తారాగణం: మహేష్ బాబు, రకుల్ ప్రీత్, ఎస్ జే సూర్య
నిర్మాణ సంస్థ: NVR సినిమా
సంగీతం: హారిస్ జయరాజ్
ఛాయాగ్రహణం: సంతోష్ శివన్
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
నిర్మాతలు: ఎన్వీ ప్రసాద్, టాగూర్ మధు, మంజుల
రచన-దర్శకత్వం: మురుగదాస్
యూజర్ రేటింగ్: 3/5
మహేష్ బాబు కెరీర్‌లో కీలకమైన సినిమా.. స్పైడర్. అందుకు రెండు కారణాలున్నాయి.
1. బ్రహ్మోత్సవం అనే డిజాస్టర్ తరవాత చేస్తున్న సినిమా.
2. తమిళంలో ఎంట్రీ ఇస్తున్న సినిమా
కాబట్టి... కాస్త జాగ్రత్తగానే ఉండాల్సిన అవసరం వచ్చింది. మురుగదాస్ దర్శకుడు అనేసరికి.. స్పైడర్‌పై భారీ అంచనాలుంటాయి. పైగా సాంకేతికంగా తిరుగులేని టీమ్ ఈ సినిమాకి పని చేసింది. కాబట్టి - స్పైడర్‌పై ఆ అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. మురుగదాస్ ట్రాక్ రికార్డు చూస్తే, టెక్నీషియన్ల లిస్టు చూస్తే... `స్పైడర్`ని గుండెలమీద చేయి వేసుకొని చూసేయొచ్చు.. అన్న భరోసా కలుగుతుంది. మరి దాన్ని స్పైడర్ అందుకొన్నాడా? లేదా?? చూద్దాం.. రండి.
* కథ
శివ (మహేష్‌బాబు) ఇంటిలిజెన్స్ బ్యూరోలో పనిచేస్తుంటాడు. అనుమానితుల ఫోన్ కాల్స్‌ని ట్యాపింగ్ చేసి... పోలీసు యంత్రాంగానికి సమాచారం అందించడం అతని పని. అయితే.. తనకంటూ ఓ సాఫ్ట్ వేర్ ఒకటి తయారు చేసి.. ఆపదలో ఉన్న వ్యక్తుల ఫోన్ కాల్స్ వింటుంటాడు శివ. అలా.. చాలామందిని కాపాడగలుగుతాడు. అయితే ఓ అపరిచితుడు నుంచి హైదరాబాద్‌కి ముప్పుందన్న విషయం ఈ ట్యాపింగ్ ద్వారానే తెలుస్తుంది. ఆ అపరితుడి పేరు భైరవుడు (సూర్య). అతన్ని పట్టుకొనే క్రమంలో భైరవుడి తమ్ముడు (భరత్)ని చంపేస్తాడు శివ. దాంతో... శివపై కోపం. పగ పెంచుకొంటాడు భైరవుడు. వీరిద్దరి మధ్య జరిగే పోరాటంలో ఎవరు గెలిచారు? భైరవుడి బారీ నుంచి హైదరాబాద్ నగరాన్ని ఎలా కాపాడగలిగాడు? అనేదే స్పైడర్ కథ.
* నటీనటులు..
మహేష్ బాబు ఎంతటి నటుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శివ పాత్రలోనూ ఒదిగిపోయాడు. సినిమా అంతా సీరియెస్‌గా కనిపించే సరికి.. మహేష్ నుంచి చూసి తరించే `నవ్వు` మిస్ అయ్యింది. ఎమోషన్ సీన్లలో తన అనుభవాన్నంతా రంగరించాడు.
రకుల్ అల్లరి పిల్లలా కనిపించింది. తన పాత్రకు అంతకు మించిన ప్రాధాన్యం లేదు.
ఇక ఎస్.జె.సూర్య గురించి చెప్పుకోవాలి. సూర్య ఎపిసోడ్లు, అతనికి ఇచ్చిన డబ్బింగ్ ఆకట్టుకొంటాయి. సూర్య లేకపోతే, అతని స్థానంలో మరో విలన్ ఉంటే ఈసినిమా ఎప్పుడో తేలిపోదును.
* విశ్లేషణ..
స్పైడర్ ఓ థ్రిల్లర్. తెలివైన కథానాయకుడికీ, సైకో లాంటి విలన్‌కీ మధ్య జరిగే పోరు. అందుకు తగిన ఫ్లాట్ ని మురుగదాస్ బాగానే రాసుకొన్నాడు. మరీ ముఖ్యంగా భైరవుడు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్, భైరవుడు అలా మారడానికి కారణం చాలా ఆసక్తిగా మలచుకొన్నాడు. ఓ శక్తిమంతమైన సైకోని తయారు చేయగలిగాడు. కథానాయకుడు ఎలాగూ తెలివైన వాడే. కాబట్టి.. వీరిద్దరి మధ్య పోరు రసవత్తరంగా సాగే అవకాశం ఏర్పడింది. భైరవుడి గురించి తెలుసుకొనే ప్రయత్నం, ఇంట్రవెల్ బ్యాంగ్... ఇవన్నీ థ్రిల్లింగ్ కలిగిస్తాయి. మురుగదాస్ ఇంటిలిజెన్స్ ఈ కథలో అడుగడుగునా కనిపిస్తుంది. భైరవుడ్ని పట్టుకోవడానికి కాలనీలోని మహిళల్ని వాడుకోవడం ఈ సినిమాకే హైలెట్‌గా నిలిచే సన్నివేశం. అమ్మ, తమ్ముడ్ని భైరవుడి నుంచి కాపాడుకోవడానికి శివ వేసే ప్లాన్ కూడా వర్కవుట్ అయ్యింది. అయితే... సాంకేతికంగా ఎలివేట్ అవ్వాల్సిన సన్నివేశాలు కాస్త తేలిపోయాయి. బండరాయి ఎపిసోడ్ గురించి చాలా ఊహించారంతా. కానీ... గ్రాఫిక్స్ వల్ల అంతగా ఎఫెక్టీవ్‌గా రాలేదు. క్లైమాక్స్ కూడా అంతే. బాంబులు పెట్టి ఆసుపత్రిని పేల్చేయాలనుకోవడంలో భైరవుడి ఇంటిలిజెన్సీ ఏముంది?? పతాక సన్నివేశాల్లో పక్కవాడిని లైన్ చేయండి.. ప్రేమని షేర్ చేయండి.. అని మహేష్‌తో చెప్పించడం మినహా.. ఏం చేయలేకపోయాడు దర్శకుడు. భైరవుడి అంతం కూడా సాదాసీదాగా సాగింది. వీటి మధ్యలో సాగిన లవ్ స్టోరీ కూడా పండలేదు. ఒక విధంగా కథానాయిక (రకుల్) క్యారెక్టరైజేషన్‌ని డామేజ్ చేసేట్టే కనిపించింది. హీరో - విలన్ల పోరులో ఇంకాస్త ఇంటిలిజెన్సీ ఆశించారు ప్రేక్షకులు. అది కొరవడింది.
* సాంకేతికంగా..
మురుగదాస్ సినిమా అంటే స్క్కీన్ ప్లే వైవిధ్యంగా, రేసీగా ఉంటుందని భావిస్తారు. కానీ ఆ స్పీడు ఈ సినిమాలో కనిపించలేదు. కొన్ని కొన్ని చోట్ల మెరిసినా... మహేష్ స్టామినాకు అది సరిపోలేదు. హరీశ్ పాటలు మరో పెద్ద మైనస్. విజువల్ ఎఫెక్ట్స్ మరింత శ్రద్దతో తెరకెక్కించాల్సింది. సంతోష్ శివన్ కెమెరా పనితనం గురించి ఇక చెప్పేదేముంది?? మాటల రచయితగా మురుగదాస్ మెప్పిస్తాడు.
* ప్లస్ పాయింట్స్
+ మహేష్
+ సూర్య
+ విలన్‌ని పట్టుకొనే ఎపిసోడ్
* మైనస్ పాయింట్స్
- క్లైమాక్స్
* ఫైనల్ వర్డిక్ట్: స్పైడర్... వన్ టైమ్ వాచ్
రివ్యూ బై శ్రీ