నటీనటులు : శర్వానంద్, ప్రియాంక మోహన్, రావు రమేష్ తదితరులు
దర్శకత్వం : బి కిశోర్
నిర్మాతలు : రామ్ ఆచంట, గోపి ఆచంట
సంగీతం : మిక్కీ జె మేయర్
సినిమాటోగ్రఫర్ : జె యువ్ రాజ్
ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేష్
రేటింగ్: 3/5
రైతే రాజు అంటారు. జై కిసాన్ అంటూ.. జేజేలు పలుకుతారు. రైతు లేకపోతే దేశం లేదు, మనుగడే లేదు అంటారు.కానీ రైతు కష్టాలు ఎవరూ పట్టించుకోరు. రైతులంటే ఇంకా చిన్న చూపే. రైతు ఇంటి నుంచి రైతు రాడు. వచ్చినా `వ్యవసాయం లో ఏముంది` అంటూ పెదవి విరుస్తారు. అందుకే రైతు ఒంటరివాడైపోయాడు. కానీ ఈ తరానికి వ్యవసాయం ప్రాముఖ్యత చెప్పడం చాలా అవసరం. వ్యవసాయం వృత్తిగా చేపట్టండి.. అని పిలుపు ఇవ్వడం ఇంకా అవసరం. అలాంటి పనులు, ప్రయత్నాలూ కొన్ని సినిమాలు చేస్తుండడం అభినందించదగిన విషయం. మొన్నటి మహర్షి.. ఈనాటి శ్రీకారం.. అలాంటి సినిమాలే.
* కథ
కార్తీక్ (శర్వానంద్) ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్. చాలా ప్రతిభావంతుడు. తండ్రి (రావురమేష్)కి కొడుకు ఎదుగుదల గర్వంగా అనిపిస్తుంటుంది. కార్తీక్ అమెరికాలో సెటిల్ అవ్వాలన్నది తండ్రిగా ఆయన ఆశ.అయితే.. కార్తీక్ మాత్రం ఓ అనూహ్యమైన నిర్ణయం తీసుకుంటాడు. తండ్రిలా వ్యవసాయం చేయాలనుకుంటాడు. అందుకోసం తన ఉద్యోగాన్ని కూడా వదులుకుంటాడు. ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ వ్యవసాయం వైపు ఎందుకు రావాల్సివచ్చింది? నాగలి పట్టాక తనకు ఎదురైన అనుభవాలేంటి? అనేది మిగిలిన కథ.
* విశ్లేషణ
మహర్షి కథ గుర్తుండే ఉంటుంది. ఓ సంపన్నుడు పొలంలోకి దిగి వ్యవసాయం చేయడం, రైతులకు ఆదర్శంగా నిలవడం, వీకెండ్ వ్యవసాయం అంటూ... యువతరాన్ని ప్రోత్సహించడం - ఇదీ కథ. శ్రీకారం కూడా వ్యవసాయం నేపథ్యంలో సాగే కథే. ఈసారి.. ఉమ్మడి వ్యవసాయం గురించి చెప్పే ప్రయత్నం చేశారు. కమర్షియల్ విషయాల్ని పక్కన పెడితే, ఇలాంటి కథ ఎంచుకోవడం ఓ సాహసం అని చెప్పాలి. ఎందుకంటే... సరిగా తీయకపోతే... పాఠం అయిపోతుంది. కమర్షియల్ అంశాలు ఎక్కువగా మేళవిస్తే - అసలు విషయం పక్కదారి పడుతుంది. ఆ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం చాలా కీలకం.
దర్శకుడు ఆ విషయంలో మంచి మార్కులే తెచ్చుకుంటాడు. దర్శకుడికి గ్రామీణ జీవితం, అక్కడి పరిస్థితులు, రైతుల ఇబ్బందుల పై మంచి అవగాహన ఉన్నట్టుంది. వాటి చుట్టూనే కథ నడిపాడు. ఆయా సన్నివేశాలు ప్రేక్షకుడ్ని కథతో కనెక్ట్ చేస్తాయి. వ్యవసాయానికి సంబంధించిన కథే అయినా.. తండ్రీ కొడుకుల నేపథ్యం కూడా ఓ పొరగా కనిపిస్తుంది. అది కథకు మరింత బలాన్నిచ్చింది. కరోనా నేపథ్యంలో వ్యవసాయ రంగానికి ఏర్పడిన సవాళ్లు, వాటికి పరిష్కార మార్గాలూ.. కూడా చూపించారు. బహుశా... చివర్లో ఆయా మార్పులు చేసి ఉంటారు. కరోనా పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్న ప్రేక్షకులు.. ఆయా సన్నివేశాల్లోని గాఢత, తీవ్రతని బాగా అర్థం చేసుకోగలుగుతారు.
అయితే చాలా సన్నివేశాల్ని దర్శకుడు పైపైనే టచ్ చేసుకుంటూ వెళ్లాడు. దాంతో డెప్త్ మిస్సయ్యింది. అన్ని విషయల్నీ సృశించాం.. అన్నట్టుగా ఉంటాయి తప్ప, ప్రేక్షకుడ్ని కదిలించకపోయాయి. బుర్రా సాయిమాధవ్ డైలాగులు చాలా సన్నివేశాల్ని నిలబెట్టాయి. అవి లేకుండా చూస్తే - ఆయా సన్నివేశాలన్నీ తేలిపోయి ఉండేవేమో..? పతాక సన్నివేశాలు భారీ స్పీచ్‌తో ముగించారు. నిజానికి ఈ ముగింపు కాస్త అసంపూర్ణంగా అనిపిస్తాయి. కొన్నిసార్లు మహర్షిలోని సన్నివేశాలు, అందులోని సంఘర్షణ గుర్తొస్తే అది ప్రేక్షకుడి తప్పు కాదనిపిస్తుంది. కాకపోతే.. రైతు గురించి ఓ కథ చెప్పాలనుకోవడం, వ్యవసాయం పట్ల యువతరానికి ప్రేమ, ఇష్టం కలిగించే ప్రయత్నం చేయడం హర్షణీయం.
* నటీనటులు
శర్వానంద్ మరో సారి తన సహజ సిద్ధమైన నటన ప్రదర్శించాడు. ఇలాంటి పాత్రలు తనకు కేక్ వాక్ అని నిరూపించుకున్నాడు. ఎమోషనల్ సీన్లలో.. అలవాటు ప్రకారం రెచ్చిపోయాడు. తనకు రాసిన డైలాగులు బాగున్నాయి. ప్రియాంక.. పక్కింటి అమ్మాయిలా కనిపిస్తూ ఆకట్టుకుంది. ఏకాంబరంగా సాయికుమార్ నటన గుర్తుండిపోతుంది. తనే ఈ సినిమాలో విలన్. రావు రమేష్ కి ఈ తరహ ఆపాత్రలు కొట్టిన పిండే. తండ్రీ కొడుకుల ఎమోషన్ సీన్లు బాగా పండడానికి రావు రమేష్ ప్రధాన కారణం. కామెడీ పండించే బాధ్యత సత్య తన భుజాలపై వేసుకున్నాడు
* సాంకేతిక వర్గం
టెక్నీషియన్లలో ఎక్కువ మార్కులు బుర్రా సాయిమాధవ్ కే పడతాయి. తన కలం బలం మరోసారి నిరూపితమైంది. చాలా సన్నివేశాల్ని తన పెన్ పవర్‌తో గెలిపించాడు. యువరాజ్ కెమెరా పనితనం మరో ప్రధాన ఆకర్షణ. పాటలు బాగున్నాయి. వస్తానంటివో.. పాట మాస్‌కి బాగా నచ్చుతుంది. దర్శకుడిలో విషయం ఉంది. తొలి ప్రయత్నంలోనే భావోద్వేగ భరిత కథ ఎంచుకున్నాడు. కొన్ని లోపాలున్నా.. సర్దుకుపోవచ్చు.
* ప్లస్ పాయింట్స్
కథాంశం
శర్వా నటన
ఎమోషన్ సీన్లు
సంభాషణలు
* మైనస్ పాయింట్స్
డ్రమెటిక్ సీన్లు
* ఫైనల్ వర్డిక్ట్: మంచి ప్రయత్నానికి శ్రీకారం