చిత్రం: శివలింగ
తారాగణం: రాఘవ లారెన్స్, రితిక సింగ్, శక్తి, వడివేలు, ఊర్వశి తదితరులు.
సంగీతం: ఎస్ ఎస్ తమన్
సినిమాటోగ్రఫీ: సర్వేష్ మురారి
దర్శకత్వం: పి.వాసు
నిర్మాతలు: రమేష్ పి పిళ్ళై
*కథా కమామిషు...
థ్రిల్లర్ సినిమాల్లో నటించడం, దర్శకత్వం వహించడం ద్వారా కొరియోగ్రాఫర్, దర్శకుడు లారెన్స్ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. అలాంటి లారెన్స్ నటించిన ఈ చిత్రానికి పి.వాసు దర్శకత్వం మరో ప్రధాన ఆకర్షణ. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా కథలోకి వెళితే, రహీమ్ ట్రైన్‌లో ప్రయాణిస్తూ ఉంటాడు. ఆ సమయంలో అంధుడైన ఓ వ్యక్తి డోర్ వైపుగా వెళుతుంటాడు. అతన్ని రక్షించే క్రమంలో రహీమ్ తన ప్రాణాల్ని కోల్పోతాడు. రహీమ్ భార్య, తన భర్త మరణం యాక్సిడెంట్ కాదని అంటుంది. ఈ కేసు సిఐడి ఆఫీసర్ శివలింగేశ్వరన్ (లారెన్స్) చేతికి వెళుతుంది. ఆయన భార్య సత్య (రితికా సింగ్). ఈ కేసుని శివలింగేశ్వరన్ ఎలా ఛేదించాడో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
*నటీనటులెలా చేశారు..
సిఐడి ఆఫీసర్ పాత్రలో రాఘవ లారెన్స్ ఒదిగిపోయాడు. ఇలాంటి సినిమాల్లో లారెన్స్ చెలరేగిపోవడం చూశాం. ఇందులోనూ లారెన్స్ నటన ఆకట్టుకుంటుంది. సీరియస్ టోన్‌లోనూ, సరదాగా సాగే పాత్రలోనూ లారెన్స్ రాణించాడు. 'కేక్ వాక్' తరహాలో లారెన్స్ అలా అలా చేసుకుపోయాడు. డాన్స్ మాస్టర్ గనుక, పాటల్లో చెలరేగిపోవడం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం ఉండదు.
సత్య పాత్రలో రితికా సింగ్ చాలా బాగా చేసింది. డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్‌తో కట్టిపడేసింది. ముందు ముందు మంచి హీరోయిన్‌గా గుర్తింపు పొందే అవకాశాలు ఆమెలో మెండుగా కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో గ్లామరస్‌గానూ కనిపించింది రితికా సింగ్. డాన్సుల్లో లారెన్స్‌తో పోటీ పడిందనడం అతిశయోక్తి కాకపోవచ్చు.
మిగతా పాత్రల్లో వడివేలు సినిమాకి కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ అందించాడు. అతని సీనియారిటీ ఉపయోగపడింది. సినిమాలో మిగిలిన నటీనటులంతా తమ పాత్ర పరిధి మేర బాగానే చేశారు.
*సాంకేతిక వర్గం పనితీరు..
ఇలాంటి సినిమాలకి సినిమాటోగ్రఫీ ప్రాణం. అలాగే మ్యూజిక్ కూడా. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. పాటలూ ఓకే. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. డైలాగ్స్ ఓకే. ఎడిటింగ్ ఇంకాస్త అవసరం అనిపిస్తుంది. కాస్ట్యూమ్స్, ఆర్ట్ డిపార్ట్‌మెంట్ సినిమాకి తగ్గట్టుగా వర్క్ చేశాయి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సినిమా రిచ్‌గా రూపొందింది.
*విశ్లేషణ...
థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్ తోడైతే ఈ తరహా సినిమాలు విజయం సాధించడం తథ్యం. ఈ సినిమాకి కూడా అదే 'రూట్' ఫాలో అయ్యారు. కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్, తగినంత థ్రిల్లింగ్ కంటెంట్ ఇవన్నీ సినిమాలో మెండుగా ఉన్నాయి. ఇలాంటి సినిమాల్ని రూపొందించడంలో పి.వాసుది అందెవేసిన చెయ్యి. ఈ సినిమా విషయంలోనూ ఆయన మ్యాజిక్ కొంత మేర వర్కవుట్ అయ్యిందని చెప్పవచ్చు. ఈ తరహా సినిమాల్ని ఇష్టపడేవారిని 'శివలింగ' ఏమాత్రం నిరాశపరచదు. సినిమాకి జరిగిన ప్రచారం, లారెన్స్ ఫ్యాక్టర్, హీరోయిన్ రితికా సింగ్ సినిమాకి వెయిట్ పెంచాయి. మాస్‌ని మెప్పించే సినిమా కావడంతో ఆశించిన విజయాన్ని అందుకునే అవకాశాలున్నాయి.
*ఫైనల్ వర్డ్..
శివలింగ - లారెన్స్, పి.వాసు మార్క్ మూవీ
యావరేజ్ మూవీ రివ్యూ: 3/5