'తేజ్ ఐ ల‌వ్ యూ' మూవీ రివ్యూ & రేటింగ్

By iQlikMovies - July 06, 2018 - 12:58 PM IST

మరిన్ని వార్తలు

తారాగణం: సాయి ధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్, జెపి, ప‌విత్రా లోకేష్‌, ఫృథ్వీ తదితరులు
నిర్మాణ సంస్థ: క్రియేటివ్ కమర్షియల్స్
సంగీతం: గోపిసుందర్
ఛాయాగ్రహణం: ఆండ్రూ
ఎడిటర్: SR శేఖర్
నిర్మాత: KS రామారావు
రచన-దర్శకత్వం: కరుణాకరన్

రేటింగ్: 2/5

తొలిప్రేమ సినిమా ఒక్క‌టి చాలు.. క‌రుణాక‌రన్ అంటే ఏమిటో చెప్ప‌డానికి. హ్యాపీ కూడా బాగానే ఉంటుంది. యువ‌కుడు ఓకే అనిపించింది. అయితే ఆ త‌ర‌వాత పూర్తిగా ట్రాక్ త‌ప్పేశాడు. ఉల్లాసంగా ఉత్సాహంగా, డార్లింగ్‌తో ఫామ్‌లోకి వ‌చ్చిన‌ట్టు క‌నిపించినా - ఆ త‌ర‌వాత వ‌రుస‌గా ఫ్లాపులు అందాయి. 

ఇప్పుడు`తేజ్‌`తో మ‌రోసారి త‌న ల‌క్ ప‌రిక్షీంచుకోబోయాడు. `తొలిప్రేమ త‌ర‌హా సినిమా ఇది` అని ఈ సినిమా కోసం గ‌ట్టిగా ప్ర‌చారం చేశారు. నిజంగా.. తొలిప్రేమ ఏమో.. అని జ‌నాలు ఆశ‌లు పెంచుకున్నారు. మ‌రి ఈ సినిమా తొలిప్రేమ‌లా అల‌రించిందా?  ఒక‌ప్ప‌టి క‌రుణాక‌ర‌న్‌ని గుర్తు చేసిందా? 

* క‌థ‌

తేజ్ (సాయిధ‌ర‌మ్ తేజ్‌) చిన్న‌ప్పుడే అమ్మా నాన్న‌ల‌ను కోల్పోతాడు. అయితే పెద‌నాన్న - పెద్ద‌మ్మ తేజ్‌ని సొంత కొడుకులా చూసుకుంటారు. బాబాయ్‌, పిన్ని, వాళ్ల కూతుర్ల‌తో ఎప్పుడూ ఆ ఇల్లు సంద‌డి సందడిగా ఉంటుంది. అయితే చిన్న‌ప్పుడే ఒకరిని కాపాడ‌బోయి.. అరెస్ట్ అవుతాడు. ఏడేళ్ల జైలు శిక్ష అనుభ‌విస్తాడు. ఓ త‌ప్పు చేసి... మ‌ళ్లీ ఇంటికి దూర‌మ‌వుతాడు. నందిని (అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌) లండ‌న్ నుంచి ఇండియా వ‌స్తుంది. ఆ అమ్మాయిని స‌ర‌దాగా ఆట‌ప‌ట్టించి.. అడ్డంగా బుక్క‌వుతాడు తేజ్‌. 

అక్క‌డి నుంచి తేజ్‌, నందినిల ప్రేమ క‌థ మొద‌ల‌వుతుంది. త‌న మ‌న‌సులోని మాట తేజ్‌కి చెప్పేలోగా..  నందినికి యాక్సిడెంట్ అవుతుంది. గ‌తంలో కొంత భాగం మ‌ర్చిపోతుంది.. తేజ్‌తో ప్రేమ సంగ‌తితో స‌హా. మ‌రి.. తేజ్ నందినికి మ‌ళ్లీ ఎలా ద‌గ్గ‌ర‌య్యాడు. అస‌లు నందిని ఇండియాకి ఎందుకొచ్చింది? అనేది మిగిలిన క‌థ‌.

* న‌టీన‌టులు

తేజూ, అనుప‌మ వ‌ర‌కూ బాగా చేశారు. తేజ్ అందంగా క‌నిపించాడు. త‌న డ్ర‌స్సింగ్ బాగుంది. హుషారైన స‌న్నివేశాల్లో ఇంకాస్త హుషారుగా చేశాడు. 

అనుప‌మ ఎప్ప‌ట్లా ఆక‌ట్టుకుంది. అందం, అభిన‌యంతో క‌ట్టిప‌డేసింది. కొన్ని చోట్ల ఓవ‌ర్ ఎక్స్‌ప్రెష‌న్స్ ఇచ్చినా అవి కూడా క్యూట్‌గానే ఉన్నాయి. 

జెపి, ప‌విత్రా లోకేష్‌, ఫృథ్వీ.. ఇలా చెప్పుకోవ‌డానికి చాలామందే ఉన్నారు. వాటిలో చాలా పాత్ర‌లు గ్రూప్ ఫొటోల‌కే ప‌రిమితం. 

* విశ్లేష‌ణ‌

గ‌తం మ‌ర్చిపోవ‌డం, మళ్లీ గుర్తొచ్చి త‌న ప్రేమ‌ని సాధించుకోవ‌డం... ఇదంతా పాత కాన్సెప్టే. ఇలాంటి ట్రిక్కులు.. క‌రుణాక‌ర‌న్ కూడా ఇది వ‌ర‌కు చేశాడు. డార్లింగ్‌లో స‌గం సినిమా `క‌ట్టు క‌థ‌`గా మిగిల్చిన క‌రుణాక‌ర‌న్‌... `ఎందుకంటే ప్రేమంట‌`లో కోమాలో ఉన్న పేషెంట్‌ని ఆత్మ‌గా మార్చాడు. ఇప్పుడేమో... ఓ హీరోయిన్‌కి యాక్సిడెంట్ చేసి, ఆమె గ‌తంలోని ప్రేమ‌ని చెరిపేశాడు.  అదొక్క పాయింట్ మిన‌హా.. క‌థ‌, క‌థ‌నాల‌లో కొత్త‌ద‌నం క‌నిపించ‌లేదు. 

ల‌వ్ స్టోరీల‌ను, హీరో హీరోయిన్ల మ‌ధ్య సున్నిత‌మైన రొమాన్స్‌ని బాగా తెర‌కెక్కించ‌గ‌ల క‌రుణాక‌ర‌న్‌. ఈసారి ఆ బ‌లాన్ని కూడా బ‌లంగా
చూపించ‌లేక‌పోయాడు. తొలి స‌గం అంతా కామెడీ బిట్ల‌తో సాగింది. అయితే వాటిలో కొన్ని మాత్ర‌మే న‌వ్వించాయి. నందిని ఎగ్రిమెంట్ పేరుతో తేజ్‌ని వాడుకోవ‌డం, ఆ త‌ర‌వాత తేజ్ నందినిపై రివెంజ్ తీర్చుకోవ‌డం... సిల్లీగా అనిపిస్తాయి. యాక్సిడెంట్ అయితే గ‌తం మొత్తం మ‌ర్చిపోవాలి గానీ,ఇలా కొంత వ‌ర‌కే మ‌ర్చిపోవడం ఓ మెడిక‌ల్ మెరాక్యిల్‌. ఆ పాయింట్ లాజిక్ కి ఏమాత్రం అంద‌దు. నందినికి గ‌తం గుర్తు చేయ‌డానికి చేసే ప్ర‌య‌త్నాలలో కొత్త‌ద‌నం ఉంటే బాగుండేది. క‌నీసం సెకండాఫ్ అయినా ఈసినిమాని గ‌ట్టెక్కించేది. 

కానీ.. అలా కాకుండా రొటీన్‌ఫ్యామిలీ డ్రామా వైపు న‌డిచాడు. ఒక్క సీన్‌లో కూడా ఎమోష‌న్ పండ‌లేదు. దానికి తోడు కామెడీ ఎక్క‌డా వ‌ర్క‌వుట్ అవ్వ‌లేదు. చూసిన సీన్లే మ‌ళ్లీ రివైండ్ చేసుకుని చూసుకున్న‌ట్టు అనిపించాయి. తొలి ప్రేమ టైపు క్లైమాక్స్ రాసుకున్నా... దాన్ని కూడా స‌రిగా డీల్ చేయ‌లేక‌.. చేతులెత్తేశాడు. అలా.. క‌రుణాక‌రన్ ప్రేమ క‌థ‌.. ఏ వ‌ర్గాన్నీ ఆక‌ట్టుకోలేక నిర్లిప్తంగా మిగిలిపోయింది.

* సాంకేతికంగా

గోపీ సుంద‌ర్ బాణీల్లో ఒక‌ట్రెండు బాగున్నాయి. వాటిని తెర‌కెక్కించిన ప‌ద్ధ‌తి క‌రుణాక‌ర‌న్ స్టైల్‌లోనే అందంగా ఉంది. ఆండ్రూ కెమెరా ప‌నిత‌నం సూప‌ర్బ్‌. సినిమా అంతా క‌ల‌ర్‌ఫుల్‌గా క‌నిపించింది. ద‌ర్శ‌కుడిగా, ర‌చ‌యిత‌గా క‌రుణాక‌ర‌న్ విఫ‌ల‌మ‌య్యాడు. ఒక్క‌టంటే ఒక్క కొత్త సీన్ కూడా రాసుకోకుండా. ల‌వ్ ఫీల్ లేకుండా, ఎమోష‌న్ అనే థ్రెడ్ లేకుండా సాదా సీదాగా ఈ క‌థ‌ని న‌డిపేశాడు.

* ప్ల‌స్ పాయింట్స్‌

+ తేజ్ - అనుప‌మ‌
+ కొన్ని పాట‌లు

* మైన‌స్ పాయింట్స్‌

- క‌థ‌, క‌థ‌నం
- ఫీల్ వ‌ర్క‌వుట్ కాక‌పోవ‌డం

* ఫైన‌ల్ వ‌ర్డిక్ట్‌: తేజ్‌.. ఓ 'ఆవ‌కాయ్ పులిహోర‌'. 

రివ్యూ రాసింది శ్రీ

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS