నటీనటులు : నాని, సుధీర్ బాబు, నివేత థామస్, అదితి రావ్ హైదరి తదితరులు
దర్శకత్వం : ఇంద్రగంటి మోహన్ కృష్ణ
నిర్మాతలు : దిల్ రాజు
సంగీతం : అమిత్ త్రివేది, థమన్
సినిమాటోగ్రఫర్ : పీజీ విందా
ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేష్
రేటింగ్: 2.5
`వి` సినిమా చాలా విధాలుగా స్పెషల్.
ఇది నాని 25వ సినిమా
ఓటీటీలో విడుదల అవుతున్న తొలి పెద్ద సినిమా.
ఇద్దరు హీరోలు కలిసి చేసిన సినిమా.
ఇంకేం కావాలి.. హాయిగా ఇంటి పట్టున కూర్చుని చూసేయడానికి. మరి.. `వి` ఎలా ఉంది? `వి`జేతగా నిలిచిందా? `వి`నోదాన్ని పంచిందా?
* కథ
డీసీపీ ఆదిత్య (సుధీర్‌బాబు) ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్. తన డేరింగ్ అండ్ డాషింగ్ చూసి డిపార్ట్ మెంట్ మొత్తం దాసోహం అంటుంది. మెడల్స్ కూడా వస్తాయి. అయితే... ఆదిత్య లోని సాహసానికి, తన ప్రతిభకు పరీక్ష ఎదురవుతుంది. ఓ సైకో కిల్లర్ రూపంలో. హైదరాబాద్ లో వరుసగా హత్యలు చేస్తుంటాడు. పేరు చెప్పి మరీ హత్య చేస్తుంటాడు. కొన్ని క్లూలు వదులుతుంటాడు. ఇవన్నీ ఆదిత్యకు సవాల్ విసురుతుంటాయి. మరి ఆ సైకో కిల్లర్ ఎవరు? ఎందుకు ఇన్ని హత్యలు చేస్తున్నాడు? తనని ఆదిత్య ఎలా పట్టుకున్నాడు? అన్నదే `వి` కథ.
* విశ్లేషణ
మర్డర్ మిస్టరీలూ, సస్పెన్స్ థ్రిల్లర్‌లూ ఈమధ్య ఎక్కువగానే వచ్చాయి. వస్తున్నాయి. ఇదో విజయవంతమైన జోనర్. కాకపోతే.. ఆ సస్పెన్స్, థ్రిల్లింగ్ ఇవన్నీ వేరే రేంజులో ఉండాలి. ఎందుకంటే మన ప్రేక్షకులు హాలీవుడ్ సినిమాలు చూసి మరీ తెలివి మీరిపోయారు. ఆ రేంజ్‌లో మలుపుల్ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. తెలుగులోనూ మంచి థ్రిల్లర్లు వస్తున్నాయి. వాటి మధ్య `వి` నిలబడుతుందన్నది అందరి ఆశ. కానీ... అది ఏ దశలోనూ.. నిలబడలేదు.
ఎందుకంటే ఇదో సాధారణమైన రివైంజ్ డ్రామా. ప్రతీ సైకోకీ ఓ బ్యాక్ స్టోరీ ఉంటుంది. ఈ కథలో.. నానికీ ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అందుకు ప్రతీకారంగా ఈ హత్యలు చేస్తుంటాడు. ఆ బ్యాక్ స్టోరీ మరీ వీక్ గా ఉండడం.. ఈ కథలోని ప్రధానమైన ప్రతికూలాంశం. పోలీసులకు ఒక్కో క్లూ వదిలి హత్యలు చేయడం చాలా పాత స్టైల్. ఆ క్లూలు ఏమంత.. ఆసక్తిగా ఉండవు. హత్యలు చేసే పద్ధతి, అక్కడ నాని చేసే హంగామా ఇవన్నీ ఏమాత్రం రక్తి కట్టించవు. ఎందుకంటే.. ఈ తరహా సన్నివేశాలు ఇది వరకే ప్రేక్షకులు చాలా సార్లు చూసేశారు. నాని - సుధీర్ బాబు ఇద్దరికీ సమానమైన పాత్రలు ఇవ్వాలనుకున్నాడు దర్శకుడు. ఇచ్చాడు కూడా. కానీ.. ప్రతీసారీ సుధీర్ బాబుపై నాని నే గెలుస్తుంటాడు. ఎంత సేపూ ఫోన్లలో సవాళ్లూ, ప్రతి సవాళ్లూ విసురుకోవడమే సరిపోయింది. వాళ్లిదరి మాటల్లో ఉన్న సత్తా.. చేతల్లోకొచ్చేటప్పుడు కనిపించదు. ఎప్పుడైనా పోరు రసవత్తరంగా ఉండాలంటే ఇద్దరు సమాన స్థాయి ఉన్న శక్తిమంతులు బరిలోకి దిగాలి. ఎప్పుడూ ఒకరిదే పై చేయి అంటే ఎలా?
మర్డర్లు ఎందుకు జరుగుతున్నాయి? వెనుక ఉన్న కారణమేంటి? ఇవన్నీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తేలాలి. అదే ఆసక్తికరమైన అంశం కూడా. అయితే ఓ పాత్ర.. బ్యాక్‌స్టోరీ అంతా. పాఠం చదివినట్టు చదివేస్తుంది. ఇక పోలీసులు ఏం చేసినట్టు? సుధీర్ బాబు లాంటి తెలివైన పోలీస్ ఆఫీసర్ ఏం ఇన్వెస్టిగేషన్ చేసినట్టు..? నాని ఫ్లాష్ బ్యాక్ కూడా.. నానినే వచ్చి చెప్పుకునేంత వరకూ తెలీదు. ఇదంతా వీక్ స్క్రీన్ ప్లేనే. ఇంతా పోగేస్తే.. ఇది సాధారణమైన రిజైంజ్ డ్రామా అయిపోయింది. ఆఖరికి `వి` వెనుక ఏదో వెరైటీ రీజనింగ్ ఉందేమో అనుకుంటారంతా. కానీ.. వి అంటే హీరో పేరు.. విష్ణు. అంతే.
* నటీనటులు
నాని బాగా నటిస్తాడని 25 సినిమాల నుంచీ చెప్పుకుంటూనే ఉన్నాం. డీటో ఈసారీ అంతే. కాకపోతే.. విలన్ గా తనకు తొలిసారి. తను విలన్ అయినా.. తెరపై హీరోలానే కనిపిస్తుంటాడు. తన డైలాగ్ డెలివరీ కొత్తగా ఉంది. అయితే... నాని నుంచి మాత్రమే చూడగలిగే... కామిక్ టైమింగ్ ఈ సినిమాలో మిస్సయ్యింది. ఎందుకంటే.. స్టోరీ అలాంటిది. సుధీర్ బాబు కూడా మెచ్చుకోదగిన నటన ప్రదర్శించాడు. తనకీ మంచి మార్కులు పడతాయి. నివేదా, అతిథి.. ఇద్దరూ హీరోయిన్ కి తక్కువ. అతిథి పాత్రలకు ఎక్కువ.
* సాంకేతిక వర్గం
సంగీతం, ఛాయాగ్రహణం, కళారంగం.. ఇవన్నీ బాగా పనిచేశాయి. నేపథ్య సంగీతం బాగుంది. ఇంద్రగంటి మాటలు అక్కడక్కడ ఆకట్టుకుంటాయి. రచయితగా. ఇంద్రగంటి బాగా ఫెయిల్ అయ్యాడనిపిస్తుంది. తనవైపు నుంచి మెరుపులేం లేవు. ఓ సాధారమైన కథని, చాలా సాధారణంగా తీర్చిదిద్దాడు. యాక్షన్ ఎపిసోడ్లు మాత్రం ఆకట్టుకుంటాయంతే.
* ప్లస్ పాయింట్స్
నాని - సుధీర్ బాబు
యాక్షన్ ఎపిసోడ్స్
* మైనస్ పాయింట్స్
నాని ఫ్లాష్ బ్యాక్
కథ, స్క్రీన్ ప్లే
* ఫైనల్ వర్డిక్ట్: మరీ `వీ`క్...