తారాగణం: విజయ్, కీర్తి సురేష్, వరలక్ష్మి శరత్ కుమార్, ప్రేమ్ కుమార్, యోగిబాబు, రాధా రవి & తదితరులు
నిర్మాణ సంస్థ: సన్ పిక్చర్స్
సంగీతం: ఏఆర్ రెహ్మాన్
ఛాయాగ్రహణం: గిరీష్ గంగాధరన్
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
రచన: జయమోహన్
నిర్మాత: కళానిధి మారన్
కథనం-దర్శకత్వం: ఏఆర్ మురుగదాస్
రేటింగ్: 2.5/5
విజయ్ సినిమా అంటే తెలుగులో మార్కెట్ తక్కువే. సూర్య, కార్తి, విశాల్ సినిమాలకు ఉన్న క్రేజ్ కూడా విజయ్ సినిమాలకు ఉండదు. కానీ తుపాకీతో లెక్క మారింది. ఆ సినిమా మంచి విజయాన్నిఅందుకొంది. `అదిరింది`కీ ఆకట్టుకునే వసూళ్లు దక్కాయి. దాంతో విజయ్ సినిమాకి ఫోకస్ పెరిగింది. పైగా మురుగదాస్ కాంబినేషన్ అనేసరికి అది రెట్టింపు అవ్వడం ఖాయం. అందుకే `సర్కార్` కోసం తెలుగు ప్రేక్షకులూ ఆసక్తిగా ఎదురుచూశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది?? విజయ్ - మురుగదాస్ కాంబోపై ఉన్న అంచనాల్ని అందుకుందా?
* కథ
సుందర్ (విజయ్) అమెరికాలోని ఓ ప్రముఖ కార్పొరేట్ కంపెనీకి సీఈవో. తన కంపెనీకి పోటీగా వచ్చిన సంస్థలన్నింటినీ తన తెలివితేటలతో తొక్కేస్తుంటాడు. ఓ రకంగా కార్పొరేట్ క్రిమినల్. అలాంటి సుందర్ ఇండియా వస్తాడు. ఈసారి ఏ కంపెనీకి తాళాలు వేస్తాడో అని, ఇక్కడి సంస్థలన్నీ భయపడతాయి. కానీ సుందర్ వచ్చింది.. తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి అని తేలుతుంది.
అయితే.. అప్పటికే సుందర్ ఓటుని ఎవరో వేసేస్తారు. దాంతో సుందర్ న్యాయ పోరాటానికి దిగుతాడు. తన ఓటు హక్కుని కాపాడుకుంటాడు. ఆ ప్రయత్నంలో.. సీఎమ్‌కి ప్రత్యర్థిగా నిలబడి పోటీ చేయాలనుకునే నిర్ణయానికి వస్తాడు. ఈ ప్రయాణం ఎలా సాగింది? సుందర్ ఈ వ్యవస్థలో, ఓటర్లలో తీసుకొచ్చిన మార్పేంటి? అనేదే కథ.
* నటీనటులు
విజయ్ ఎప్పట్లా తన పాత్రలో అల్లుకుపోయాడు. ప్రతీ ఫ్రేములోనూ తన అభిమానుల్ని అలరించడానికే తాపత్రయపడ్డాడు. తెలుగులో ఏమో గానీ, తమిళ నాట మాత్రం ప్రతీ సీనుకీ విజుల్సు పడడం ఖాయం.
కీర్తి మరోసారి నిరాశపరిచింది. తనకేమాత్రం గుర్తింపు ఇవ్వలేని పాత్రని ఎంచుకుంది.
వరలక్ష్మి మాత్రం ఆకట్టుకుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ మొత్తం.. ఆమె చుట్టూనే తిరుగుతుంది. మిగిలినవన్నీ తమిళ మొహాలే.
* విశ్లేషణ
మురుగదాస్ కథలన్నీ సామాజిక ఇతివృత్తంతో సాగేవే. ఈసారి `దొంగ ఓటు` అనే పాయింట్‌ని పట్టుకున్నాడు మురుగదాస్. దాన్ని విజయ్ స్టామినాకు, క్రేజ్‌కు తగినట్టుగా మలచుకున్నాడు. విజయ్ అభిమానులకు ఏం కావాలో.. మురుగదాస్‌కి బాగా తెలుసు. తుపాకీ, కత్తి తీసి జనాల్ని మెప్పించినవాడు కదా..? అందుకే విజయ్ అభిమానుల ఆశలు, అంచనాలూ బాగా పట్టుకున్నాడు. వాటికి అనుగుణంగానే ఈ కథని తీర్చిదిద్దాడు. విజయ్ హీరోయిజాన్ని అడుగడుగునా బిల్డప్ చేసుకుంటూ వెళ్తూ.. తన కథని చెప్పేశాడు. పాటలు, ఫైటింగులు ఇవన్నీ మాస్, కమర్షియల్ సూత్రాలకు అనుగుణంగానే సాగుతాయి. అయితే.. కథ డిస్ట్రబ్ అవ్వకుండా జాగ్రత్త పడ్డాడు.
ఇదో రాజకీయ చిత్రం. తమిళనాట రాజకీయాలన్ని ధ్యేయంగా తీసుకున్నట్టు అర్థం అవుతోంది. ఉచిత పథకాలు, ఆసుపత్రి రాజకీయాల్ని మురుగదాస్ బాగా వాడుకున్నాడు. రాజ్యాంగంలో 49వ ఆర్టికల్ ఏం చెప్పిందో తెలీదుగానీ.. దాన్ని కళ్లకు కట్టినట్టు చూపించగలిగాడు. తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన ఓ కార్పొరేట్ మేధావి... తన తెలివితేటల్ని రాజకీయాల కోసం వాడుకుంటే ఎలా ఉంటుందో.. ఆసక్తికరంగా సినీ ఫక్కీలో చెప్పాడు. ద్వితీయార్థం మొత్తం రాజకీయాల నేపథ్యంలోనే సాగుతుంది. ఎత్తులు, పైఎత్తులు ఆకట్టుకుంటాయి.
అయితే అవన్నీ సినిమాటిక్‌గానే అనిపిస్తాయి. వాస్తవ జీవితంలో ఇలా జరుగుతుందా? అనే అనుమానాలు అడుగడుగునా వెంటాడతాయి. ఓ రకంగా ప్రేక్షకుడ్ని ఓ భ్రమలో ఉంచేశాడు దర్శకుడు. చాలా సార్లు నేల విడచి సాము చేశాడు. అయితే... అదంతా తన స్క్రీన్‌ప్లే టెక్నిక్‌తో కప్పిపుచ్చగలిగాడు. మొత్తానికి చూస్తే విజయ్ తాలుకు అభిమానుల అంచనాలు ఏమాత్రం తగ్గకుండా, తాను చెప్పదలచుకున్న పాయింట్ చెప్పడంలో మాత్రం విజయవంతమయ్యాడు
* సాంకేతిక వర్గం
రెహమాన్ తన స్థాయికి తగిన సంగీతం ఇవ్వలేకపోతున్నాడు.ఈసారీ అదే జరిగింది. ఒక్క ట్యూను కూడా వినసొంపుగా లేదు. నేపథ్య సంగీతం కూడా అంతంతమాత్రమే.
విజువల్‌గా ఈ సినిమా చాలా బాగా వచ్చింది. ఫైట్స్ మాస్‌ని ఆకట్టుకుంటాయి. కథకుడిగా మురుగదాస్ మరోసారి ఆకట్టుకున్నాడు. తన శైలిని, విజయ్ ఫ్యాన్స్ ఆశల్నీ బాగా మౌల్డ్ చేశాడు. కాకపోతే సినిమాటిక్ స్వేచ్ఛని కావల్సినదానికంటే ఎక్కువ తీసుకున్నాడు.
* ప్లస్ పాయింట్స్
+ విజయ్
+ దర్శకుడు ఎంచుకున్న పాయింట్
+ మాస్ ఎలిమెంట్స్
* మైనస్ పాయింట్స్
- హీరోయిన్ ట్రాక్
- లాజిక్ లేని సీన్లు
* ఫైనల్ వర్డిక్ట్: విజయ్ ఫ్యాన్స్‌కి ప్రత్యేకం `సర్కార్`.
రివ్యూ రాసింది శ్రీ