చిత్రం: కంగువా
దర్శకత్వం: జే. శివ కుమార్
కథ - రచన: జే. శివ కుమార్
నటీనటులు: సూర్య, దిశాపటాని, బాబిడియోల్, కార్తీ(గెస్ట్ రోల్ లో), KS రవి కుమార్, నటరాజన్ సుబ్రహ్మణ్యం, యోగిబాబు, మన్సూర్ ఆలీ ఖాన్, కోవై సరళ. హరీష్ ఉత్తమన్, తదితరులు.
నిర్మాతలు: జ్ఞానవేల్ రాజా, వి. వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి.
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: వెట్రి పళని స్వామి
ఎడిటర్: నిషాద్ యూసఫ్
బ్యానర్: స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్
విడుదల తేదీ: 14 నవంబర్ 2024
ఐక్లిక్ మూవీస్ రేటింగ్: 2.25/5
ఇంగ్లీష్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రాణం పెట్టి చేసిన మూవీ 'కంగువా'. మూడేళ్ళుగా ఈ సినిమా కోసం సూర్య కష్టపడుతున్నాడు. సూర్య కెరీర్‌లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ ఇదే కావటం విశేషం. ఈ మూవీలో సూర్య ద్విపాత్రాభినయం చేసారు. సూర్య డ్యూయల్ రోల్ లో కనిపించటం ఇది మొదటిసారి కాదు. సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, బ్రదర్స్, 24 లో కూడా ద్విపాత్రాభినయం చేసారు. ఇపుడు కంగువాలో మళ్ళీ ఇది రిపీట్ చేస్తున్నారు. సూర్య డ్యూయల్ రోల్ మూవీస్ దాదాపు హిట్. ఈ లెక్కన కంగువ కూడా బ్లాక్ బస్టర్ అవటం ఖాయమని ఫాన్స్ అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం పీరియాడికల్ యాక్షన్ డ్రామాలు ట్రెండ్ లో ఉన్నాయి. అందుకు అనుగుణంగానే నేటి దర్శకులు, హీరోలు పిరియాడికల్ జోనర్లు పై ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. శివ కుమార్ తెరకెక్కించిన ఈ మూవీపై మొదటి నుంచి భారీ అంచనాలున్నాయి. 350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్100 కోట్లకు ఓటీటీ రైట్స్ కొనటంతో మరిన్ని అంచనాలు పెరిగాయి. మరి సూర్య కంగువా మూవీ ఎలా ఉందో? డ్యూయల్ రోల్ లో సూర్య ఎలా ఆకట్టుకున్నారు? కంగువా మూవీ ఆడియన్స్ కి రీచ్ అయ్యిందో లేదో చూద్దాం.
కథ:
సినిమా ప్రారంభంలో ఒక రష్యన్ గ్యాంగ్ రన్ చేస్తున్న టెస్టింగ్ లాబ్ నుంచి జీటా అనే అబ్బాయి తప్పించుకుంటాడు. అది జరిగిన సంవత్సరం 2024 . ఆక్కడ నుంచి కథ మొదలవుతుంది. ఫ్రాన్సిస్ (సూర్య) బౌంటీలు తీసుకుంటూ క్రిమినల్స్‌ను పట్టిస్తూ గోవాలో జాలీగా లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంటాడు. ఎక్కడో తప్పించుకున్న జీటా గోవాలో ఉన్న ఫ్రాన్సిస్ ను వెతుక్కుంటూ వస్తాడు. మొత్తానికి ఫ్రాన్సిస్ ని ట్రేస్ చేసి తనతో పాటు రష్యా గ్యాంగ్ దగ్గరికి తీసుకు వెళ్లిపోతాడు. కథ మళ్ళీ 1070 టైం జోన్ లోకి వెళ్తుంది. సముద్రం మధ్యలో ఉన్న పంచ ద్వీప సమూహంలో ప్రణవాది కోన ఉంటుంది. అక్కడ ఉండే నాయకుడు కొడుకు కంగువా(సూర్య). ఫార్నర్స్ ఇండియాపై దాడి చేసేందుకు, బేస్ క్యాంప్ సెట్ చేసుకోవడం కోసం ప్రణవాది కోన అవసరం అవుతుంది. సాగర కోన నాయకుడు, ప్రణవాది కోనను ఆ ఫార్నర్స్ కి ఇవ్వడానికి సిద్దమై కంగువా చేతిలో మరణిస్తాడు. ఇతని తరవాత కపాల కోన నాయకుడు( బాబీ డియోల్) కూడా ప్రణవాది కోనను విదేశీయుల చేతిలో పెట్టడానికి సిద్దమై కంగువాతో యుద్ధానికి దిగుతాడు. చివరికి ఆ యుద్ధంలో ఎవరు గెలిచారు? శత్రు తెగ నాయకుడి కొడుకు అయిన పులోమాను కంగువా ఎందుకు కాపాడతాడు? అసలు ఫ్రాన్సిస్ కు కంగువాకి ఉన్న సంబంధం ఏంటి? ఫ్రాన్సిస్ కి జీటాకి ఉన్న రిలేషన్ ? జీటా ఎందుకు ఫ్రాన్సిస్ ని వెతుక్కుంటూ గోవాకి వెళ్ళాడు? జీటా మీద ఎవరు ప్రయోగాలు చేస్తున్నారు. చివర్లో ఎంట్రీ ఇచ్చిన రుద్రాంగ నేత్రుడు (కార్తీ) ఏం శపథం చేసాడు? అతనికి ఈ కథతో ఉన్న సంబంధం ఏంటి? ఫైనల్ గా ఎం జరిగింది? అని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
ఓ పిల్లాడి బాధ్యతను తీసుకుని నెరవేర్చే హీరో కథే కంగువా. ఈ ఒక్క పాయింట్ కోసం పెద్ద సెటప్ క్రియేట్ చేశాడు దర్శకుడు. ప్రస్తుత కథతో వేయేళ్లు నాటి కథను లింక్ చేసి, అప్పటి కాలాన్ని పరిచయం చేసాడు. ఈ కథ చూస్తే ప్రజంట్ పీరియాడిక్ జోనర్ కి ఉన్న క్రేజ్ తోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అనిపిస్తుంది. పంచ కోన అనే కొత్త కాన్సెప్ట్‌ని క్రియేట్ చేసాడు.కల్కి లో మూడు రాజ్యాలు పెట్టినట్లు, హిమ కోన, సాగర కోన, అరణ్య కోన, కపాల కోన, ప్రణవాది కోన అనే ఐదు కోనల్ని సృష్టించాడు. ఒక్కో కోనకి ఒక్కో లీడర్ ఉంటాడు. పంచ కోనలు , ఆ కొనల నాయకుల్ని గుర్తు పెట్టుకోవటం కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది. వారు వేసుకున్న ఆ గెటప్స్ వలన ఎవరెవరో పోల్చుకోలేకుండా ఉన్నారు. ప్రతి కథకి ఎమోషన్ ముఖ్యం అని ఈ కథకి పిల్లాడి సెంటి మెంట్ వాడుకున్నాడు. ఆ ఎమోషన్ కనెక్ట్ అయితే గందరగోళం ఉండదు. ఎమోషన్ కనెక్ట్ కానప్పుడు ఎంత కథ చెప్పినా, జనాలకి ఎక్కదు. కంగువా పరిస్థితి అంతే కంగువా గ్రాండియర్, మేకోవర్ అద్భుతంగా ఉన్నా, టీం పడిన కష్టం తెలుస్తున్నా కథలోకి వెళ్ళటానికి ఎంచుకున్న ట్రాక్ బోరింగ్‌గా ఉంది. సెకండాఫ్‌లో వచ్చిన చీకటి కోన ఎపిసోడ్ పరవా లేదనిపిస్తుంది. కానీ అక్కడ కూడా అవసరం లేని పాట, కొన్ని సీన్స్ చికాకు తెప్పిస్తాయి.
పేపర్ వర్క్ అద్భుతంగా చేసిన దర్శకుడు కథని తెరకెక్కించటంలో ఫెయిల్ అయ్యాడు. సినిమా కథ కొత్తది కాదు, మేకింగ్ లో కూడా కొత్తదనం లేదు. ఊహకి అందని ట్విస్ట్ లు ఏమి లేవు. అరవ వాసనలు ఎక్కువ ఉన్నాయి. సినిమాలో పాత్రలు అరుస్తూ ఉండడం కాస్త ఇబందిగా ఉంటుంది. వారి రూపాలు, విచిత్ర వేషధారణ ఏ మాత్రం ఆసక్తికలిగించలేదు సరికదా రోత పుట్టించాయి. కంగువా దైర్యం, సాహసాలుకి ఎక్జామ్ఫుల్ గా మొసలితో ఫైట్ పెట్టారు. అది ఓకే. క్లైమాక్స్ ఫైట్, రుద్రాంగ నేత్రుడి ఎంట్రీ, సీక్వెల్ కోసం ఇచ్చిన హింట్ సూపర్.
నటీ నటులు:
ఫ్రాన్సిస్ పాత్రలో సూర్య రొటీన్ కి భిన్నంగా కనిపించి అలరించారు. కంగువా క్యారక్టర్ లో సూర్య జీవించారు. సూర్యా చాలా సీన్స్ లో కళ్లతోనే ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. చాలా చోట్ల క్లోజప్ షాట్స్ లో సూర్య అదరగొట్టేసాడు. సూర్య కంగువా కోసం చాలా కష్టపడ్డాడు. యాక్షన్ సీక్వెన్స్ అదరగొట్టాడు సూర్య. కంగువా సూర్య వన్ మెన్ షో. బాబీ డియోల్ సీన్లు భయంకరంగా ఉంటాయి. కేవలం క్యాస్టూమ్‌తోనే అందర్నీ భయపెట్టాడు బాబీ డియోల్. ఏంజెలాగా దిశా పటానీ పాత్రకి పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. కథ మొత్తం పిల్లాడి చుట్టూ తిరగటం వలన హీరోయిన్ పాత్రకి స్కోప్ లేదు. పులోమాగా, జీటా గా రెండు పాత్రలు చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ తన నటనతో ఆకట్టుకున్నాడు. యోగి బాబు, కోవై సరళ, కామెడీ ట్రాక్ చికాకు తెప్పిస్తుంది. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
టెక్నికల్:
దర్శకుడు శివ చాలా కష్టపడ్డాడు తన డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం, ఆ కష్టం అక్కడక్కడా స్క్రీన్ పై కనిపిస్తోంది. కానీ తెరకెక్కించటంలో కూడా అంతే శ్రద్ద పెట్టి ఉంటే బాగుండేది. సినిమా ఫస్టాఫ్ చాలా బోరింగ్ గా ఉంది. సూర్య తప్ప స్క్రీన్ మీద ఎవరు కనిపించినా విసుగు అసహనం పెరుగుతాయి. అసలు కొన్ని క్యారెక్టర్లు సినిమాకు వేస్ట్ అని చెప్పొచ్చు. యోగిబాబు, రెడిన్, దిశా పటానీ, కేఎస్ రవికుమార్ వీరి వలన సినిమాకి ఉపయోగం లేదు సరి కదా నష్టం జరిగింది. యోగిబాబు, రెడిన్ కింగ్‌స్లే సీరియస్ సిట్యువేషన్ లో కూడా కామెడీ చేస్తుంటే సహనం చచ్చిపోతుంది. దర్శకుడు ఎదో కొత్త ప్రయత్నం చేస్తాడనుకుంటే రొటీన్ కమర్షియల్ సినిమా అని ఫిక్స్ అయిపోతారు ఆడియన్స్. ఇదంతా దర్శకుడి ఫెయిల్యూర్. వెట్రి పళని స్వామి సినిమాటోగ్రఫీ చాలా ప్లస్ అయ్యింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఆకట్టుకుంది. పాటలు కంటే బ్యాక్ గ్రౌండ్ బాగుంది. పాటలు బయట అంతగా జనాల్లోకి వెళ్లకపోయినా సినిమాలో వినటానికి బాగున్నాయి . మాంటేజ్ సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో దేవిశ్రీ సినిమాకి కొంత ప్లస్ అయ్యారు. నాయకా, మన్నింపు, కంగ కంగ సాంగ్స్ స్క్రీన్‌పై చాలా బాగున్నాయి. యాక్షన్ సీక్వెన్స్ ఎడిటింగ్ బాగుంది. నిషాద్ యూసుఫ్ ఎడిటింగ్ లో ఇంకొంచెం శ్రద్ద తీసుకుంటే బాగుణ్ణు. వీఎఫ్ ఎక్స్ పేలవంగా ఉన్నాయి. స్టూడియో గ్రీన్ , UV క్రియేషన్స్ నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
సూర్య
సినిమాటోగ్రఫీ
సంగీతం
మైనస్ పాయింట్స్
కథ, కథనం
కొన్ని పాత్రలు
స్లో నేరేషన్
బోరింగ్ సీన్స్
ఫైనల్ వర్దిక్ట్ : కుంగ దీసిన 'కంగువా'