నటీనటులు: రామ్ పోతినేని, కృతి శెట్టి, ఆది పినిశెట్టి, అక్షర గౌడ, నదియా
దర్శకత్వం : ఎన్.లింగుసామి
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: సుజిత్ వాసుదేవ్
ఎడిటర్: నవీన్ నూలి
రేటింగ్ : 2.5/5
'ఇస్మార్ట్ శంకర్' తో రామ్ కి అదిరిపోయే మాస్ హిట్ పడింది. పక్కా మాస్ మసాలా సినిమా గా రామ్ కి కోరుకున్న మాస్ ఇమేజ్ ని ఇచ్చింది. ఇప్పుడు అదే ఊపులో 'ది వారియర్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు . మాస్ పల్స్ తెలిసిన లింగుస్వామి ఈ చిత్రానికి దర్శకుడు కావడం, టీజర్ ట్రైలర్ ఇంటరెస్టింగా ఉండటంతో ది వారియర్ పై అంచనాలు పెరిగాయి. పైగా రామ్ కెరీర్ లో హయ్యస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది వారియర్. మరి ఇన్ని మంచి అంచనాల మధ్య వచ్చిన వారియర్ అనుకున్నంత విజయాన్ని అందుకున్నాడా, ఇస్మార్ట్ శంకర్ మాస్ ఇమేజ్ ని కొనసాగించాడా ? తెలియాలంటే రివ్యూ లోకి వెళ్ళాల్సిందే.
కథ:
సత్య (రామ్) డాక్టర్. హైదరబాద్ నుండి కర్నూల్ జీహెచ్ వస్తాడు. గురు (అది పిని శెట్టి) అంటే కర్నూల్ లో హడల్. చిన్నప్పుడే ఒకరి తల నరికి జైలు కి వెళ్తాడు. జైలు నుండి వచ్చిన తర్వాత కర్నూల్ లో భయం పుట్టించి అరాచకాలు కొనసాగిస్తుంటాడు. ఎదురు వచ్చిన వాళ్ళని చంపి ఒక మొక్క నాటేస్తాడు. అలా నాటిన మొక్కలు ఏకంగా ఒక వనంని మించిపోతాయి. చావు బ్రతుకుల మధ్య వున్న ఓ వ్యక్తిని వైద్యం చేసి కాపాడుతాడు సత్య. ఆలా కాపాడిన ప్రాణాన్ని తన కళ్ళ ముందే గురు మనుషులు తీసేస్తారు. సత్య పోలీసులకు ఫిర్యాదు చేస్తే గురు తన పవర్ చూపించి వెనక్కి తీసుకునేలా చేస్తాడు. గురు బినామీ రవి(అజయ్) తయారు చేసిన కంపెనీ మందులు వాడకం వలన ముగ్గురు చనిపోతారు. సత్య గురు బినామీలు చేస్తున్న డ్రగ్ మాఫియాని ఆధారాలతో కలెక్టర్ కి పట్టిస్తాడు. దింతో గురు, సత్యాన్ని చితకబాది కర్నూల్ సెంటర్ లోవ్రేలాడదీస్తాడు. తర్వాత సత్య ఏం చేశాడనేది మిగతా కథ.
విశ్లేషణ:
దర్శకుడు లింగుస్వామి మాస్ పల్స్ తెలిసన దర్శకుడే. పందెంకోడితో ఒక కొత్త తరహ కమర్షియల్ టెంప్లెట్ ని అందించిన దర్శకుడు. ది వారియర్ కోసం లింగుస్వామి ఎంచుకున్న పాయింట్ కొంచెం కొత్తదే. సినిమా చివర్లో డాక్టర్ కమ్ పోలీసు గా సేవలు అందించిన వారికి స్ఫూర్తిగా ఈ కథని చేశానని చెప్పకనే చెప్పాడు. ఒక డాక్టర్ తనకి ఎదురైన పరిస్థితుల నుండి పోలీస్ గా మారిన కథని ప్లాట్ పాయింట్ గా తీసుకున్నాడు లింగుస్వామి. అయితే ఈ పాయింట్ని ఫస్ట్ హాఫ్ పందెంకోడి, సెకండ్ హాఫ్ సగటు కమర్షియల్ సినిమా ఫార్మేట్ లో నడిపేయడం మాత్రం ఆకట్టుకోదు. సత్య డాక్టర్ గా కర్నూల్ కి రావడం హీరోయిన్ తో కొన్ని టైం పాస్ సీన్లు, తర్వాత గురు మనుషులకు ఎదురుపడటం, సత్య ఎదురుతిరగడం, సత్యని గురు కొట్టడంతో ఫస్ట్ హాఫ్ ముగిసిపోతుంది. ఫస్ట్ హాఫ్ లో ఆదికి ఇచ్చిన ఎలివేషన్ కాస్త చెప్పుకోదగ్గదిగా వుంటుంది
ట్రైలర్ లో రామ్ ని పోలీసుగా చూపించారు కాబట్టి. సెకండ్ హాఫ్ అఫ్ పై ప్రేక్షకుడు అప్పుడే ఒక అంచనాకి వచ్చేస్తాడు. పోలీసు గా సత్య ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి గురు వెర్సస్ సత్య అన్నట్టుగా సాగుతుంది. ఐతే ఈ వార్ లో కొత్తదనం వుండదు. సెకండ్ హాఫ్ అంతా సత్యనే పై చేయి సాధిస్తుంటాడు. ఈ క్రమంలో సగటు మాస్ ఎలివేషన్స్ తెరపై వస్తుంటాయి. విజల్, బుల్లెట్ పాటలతో పది నిమిషాల రన్ టైం అయిపోతుంది. గురుని పట్టుకోవడానికి సత్య చేసే ప్రయత్నాల్లో బలం వుండదు. ఆ సన్నివేశాలన్నీ చాలా బలహీనంగా తీర్చిదిద్దారు. ఈ కథలో హీరోయిన్ కి చోటు లేదా ? అనుకున్న సమయంలో హీరోయిన్ పాత్రకు ఒక ప్రమాదంను క్రియేట్ చేసి సెంటిమెంట్ ని పిండే ప్రయత్నం చేశారు. అయితే అది పెద్ద గా కలసి రాలేదు. సెకండ్ హాఫ్ లో సత్య ''సైలెన్స్ తో చేసిన వైలెన్స్' సీక్వెన్స్ కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ కూడా ఒక ఫైట్ తో రొటీన్ గానే ముగించేస్తాడు దర్శకుడు.
నటీనటులు:
రామ్ ఒకే పాత్రలో డబుల్ యాక్షన్ చేసే అవకాశం ఇచ్చింది వారియర్. డాక్టర్ గా సాఫ్ట్ గా వున్న సత్య పోలీస్ గా మాస్ కా బాప్ అన్నట్టు రెచ్చిపోయాడు. యాక్షన్ సీన్స్ అద్భుతంగా చేశాడు. డ్యాన్సులు ఎప్పటిలానే హుషారుగా వున్నాయి.
కృతి శెట్టికి కథలో పెద్ద భాగం లేదు. చివర్లో సెంటిమెంట్ కోసం అన్నట్టుగా ఒక సీన్ పెట్టారు. మాస్ పాటల్లో కృతి తేలిపోయింది. గురు పాత్రలో ఆది నటన చాలా వుంది. ఆదిలో చాలా వైవిధ్యమైన నటుడు వున్నాడు. విలక్షణమైన విలన్ ఆయనతో ఉన్నాడని గురు పాత్ర చూస్తే అర్ధమౌతుంది. నదియా పాత్ర మాములుగానే వుంది. బ్రహ్మాజీ పాత్ర ఓకే. మిగతా పాత్రలన్నీ పరిధిమేర వున్నాయి.
టెక్నికల్ గా
టెక్నికల్ గా సినిమా ఓకే. రెండు పాటలు మాస్ కి నచ్చుతాయి. దేవిశ్రీ నేపధ్య సంగీతం కొన్ని మాస్ సీన్స్ ని ఎలివేట్ చేసింది. కెమెరా పనితనం రిచ్ గా వుంది. నిర్మాణ విలువలు ఓకే. సాయి మాధవ్ బుర్రా డాక్టర్, పోలీసులు గురించి కాయిన్ చేసిన డైలాగులు కొన్ని బావున్నాయి. దర్శకుడు స్క్రీన్ ప్లే, ట్రీట్ మెంట్ లో కొత్తదనం పై కాస్త ద్రుష్టి పెట్టుంటే వారియర్.. విన్ అయ్యేవాడే. కానీ బ్యాడ్ లక్. ఈ వారియర్ వార్ చాలా రొటీన్ గానే ముసిగిపోయింది.
ప్లస్ పాయింట్స్
రామ్
కొన్ని యాక్షన్ సీన్స్
నేపధ్య సంగీతం
మైనస్ పాయింట్స్
రొటీన్ కధనం
పంక్తు కమర్షియల్ ఎలిమెంట్స్
కొత్తదనం లేని క్లైమాక్స్
ఫైనల్ వర్దిక్ట్: రొటీన్ వార్