తారాగణం: విజయ్ దేవరకొండ, ప్రియాంక, మాళవిక, రవిప్రకాష్, ఉత్తేజ్, చమ్మక్ చంద్ర & తదితరలు
నిర్మాణ సంస్థ: GA2 పిక్చర్స్ & UV క్రియేషన్స్
ఛాయాగ్రహణం: సుజిత్ సారంగ్
సంగీతం: జేక్స్ బిజోయ్
ఎడిటర్: శ్రీజిత్ సారంగ్
మాటలు & కథనం: సాయి కుమార్ రెడ్డి
నిర్మాత: SKN
రచన-దర్శకత్వం: రాహుల్ సంక్రిత్యన్
రేటింగ్:3.25/5
హారర్, కామెడీ జోనర్‌పై జనాలకు విసుగొచ్చింది. ఈమధ్య ఈ జోనరో వచ్చిన సినిమాలన్నీ బొక్క బోర్లా పడుతుండడంతో.. వాటి హవా తగ్గింది. అయితే పూర్తిగా మాత్రం మరుగున పడిపోలేదు. ఎక్కడో చోట ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ జోనర్‌కి ఏదో ఓ కొత్త అంశం జోడిస్తే గానీ పని జరగడం లేదు. ఈ విషయాన్ని 'టాక్సీవాలా' బృందం బాగా అర్థం చేసుకుంది. వీళ్లు రాసుకున్నదీ హారర్ కామెడీనే. కానీ దాన్ని సైన్స్ ఫిక్షన్ పాయింట్ జోడించారు. ఈ మేళవింపు ఎలా సాగింది? బాక్సాఫీసు రూటులో 'టాక్సీవాలా' లైన్ క్లియర్ అయ్యిందా, లేదా? నోటా ఫ్లాపుతో కాస్త బ్రేకులు పడిన విజయ్ దేవరకొండ కెరీర్‌కి టాక్సీవాలా బూస్టప్ ఇస్తుందా, లేదా?
* కథ
శివ (విజయ్ దేవరకొండ) చదువుకున్న నిరుద్యోగి. ఉద్యోగాల కోసం ఎంత ప్రయత్నించినా ఫలితం ఉండదు. దాంతో.. ఓ కారుకొనుక్కుని డ్రైవర్‌గా సెటిల్ అవుదామని నిర్ణయానికి వస్తాడు. అందులో భాగంగా ఓ సెకండ్ హ్యాండ్ కారు కొంటాడు శివ. ఆ కారు రాకతో తన జీవితం మలుపు తిరుగుతుంది. ఆ కార్లో ఓ ఆత్మ ఉన్న సంగతి శివకు అర్థం అవుతుంది. ఆ ఆత్మే ఓ డాక్టర్‌ని బలి తీసుకుంటుంది. కారుతో వేగడం తన వల్ల కాదని తెలుసుకున్న శివ.. ఆ కారు ఎవరి దగ్గర కొన్నాడో.. వాళ్లకే తిరిగి ఇచ్చేయడానికి వెళ్తాడు. అక్కడ ఆ కారు గురించీ, అందులో ఉన్న ఆత్మ గురించి ఓ నిజం తెలుస్తుంది. అదేంటి? ఆ ఆత్మ వెనుక ఉన్న కథేంటి? అనేది తెలుసుకోవాలంటే.. 'టాక్సీవాలా' చూడాల్సిందే.
* నటీనటులు
కొత్తగా వచ్చిన స్టార్ డమ్, ఇమేజ్ ఏమీ పట్టించుకోకుండా పాత్రని పాత్రలా స్వీకరించి, అందులో ఒదిగిపోయే ప్రయత్నం చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. మరోసారి అలాంటి పాత్రలోనే కనిపించాడు. తన టైమింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ ఈ సినిమాకి ఆయువు పట్టు.
ప్రియాంక జవాల్కర్ కి ఏమాత్రం ప్రాధాన్యం లేని పాత్ర దక్కింది. కానీ తెరపై అందంగా కనిపించింది. మాళవిక నాయర్ పాత్ర షాకింగ్‌గా ఉంటుంది. మధునందన్ బాగా నవ్వించాడు. కొత్తగా పరిచయమైన యువ నటుడు విష్ణు అల్లరి కూడా ఆకట్టుకుంటుంది.
* విశ్లేషణ
మిగిలిన హారర్ సినిమాల్లానే ఇది కూడా ఓ ఆత్మ చుట్టూ తిరుగుతుంది. కాకపోతే ఆ ఆత్మ ఇంట్లోనో, బంగళాలోనో కాకుండా ఓ కారులో ఉంటుందంతే. ఈ కథలో ఈమధ్య వచ్చిన నయనతార 'డోర' లక్షణాలు బాగా కనిపిస్తాయి. కాకపోతే... అదే పాయింట్‌కి అస్గ్రల్ ప్రొజెక్షన్ అనే కొత్త సైన్స్ ఫిక్షన్ పాయింట్ జోడించాడు. దాంతో ఆటోమెటిగ్గా.. పాత కథైనా కాస్త కొత్తగా సాగేందుకు అవకాశం దక్కింది.
హారర్ కామెడీ చిత్రాల్లో అటు భయం, ఇటు వినోదం మేళవింపు బాగా జరగాలి. లేదంటే.. ప్రేక్షకులు నిరుత్సాహానికి గురవుతారు. ఈ జోనర్‌కి సరైన న్యాయం జరగదు. `టాక్సీవాలా`లో ఆ కొలతలు సరిగ్గా కుదిరాయి. తొలి సగం హాస్యానికి పెద్దపీట వేశాడు దర్శకుడు. కార్లో జరిగే సంగతులు, వాటిని చూసి శివ అండ్ గ్యాంగ్ భయపడడం.. చాలా ఫన్నీగా సాగుతాయి. ప్రధమార్థంలో అక్కడక్కడ కాస్త లాగ్ అయినట్టు అనిపిస్తున్నా... వినోదానికి ఢోకా లేకుందడా చూసుకోవడంతో పాసైపోతుంది.
ద్వితీయార్థంలో పూర్తిగా హారర్ ఎలిమెంట్ ప్రవేశిస్తుంది. అలాగని ఆయా సన్నివేశాల్ని కేవలం భయ పెట్టడానికే పరిమితం చేయకుండా వాటి నుంచి కూడా వీలైనంత కామెడీ పండించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. పైగా.. అస్ట్రల్ ప్రొజెక్షన్ అనే పాయింట్ కూడా అర్థమయ్యేలా, పూస గుచ్చినట్టు చెప్పగలిగాడు. మార్చ్యురీ గది నేపథ్యంలో వచ్చే సీన్లు... బాగా నవ్వించాయి. హారర్ పాయింట్ కొత్తగా ఉండడం, కామెడీని ఎక్కువ స్కోప్ ఇవ్వడంతో టాక్సీవాలా గట్టెక్కేస్తుంది. ద్వితీయార్థంలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి.
ఫ్లాష్ బ్యాక్ అంత గొప్పగా ఏమీ ఉండదు. కథానాయకుడి కుటుంబ నేపథ్యం, వాటి నుంచి పుట్టుకొచ్చిన సన్నివేశాల్లో లాగ్ ఉంది. క్లైమాక్స్ కొత్తగా రాసుకోవాల్సింది. అక్కడ దర్శకుడు బాగా డ్రమెటిక్‌గా ఆలోచించాడు. క్లైమాక్స్‌లోనూ ఏదో ఓ ఆసక్తికరమైన అంశం జోడించి ఉంటే... `టాక్సీవాలా` ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అవుదును. ఇప్పటికి మాత్రం టైమ్ పాస్ వాలాగా మారింది.
* సాంకేతిక వర్గం
టెక్నికల్‌గా సినిమా బాగుంది. జేక్స్ బిజోయ్ సంగీతం, సుజీత్ ఛాయాగ్రహణం కథకి ప్రాణం పోశాయి. మాటే వినదుగా.. బాణీ బాగుంది. రాహుల్ సంక్రిత్యాన్ పాత కథకు కొత్త కాన్సెప్ట్ అతికించాడు. ఆ అల్లిక బాగా కుదిరింది. కొత్త దర్శకుడే అయినా ఎక్కడా కన్‌ఫ్యూజ్ కాకుండా తెరపై.. సమర్థవంతంగా తీసుకొచ్చాడు.
* ప్లస్ పాయింట్స్
విజయ్ దేవరకొండ
+ కామెడీ
* మైనస్ పాయింట్స్
- క్లైమాక్స్
పైనల్ వర్డిక్ట్: `టాక్సీవాలా`... పైసా వసూల్.
రివ్యూ రాసింది శ్రీ.