ్మాజీలకు చాలా కాలం తరవాత మంచి పాత్రలు పడ్డాయి. మిగిలిన వాళ్లు సోసోగా చేసుకుంటూ వెళ్లారు.
* సాంకేతిక వర్గం
టెక్నికల్ గా ఈ సినిమా బలంగా ఉంది. ముఖ్యంగా పిసి శ్రీరామ్ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. దేవిశ్రీ ప్రసాద్ పాటలు ఇంకొంచెం బాగుండాల్సింది. మాటల్లో అక్కడక్కడ ఛమక్కులు తగిలాయి. ఎమోషన్ సీన్లు దర్శకుడు ఇంకా బాగా రాసుకోవాల్సింది. అది లేకపోవడంతో.. ద్వితీయార్థం లో ఇబ్బందులు వచ్చాయి. దర్శకుడిగా ఇలాంటి కథల్ని బాగా హ్యాండిల్ చేయగలనని వెంకీ మరోసారి నిరూపించుకున్నాడు.
* ప్లస్ పాయింట్స్
నితిన్ - కీర్తి
ఫస్టాఫ్ లో వినోదం
కెమెరా
* మైనస్ పాయింట్స్
ఎమోషన్స్ లేకపోవడం
రొటీన్ కథ
కథలో సంఘర్షణ
* ఫైనల్ వర్డిక్ట్: పాత రంగులే