రారండోయ్ వేడుక చూద్దాం మూవీ రివ్యూ

మరిన్ని వార్తలు

తారాగణం: నాగ చైతన్య, రకుల్ ప్రీత్, జగపతిబాబు, సంపత్ రాజ్
బ్యానర్: అన్నపూర్ణ స్టూడియోస్
సంగీతం: దేవిశ్రీప్రసాద్
కెమెరామెన్: విశ్వేశ్వర్
ఎడిటర్: గౌతంరాజు
కథనం: సత్యానంద్
దర్శకత్వం: కళ్యాణ్ కృష్ణ 

అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో ఓ ద‌ర్శ‌కుడు వ‌రుస‌గా మూడు సినిమాలు చేయ‌డానికి సంత‌కాలు చేయ‌లేదు. ఒక్క కళ్యాణ్ కృష్ణ త‌ప్ప‌. సోగ్గాడే చిన్ని నాయ‌న సినిమాతోనే కళ్యాణ్ కృష్ణ ప‌నిత‌నం నాగార్జున‌కు అర్థ‌మైపోయింది. త‌న త‌న‌యుడికీ ఓ హిట్ ఇవ్వ‌గ‌ల‌డు అన్న న‌మ్మ‌కం క‌లిగింది. అందుకే `రారండోయ్ వేడుక చూద్దాం` సినిమాకి గ్నీన్ సిగ్న‌ల్ ప‌డింది. టైటిల్‌, ప్ర‌చార చిత్రాలు, మ‌రీ ముఖ్యంగా చైతూ - ర‌కుల్ కాంబినేష‌న్ చూడ‌ముచ్చ‌ట‌గా ఉండి, ఆక‌ర్షిస్తున్నాయి. అన్న‌పూర్ణ వారి సినిమా కాబ‌ట్టి, స‌మ్మ‌ర్‌లో వ‌చ్చింది కాబ‌ట్టి ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. మ‌రి.. రారండోయ్‌.. ఆడియ‌న్స్ వెళ్లేలానే ఉందా??  ఈ సినిమాలోని ప్ల‌స్సులు, మైన‌స్సులూ ఏంటి??  చూసొద్దాం రండి.

* క‌థ ఎలా సాగిందంటే...

భ్ర‌మ‌రాంబ (ర‌కుల్ ప్రీత్ సింగ్‌)  చిన్న‌ప్ప‌టి నుంచీ ఇంట్లో వాళ్ల మ‌మ‌తానురాగాల మ‌ధ్య గారాబంగా పెరిగింది. నాన్నంటే పంచ ప్రాణాలు. ఆ నాన్న  కూడా అంతే. కూతుర్ని గుండెల్లో పెట్టుకొని చూసుకొంటాడు. ఓ పెళ్లిలో భ్ర‌మ‌రాంబ‌ని చూసిన శివ (నాగ‌చైత‌న్య‌) తొలి చూపులోనే ప్రేమిస్తాడు. కానీ.. భ్ర‌మ‌రాంబ మాత్రం `మ‌న‌ది ఫ్రెండ్ షిప్పే. ప్రేమ గీమా అన్నావంటే ఇప్పుడే డ్రాప్ అయిపో` అంటుంది. అందుకే... భ్ర‌మ‌ని ప్రేమిస్తున్నా, ఆ ప్రేమ‌ని మ‌న‌సులోనే దాచుకొని స్నేహితుడిలా ఉండ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటాడు. మ‌రోవైపు శివ తండ్రి కృష్ణ (జ‌గ‌ప‌తిబాబు), భ్ర‌మ‌రాంబ నాన్న ఆది (సంప‌త్‌రాజ్‌) ల మ‌ధ్య పాతికేళ్ల ప‌గ న‌డుస్తుంటుంది. ఆ ప‌గ దేనికోసం?   భ్ర‌మ‌రాంబ శివ మ‌న‌సులోని ప్రేమ‌ని అర్థం చేసుకొందా, లేదా?  వీళ్లిద్ద‌రూ ఎలా క‌లిశారు??  అనేదే మిగిలిన క‌థ‌.

* ఎవ‌రెలా న‌టించారంటే..??

చైతూలో ఈజ్ సినిమా సినిమాకీ పెరుగుతోంది. అది రారండోయ్‌లోనూ స్ప‌ష్టంగా క‌నిపించింది. ర‌కుల్ ఫ్ల‌ట్ చేసే స‌న్నివేశాలు బాగా పండాయి. చైతూలో అల్ల‌రి, ప్రేమ చ‌క్క‌గా తెరపై చూపించ‌గ‌లిగాడు ద‌ర్శ‌కుడు.

ఈ సినిమాకి మ‌రో ప్ర‌ధాన ఆకర్ష‌ణ ర‌కుల్ ప్రీత్ సింగ్‌. త‌న క్యారెక్ట‌రైజేష‌నే కొత్త‌గా అనిపిస్తుంది. భ్ర‌మ‌రాంబ‌గా పాత్ర‌లో ఇమిడిపోయింది. భ్ర‌మ‌రాంబ క్యారెక్ట‌రైజేష‌న్ మిన‌హా యిస్తే... క‌థ‌లో ఏం లేదు. అంటే ఈ క‌థంతా ర‌కుల్ చుట్టూనే తిరుగుతుంద‌న్న‌మాట‌. 

జ‌గ‌ప‌తిబాబు, సంప‌త్ రాజ్‌,... మ‌రోసారి ఆక‌ట్టుకొనే న‌ట‌న ప్ర‌ద‌ర్శించారు. వెన్నెల కిషోర్ కొన్ని న‌వ్వులు పంచిపెట్టాడు.

* ఎలా తీశారంటే...??

కుటుంబ స‌మేతంగా చూడ‌ద‌గ్గ సినిమా ఒక‌టి కావాలి..`  అంటూ ద‌ర్శ‌కుడు కళ్యాణ్ కృష్ణ‌కు నాగార్జున హింట్ ఇచ్చి ఉంటాడు. అందుకే... కళ్యాణ్ కృష్ణ స‌రిగ్గా ఆ కొల‌త‌ల‌తోనే ఓ క‌థ‌ను అల్లుకొన్నాడు. క‌థ‌లో కొత్త‌ద‌నం ఏం లేదు. రారండోయ్ కథ‌ని ఓ ముక్క‌లో చెప్పుకొంటే చాలా పాత సినిమాలు క‌ళ్ల ముందు క‌ద‌లాడ‌తాయి. ఆ క‌థ‌ని న‌డిపిన విధానంలోనూ కొత్త‌గా మ‌లుపులేం ఉండ‌వు. కానీ... కుటుంబ ప్రేక్ష‌కుల అభిరుచికి త‌గ్గ‌ట్టుగా స‌న్నివేశాల్ని మ‌ల‌చుకొన్నాడు ద‌ర్శ‌కుడు. భ్ర‌మ‌రాంబ క్యారెక్ట‌రైజేష‌న్‌, సినిమా ప్రారంభంలో వ‌చ్చే పెళ్లి స‌న్నివేశాలు, ఆ త‌ర‌వాత చైతూ - భ్ర‌మ‌ల మ‌ధ్య న‌డిపించిన సీన్లు.. ఇవ‌న్నీ చ‌క చ‌క సాగిపోతాయి.  కామెడీ, ఈ క‌థ‌ని చిత్రీక‌రించిన తీరు, పాట‌లూ.. ఇవ‌న్నీ సంప్ర‌దాయబ‌ద్దంగా సాగ‌డంతో ఫస్టాఫ్ ఓకే అనిపిస్తుంది. ద్వితీయార్థంలో ఎమోష‌న్ సీన్ల‌కు పెద్ద పీట వేశాడు ద‌ర్శ‌కుడు. తండ్రీ కొడుకుల ఎమోష‌న్స్‌, తండ్రీ కూతుర్ల ఎమోష‌న్స్ చ‌క్క‌గా తెర‌పైకి తీసుకొచ్చాడు. ప‌తాక సన్నివేశాల్లో ఏం జ‌రుగుతుందో ప్రేక్ష‌కుడు ముందే ఊహించ‌గ‌ల‌డు. అక్క‌డ కూడా ట్విస్టులేం లేవు. కానీ... ద‌ర్శ‌కుడు వాటిని కూడా కాస్తో కూస్తో ఆస‌క్తి క‌లిగేలా తెర‌కెక్కించాడు. మొత్తానికి ఫ్యామిలీ మొత్తాన్ని థియేట‌ర్ల‌కు తీసుకొచ్చేలా.. ఈ సినిమాని రూపొందించాడు.

* టెక్నిక‌ల్‌గా...

దేవిశ్రీ సంగీతం ఈ సినిమాకి మ‌రో ప్ర‌ధాన బ‌లం.  పాట‌లు క‌థ‌లో భాగంగానే వ‌స్తాయి. నేప‌థ్య సంగీతం కూడా న‌చ్చుతుంది. కెమెరా వ‌ర్క్ త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది. సినిమాని ఓ రంగుల హ‌రివిల్లులా అందంగా చూపించాడు. `గుండె లెఫ్టే ఉన్నా. ఎప్పుడూ రైటే చెబుతుంది` అంటూ మ‌న‌సుకు హ‌త్తుకొనే డైలాగులు చాలానే రాసుకొన్నాడు కళ్యాణ్ కృష్ణ‌.  స‌న్నివేశాల కూర్పులో త‌న నేర్పు ప్ర‌ద‌ర్శించాడు.

* ప్ల‌స్ పాయింట్స్‌

+ చైతూ - ర‌కుల్‌
+ జ‌గ‌ప‌తిబాబు
+ కుటుంబ వాతావ‌ర‌ణం

* మైన‌స్ పాయింట్స్

- క‌థ పాత‌దే
- అక్క‌డ‌క్క‌డ నెమ్మ‌దించిన క‌థ‌నం

* ఫైన‌ల్ వ‌ర్డిక్ట్: 

ఈ సినిమాకి ఆరోగ్యానికి మంచిదే! 

యావరేజ్ యూజర్ రేటింగ్: 3.25/5

రివ్యూ బై శ్రీ

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS