తారాగణం: వరుణ్ తేజ్, రాశి ఖన్నా, ప్రియదర్శి, హైపర్ ఆది తదితరులు
నిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర
సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: జార్జ్
ఎడిటర్: నవీన్ నూళి
నిర్మాత: BVSN ప్రసాద్
రచన-దర్శకత్వం: వెంకీ అట్లూరి
రేటింగ్: 3.25/5
మెగా హీరోలంతా మాస్ కథలతో మురిపించాలనుకుంటుంటే, అందుకు విభిన్నమైన దారిని ఎంచుకున్నాడు వరుణ్ తేజ్. ఆరడుగుల హైట్, మంచి పర్సనాలిటీ ఉన్నా... హార్ట్ టచింగ్ కథలతోనే ముందుకు వెళ్తున్నాడు. ఆ దారే తనకు కలిసొచ్చింది. కంచె, ఫిదాలు అలానే హిట్లిచ్చాయి. మరోసారి తనకు నచ్చే, నప్పే దారిలో వెళ్లి ఎంచుకున్న కథ... 'తొలి ప్రేమ'. టైటిల్, టీజర్ చూస్తుంటే... ఇదో సున్నితమైన ప్రేమకథ అని తెలిసిపోతోంది. మరి. దర్శకుడు ఇంకెంత సున్నితంగా తెరకెక్కించాడు? వరుణ్ అందులో ఎంత బాగా ఇమిడిపోయాడు? డిటైల్డ్‌గా చెప్పుకోవాలంటే కథలోకి వెళ్లాలి.
* కథ
ఆదిత్య (వరుణ్ తేజ్)కి కోపం ఎక్కువ. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం తెలీదు. తొలి చూపులోనే వర్ష (రాశీఖన్నా)ని ప్రేమిస్తాడు. తనేమో ఏదైనా సరే.. ఆలోచించి మాట్లాడుతుంది. వర్ష పుట్టిన రోజున... రింగ్ ఇచ్చి... తన జీవితంలోకి ఆహ్వానించాలనుకుంటాడు ఆది. అయితే... సరిగ్గా ఆరోజే అనుకోకుండా ఆది, వర్ష విడిపోతారు. మళ్లీ ఆరేళ్లకు లండన్‌లో కలుస్తారు. అప్పటికీ వర్షపై ఆదికి కోపం అలానే ఉంటుంది. ఇంతకీ వర్షపై ఆదికి కోపం ఎందుకొచ్చింది? ఇద్దరూ ఎందుకు విడిపోయారు? లండన్‌లో అయినా మళ్లీ కలుసుకున్నారా, లేదా? అనేదే కథ.
* నటీనటులు..
వరుణ్‌లో మచ్చూరిటీ సినిమా సినిమాకీ పెరుగుతుంది. చాలా డీసెంట్‌గా నటించాడు. గెడ్డం లేకుండా ఎంత బాగున్నాడో, గెడ్డంతోనూ అంతే బాగున్నాడు.
వరుణ్ కంటే రాశీ ఖన్నాకు ఎక్కువ మార్కులు పడతాయి. అమాయకంగా, అందంగా కనిపించింది. తనలో నటిని పూర్తి స్థాయిలో బయటకి తీసుకొచ్చింది. సినిమా అంతా వీళ్లిద్దరే ఆక్రమించుకున్నారు. మిగిలిన వాళ్లకు ప్లేస్ లేదు.
సుహాసిని, నరేష్‌లు కూడా సైడ్ క్యారెక్టర్లుగా మిగిలిపోయారు. హైపర్ ఆది, ప్రియదర్శి నవ్విస్తారు.
* విశ్లేషణ
ఇదో ప్రేమ ప్రయాణం. ప్రేమ, కోపం, ద్వేషం... ఇలా సాగిన ఓ లవ్ స్టోరీ. ఓ అబ్బాయి అమ్మాయి ప్రేమించుకోవడం, విడిపోవడం, తిరిగి కలుసుకోవడం చాలా సినిమాలుగా, చాలా ఏళ్లుగా చూస్తున్నాం. ఇదీ అలాంటి కథే. కాకపోతే... దర్శకుడు ఈ కథని యువతరానికి ఎక్కేలా తీశాడు . రైల్వేస్టేషన్ నేపథ్యంలో సన్నివేశాలు, కాలేజీలో ర్యాగింగ్, కార్లో సీన్, ఇంట్రవెల్ సీన్ ఇవన్నీ యూత్‌కి నచ్చేవే. కామెడీ అంటూ వేరుగా ఉండదు. కథలోనే ప్రయాణం చేస్తుంటుంది. వరుణ్ కోసం కొన్ని ఫైట్లు కూడా డిజైన్ చేశారు. అవి కూడా మరీ మాసీగా లేకుండా.... నీట్‌గా తీశారు. పాటలూ హాయిగా సాగిపోతాయి. మొత్తానికి తొలి సగం... హాయిగా గడిచిపోతుంది.
ద్వితీయార్థంలో పూర్తిగా ఎమోషనల్ డ్రైవ్ నడుస్తుంది. అలాగని కర్చీఫ్ లకు పని కల్పించలేదు. అక్కడ కూడా కొద్దిగా ఫన్, కాస్త రొమాన్స్, కొన్ని గొడవలూ... ఇలా సాగిపోయింది. తొలి సగంతో పోలిస్తే.. ద్వితీయార్థంలో సినిమా కాస్త నెమ్మదించినట్టు కనిపిస్తుంది. అయితే ఇలాంటి కథల్లో ఉన్న సమస్యే అది. ఊహించని మలుపులు అంటూ ఏమీ ఉండవు. కథ ఫ్లాట్‌గా సాగిపోతుంది. అయితే బోరింగ్ గా అనిపించే సన్నివేశాలు లేకపోవడం, హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ బాగా కుదరడం ఈ సినిమాకి బాగా కలిసొచ్చిన అంశాలు. ముగింపు కూడా ఊహకి అందని విధంగా ఏమీ ఉండదు. కథ అలా ముగుస్తుందని విశ్రాంతి కార్డు దగ్గరే ఊహిస్తాడు ప్రేక్షకుడు. వాళ్ల ఈగోల్ని సంతృప్తి పరచి పంపిస్తాడు దర్శకుడు.
* సాంకేతికంగా...
తమన్ మెలోడీలు ఆకట్టుకుంటాయి. పాటలు హాయిగా ఉన్నాయి. నేపథ్య సంగీతమూ అంతే. విదేశాల్లో తెరకెక్కించిన సినిమా ఇది. కాబట్టి.. ప్రతీఫ్రేమూ అందంగానే కనిపించింది. దర్శకుడు ఎంచుకున్న కథ పాతదే. కానీ దాన్ని అందంగా చూపించగలిగాడు. తనలో ఉన్న మాటల రచయిత సహకారం బాగా అందించాడు. చాలా చోట్ల సన్నివేశాల్ని కేవలం సంభాషణలతో నిలబెట్టాడు.
* ప్లస్ పాయింట్స్
+ హీరో, హీరోయిన్ల కెమిస్ట్రీ
+ క్లీన్ ప్రెజెంటేషన్
+ పాటలు
* మైనస్ పాయింట్స్
- స్లో నేరేషన్
* ఫైనల్ వర్డిక్ట్: తొలిప్రేమ.. యువతరానికి నచ్చేస్తుంది.
రివ్యూ బై శ్రీ