శ్రీ‌నివాస కళ్యాణం రివ్యూ & రేటింగ్స్

By iQlikMovies - August 09, 2018 - 13:59 PM IST

మరిన్ని వార్తలు

తారాగణం: నితిన్, రాశి ఖన్నా, జయసుధ, రాజేంద్రప్రసాద్, ప్రకాష్ రాజ్, నరేష్, ఆమని, సితార, శ్వేత నందిత తదితరులు
నిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర ప్రొడక్షన్స్
సంగీతం: మిక్కీ జే మేయర్
ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి
ఎడిటర్: మధు
నిర్మాత: దిల్ రాజు
రచన-దర్శకత్వం: సతీష్ వేగేశ్న

రేటింగ్: 2.25/5

బంధాలు, అనుబంధాలు, సంప్ర‌దాయాలు, ఆచారాలు ఇవ‌న్నీ చాలా గొప్ప‌వి. వాటిని ఎన్నిసార్ల‌యినా చెప్పుకోవొచ్చు. వాటిని ఆచ‌రిస్తూ... ఎన్నో విష‌యాల్ని నేర్చుకోవొచ్చు. ఇవ‌న్నీ చెప్ప‌డానికి, చూపించ‌డానికి బాగుంటాయి కూడా!  అందుకే తెలుగు తెర‌కు అదో అమూల్య‌మైన క‌థా వ‌స్తువు అయ్యింది. శ‌త‌మానం భ‌వ‌తి లో చెప్పింది అదే క‌దా?  

`పండ‌గ‌లు గొప్ప‌వి... పండ‌గంటే సెల‌వు రోజు కాదు.. అది మ‌న సంప్ర‌దాయం` అని చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. అది జ‌నాల‌కు న‌చ్చింది. ఇప్పుడు `శ్రీ‌నివాస కళ్యాణం` తీశారు. ఇందులో `పెళ్ళిళ్లంటే గొప్ప‌వి.. పెళ్లంటే ఓ పండ‌గ‌... ` అంటూ వివాహ సంప్ర‌దాయాల విశిష్ట‌త‌ని చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. మ‌రి ఇది న‌చ్చేలా ఉందా??  `శ‌త‌మానం భ‌వ‌తి`లా... ఈ సినిమానీ ప్రేక్ష‌కులు ఆశీర్వ‌దిస్తారా?

* క‌థ‌

శ్రీ‌నివాస్ (నితిన్‌) సంప్ర‌దాయ కుటుంబం నుంచి వ‌చ్చిన వాడు. త‌న‌కు సంప్ర‌దాయాల‌న్నా, క‌ట్టుబాట్ల‌న్నా, పెద్ద‌ల‌న్నా చాలా ఇష్టం. కుటుంబాన్ని అమితంగా ప్రేమిస్తాడు. శ్రీ‌దేవి (రాశీఖ‌న్నా) అనే అమ్మాయి మ‌న‌సులో చోటు సంపాదిస్తాడు. శ్రీ‌దేవి ఓ మ‌ల్టీమిలీనియ‌ర్ జీకే (ప్ర‌కాష్‌రాజ్‌) కూతురు. త‌నో బిజినెస్ మాగ్నెట్‌. ప్ర‌తీ నిమిషాన్ని డ‌బ్బుతోనే కొలుస్తాడు. బంధాలు, ఆచారాలంటే అస్స‌లు ప‌ట్టింపు లేదు. కేవ‌లం కూతురి కోసం ఈ పెళ్లికి ఒప్పుకుంటాడు. 

కానీ... శ్రీ‌నివాస్ కి ఓ ష‌ర‌తు విధిస్తాడు. అదేంటి?  ఆ ష‌ర‌తు విని శ్రీ‌నివాస్ ఏం చేశాడు?  పెళ్లంటే, ఆచారాలంటే ఏమాత్రం స‌దాభిప్రాయం లేని జీకే మ‌న‌సుని ఎలా  మార్చాడు?  అనేదే క‌థ‌.

* న‌టీన‌టులు

నితిన్‌కి ఇలాంటి పాత్ర చాలా కొత్త‌. ఉన్నంత‌లో ఓకే అనిపిస్తాడు కూడా. కానీ నితిన్ నుంచి ఆశించే ఎన‌ర్జీ మిస్ అయిపోయింది. ప్ర‌తీచోటా నితిన్ మొహంలో రాముడు మంచి బాలుడు టైపు ఎక్స్‌ప్రెష‌న్ చూసీ చూసీ... నితిన్‌లో ఇంకేం ప‌ల‌క‌వేమో అన్న‌ట్టు ఫిక్స‌యిపోతాం.

 

రాశీఖన్నా దాదాపుగా ఫ్రీజింగ్ మూమెంట్‌తోనే క‌నిపించింది. `ఈ సినిమాలో నా పాత్ర అదిరిపోతుంది` అని చెప్పింది గానీ.. అంత లేదీ సినిమాలో. 

ప్ర‌కాష్ రాజ్ ద‌ర్పం బాగానే చూపించాడు. కానీ అత‌నిలో మార్పు వ‌చ్చేస‌రికి మామూలు సినిమాల్లో ప్ర‌కాష్‌రాజ్‌లా చాలా రొటీన్‌గా క‌నిపించాడు. 

శ‌త‌మానం భ‌వ‌తి, సీత‌మ్మ వాకిట్లో సినిమాల్లో చూసిన జ‌య‌సుధ‌కూ, ఈ జ‌య‌సుధ‌కూ ఎలాంటి మార్పులూ లేవు. న‌రేష్ పాత్ర ప‌రిధి చాలా త‌క్కువ‌. రాజేంద్ర ప్ర‌సాద్‌నీ స‌రిగా ఉప‌యోగించుకోలేదు.

* విశ్లేష‌ణ‌

సంప్ర‌దాయాల‌కు విలువ ఇచ్చే అల్లుడు - అస‌లు ఇవంటే ప‌ట్ట‌ని మావ‌య్య‌.. వీళ్ల మ‌ధ్య ఏం జ‌రిగింద‌న్న‌ది నిజంగానే ఆస‌క్తిక‌రం. అందులోనే వినోదం ఉంది. సెంటిమెంట్ ఉంది. ఎమోష‌న్ ఉంది. ఫ్యామిలీ అటాచ్‌మెంట్ ఉంది. అన్నీ ఉన్నాయి. `పెళ్లి విశిష్ట‌త‌` అనే పాయింట్‌పై ద‌ర్శ‌కుడు ఓ క‌థ  అల్లుకోవ‌డం, దాన్ని న‌మ్మి నిర్మాత పెట్టుబ‌డి పెట్ట‌డం రెండూ బాగున్నాయి. ఈత‌రానికి పెళ్లి గురించి, దాని గొప్ప‌ద‌నం గురించీ, ఆ పెళ్లిలో జ‌రిగే తంతు గురించి తెలుసుకోవ‌డం చాలా అవ‌స‌రం కూడా. అయితే... ఈ విష‌యాన్ని ఏదో ఇంజెక్ట్ చేస్తున్న‌ట్టు కాకుండా, ప‌ని గ‌ట్టుకుని క్లాస్‌ పీకుతున్న‌ట్టు కాకుండా.. సుతి మెత్త‌గా, క‌థ‌లో అంత‌ర్లీనంగా చెప్పాలి.  

ఇక్క‌డ మాత్రం `క్లాసు`ల వ్య‌వ‌హార‌మే న‌డిచింది. నితిన్ డైలాగులు ఎక్కువ‌గా `క్లాస్‌` ట‌చ్‌తోనే సాగాయి. వాటిని వినే ఓపిక ఈత‌రం ప్రేక్ష‌కుల‌కు ఉందా?  అనేది అనుమాన‌మే. తొలి భాగం ల‌వ్ స్టోరీతో న‌డ‌పాల్సింది. కానీ ఆ సంగ‌తి మ‌ర్చిపోయిన ద‌ర్శ‌కుడు ఏవేవో చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు. హీరో హీరోయిన్ల మ‌ధ్య కెమిస్ట్రీ ఏమాత్రం వ‌ర్క‌వుట్ అవ్వ‌లేదు.

ప్ర‌కాష్‌రాజ్ - నితిన్ ఎగ్రిమెంట్ సీన్ కూడా అంతే. ఎంత‌టి అప‌ర కోటీశ్వ‌రుడైనా త‌న కూతురి పెళ్లి అనేస‌రికి ఓ తండ్రిలానే ఆలోచిస్తాడు. అన్నీ ద‌గ్గ‌రుండి చూసుకోవాల‌నుకుంటాడు. ఒక్క‌డు కూడా ప్ర‌కాష్‌రాజ్‌లా ముమ్మాటికీ ఆలోచించ‌డు. ఆలోచించినా... పెళ్లికి ముందే ఓ ఎగ్రిమెంట్ రాయించ‌డు. పోనీ... ఆ ఎగ్రిమెంటే బ‌ల‌మైన పాయింట్ అనుకుంటే - ఆ పాయింట్‌ని మ‌ళ్లీ క్లైమాక్స్ వ‌ర‌కూ ఎత్త‌రు. ద్వితీయార్థం మొద‌లైన కాసేప‌టికే ప్ర‌కాష్‌రాజ్‌లో మార్పు వ‌చ్చేస్తుంది. ఆ మాత్రం దానికి క్లైమాక్స్‌లో నితిన్ కన్నీళ్లు పెట్టుకుంటూ పేజీల‌కు పేజీలు డైలాగులు చెప్ప‌క్క‌ర్లెద్దు. 

కేవ‌లం క్లైమాక్స్‌ని ఎమోష‌న‌ల్‌గా మార్చ‌డానికి త‌ప్ప‌.. ఆ క్లైమాక్స్ ఎందుకూ అక్క‌ర‌కు రాలేదు. ఆఖ‌రికి ప్ర‌కాష్‌రాజ్‌లో మార్పు కూడా కృత‌కంగానే క‌నిపిస్తుంది.  ఈ క‌థ‌లో బ‌ల‌మైన పాయింట్ ఉంది. కానీ దాన్ని ప్ర‌భావ‌వంతంగా చెప్పే ప్ర‌య‌త్నం జ‌ర‌గ‌లేదు. ప‌దునైన సంభాష‌ణ‌లు ఉన్నాయి. కానీ.. బ‌ల‌హీన‌మైన స‌న్నివేశాల ముందు అవి కూడా తేలిపోయాయి. మొత్తంగా.. ఓ మంచి పాయింట్‌, స‌రైన స‌న్నివేశాలు రాసుకోక‌పోవ‌డం వ‌ల్ల‌.. నీరుగారిపోయింది. ఓ క్లాస్ లా మారిపోయింది.

* సాంకేతిక వ‌ర్గం

దిల్‌రాజు సినిమా అంటే నిర్మాణ విలువ‌లు బాగుంటాయి. అయితే ఈ సినిమాని త‌క్కువ బ‌డ్జెట్‌లో తీయాల‌ని ఫిక్స‌యి ఉంటారు. మేకింగ్ ప‌రంగా అంత జాగ్ర‌త్త ప‌డ‌లేదేమో అనిపించింది. స‌తీష్ డైలాగులు బాగున్నాయి.కానీ స‌న్నివేశాల్లో బ‌లం లేక‌పోవ‌డం వ‌ల్ల నిల‌బ‌డ‌లేదు. మిక్కీ పాట‌ల‌న్నీ ఓకే రీతిన సాగుతున్నాయి. ఈ ఆల్బ‌మ్ కూడా ఇందుకు మిన‌హాయింపు కాదు. పాయింట్ ఎంత మంచిదైనా స‌రే, దాన్ని ఎంత బాగా, ఎంత అర్థ‌మ‌య్యేలా, ఎంత హ‌త్తుకునేలా చెప్పామ‌న్న‌దే కీలకం. ఈ విష‌యంలో ఈ సినిమా విఫ‌ల‌మైంది.

* ప్ల‌స్ పాయింట్స్‌

+ క‌థా నేప‌థ్యం
+ న‌టీన‌టుల బ‌లం

* మైన‌స్‌పాయింట్స్‌

- తీత‌
- ల‌వ్ ట్రాక్‌
- క్లైమాక్స్‌

* ఫైన‌ల్ వ‌ర్డిక్ట్‌: చ‌ప్ప‌గా సాగిన పెళ్లి.

రివ్యూ రాసింది శ్రీ
 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS