తారాగణం: సప్తగిరి, కషిష్, సాయి కుమార్ తదితరులు
సంగీతం: విజయ్
నిర్మాత: Dr K రవి కిరణ్
దర్శకుడు: చరణ్ లక్కాకుల
యావరేజ్ యూజర్ రేటింగ్: 2.5/5
హాస్య నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు సప్తగిరి. హీరోగానూ నిరూపించుకుని మరో మెట్టు ఎదగాలన్నది అతని ప్రయత్నం. సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌తో... ఓకే అనిపించుకున్నాడు. అయితే.. `హిట్` మాత్రం అందుకోలేదు. దాన్ని సాధించేందుకు మరోసారి `సప్తగిరి ఎల్ ఎల్ బీ`గా ముస్తాబయ్యాడు. బాలీవుడ్‌లో మంచి విజయం అందుకున్న జాలీ ఎల్ ఎల్ బీకి ఇది రీమేక్. మాతృకలో సీరియెస్ నెస్ ఎక్కువ. సప్తగిరిదేమో కామెడీ ఫేసు. మరి ఈ సినిమా సీరియెస్‌గా ఉందా? కామెడీ అయ్యిందా?? చూద్దాం..
* కథ..
సప్తగిరి (సప్తగిరి) ఎల్.ఎల్.బీ పూర్తి చేస్తాడు. ఊర్లో ఏ పంచాయితీ జరిగినా.. న్యాయాన్యాయాలు నిర్ణయించేది, దోషుల్ని బయటకు లాగేది సప్తగిరే. కోర్టులో మాత్రం లాయర్ గా విఫలమవుతూ ఉంటాడు. ఒక్క కేసు కూడా గెలవలేడు. పట్నం వెళ్తే, పెద్ద పెద్ద కేసులు తగులుతాయని, పెద్ద పెద్ద లాయర్లతో ఢీ కొట్టే అవకాశం వస్తుందని.. హైదరాబాద్ వెళ్తాడు. సాక్ష్యాధారాలు లేవని కోర్టు కొట్టేసిన `హిట్ అండ్ రన్` కేసుని తిరగదోడతాడు. ఆ కేసులో కొమ్ములు తిరిగిన సీనియర్ మోస్ట్ లాయర్ రాజ్ పాల్ (సాయికుమార్)తో తలపడాల్సివస్తుంది. ఈ కేసులో సప్తగిరి ఎలా గెలిచాడు?? రాజ్ పాల్‌ని ఎలా ఎదుర్కున్నాడు? అనేదే కథ.
* నటీనటుల ప్రతిభ..
సప్తగిరి అంటే అల్లరి. అది ఈ సినిమాలో కనిపిస్తుంది. దాంతో పాటు ఎమోషన్ సీన్స్‌లోనూ రాణించాడు. డాన్సులు, ఫైట్ల విషయంలో చాలా కష్టపడ్డాడు. అది తెరపై కనిపిస్తూనే ఉంటుంది. తొలి పాటలో షాకింగ్ స్టెప్పులు వేశాడు.
కథానాయిక శుద్ధ దండగ. ఆమె ఆహార్యమూ బాగోలేదు. మరీ పీలగా కనిపించింది.
సాయికుమార్ నటన ఆద్యంతం ఆకట్టుకుంది. ఆ పాత్రని సాయికుమార్ తప్ప ఎవ్వరూ చేయలేరు అన్నంతగా ఇమిడిపోయాడు.
శివ ప్రసాద్‌కీ చాలా మంచి పాత్ర దక్కింది. గొల్లపూడి, ఝాన్సీ, షకలక శంకర్... వీళ్లంతా తమ పాత్రల మేర రాణించారు.
మాతృకతో పోల్చుకోకుండా చూస్తే.. అందరి నటనా గుర్తిండిపోయేలానే ఉంది.
* విశ్లేషణ..
`జాలీ ఎల్ ఎల్ బీ` చూసినవాళ్లకు సప్తగిరి ఎల్ ఎల్ బీ కథపై ఇప్పటికే ఓ అవగాహన వచ్చి ఉంటుంది. దర్శకుడు ఆ పాయింట్‌ని అలానే ఉంచి, సప్తగిరి కోసం కొన్ని కామెడీ బిట్లు రాసుకున్నాడు. అవి పెద్దగా పండలేదు. కోర్టులో జరిగే సీరియెస్ ఎమోషన్ వరకూ మాతృకను తు.చ తప్పకుండా ఫాలో అయిపోయాడు. నిజానికి జాలీ ఎల్ ఎల్ బీలో వేలెత్తి చూపించడానికీ, మార్పులు చేయడానికి అవకాశమే ఉండదు. అంత పకడ్బందీ స్క్రిప్టు అది. అందుకే ఆ కథ జోలికి పోకుండా... బయటకు జరిగే హడావుడి మాత్రం కొత్తగా రాసుకున్నదే. అయితే దురదృష్టం కొద్దీ యాడింగ్ ఎమోషన్స్ ఏవీ పండలేదు. కోర్టు సీన్లు, అందులో ఎమోషన్స్ మాత్రం బాగానే వచ్చాయి.
మరీ ముఖ్యంగా చివరి 30 నిమిషాలూ.. ప్రేక్షకుల్ని కూర్చోబెట్టగలిగాడు. జాలీ ఎల్.ఎల్.బీ చూడని వాళ్లకు ఆ ఎపిసోడ్ ఉత్కంఠత కలిగిస్తుంది. మధ్యమధ్యలో వచ్చే పాటలు కథాగమనానికి అడ్డు పడతాయి. అయితే అందులోని సప్తగిరి స్టెప్పులు చూసి ఆశ్చర్యపోతారు. మాతృకలో `రైతు` కోణం లేదు. అది పరుచూరి బ్రదర్స్ వారి సృష్టి. ఆ పాయింట్ బాగానే అతికింది. ఎక్ట్స్‌ట్రా ఎమోషన్స్ పండించే అవకాశం దక్కింది. `జాలీ ఎల్ ఎల్ బీ` సీరియెస్ గా సాగే కథ. దాన్ని అలానే చెప్పాలేమో. కామెడీ డోస్ కోసం ప్రయత్నిస్తే... కథలో ఫీల్ తగ్గే ప్రమాదం ఉంది. సీరియెస్ విషయాన్నీ సిల్లీగా తీసుకునే ఆస్కారం ఉంది. ఉన్నది ఉన్నట్టుగా ఆ కథని తీసినా బాగుండేదేమో అనిపించింది.
* సాంకేతిక వర్గం..
పాటలు అనవసరంగా వచ్చిపడిపోతుంటాయి. దాంతో... అందులో సప్తగిరి స్టెప్పులు బాగున్నా... ఎక్కలేదు. పరుచూరి పదును అక్కడక్కడ కనిపించింది. కోర్టు సీన్లలో చాలా సన్నివేశాలు మాతృకను ఫాలో అయిపోతూ రాసుకున్నవే. ఇలాంటి కథల్ని రీమేక్ చేయడం అనుకున్నంత సులభం కాదు. దర్శకుడు పాస్ మార్కులతో గట్టెక్కేశాడు. పాటల్ని రిచ్‌గా తీశారు. నిర్మాణ విలువలు కనిపించాయి.
* ప్లస్ పాయింట్స్
+ సప్తగిరి
+ కోర్టు సీన్లు
+ సాయికుమార్ నటన
* మైనస్ పాయింట్స్
- హీరోయిన్
- పాటలు
* ఫైనల్ వర్డిక్ట్ : సప్తగిరి ఎల్.ఎల్.బీ... జస్ట్ టైమ్ పాస్ మూవీ
రివ్యూ బై శ్రీ