తారాగణం: విశాల్, అను ఇమ్మానియేల్, ఆండ్రియా
నిర్మాణ సంస్థ: విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ
సంగీతం: కార్తీక్
నిర్మాత: విశాల్
దర్శకత్వం: మైస్కిన్
యావరేజ్ యూజర్ రేటింగ్: 2.75/5
నేర పరిశోధన, అన్వేషణ... ఇవెప్పుడూ ఆసక్తికరమైన అంశాలే. మధుబాబు డిటెక్టివ్ నవలలకు అందుకే ఒకప్పుడు భలే గిరాకీ ఉండేది. చిక్కుముడుల్ని విప్పడంలో.. ఫజిల్స్ నింపడంలో ఓరకమైన సంతృప్తి ఏర్పడుతుంటుంది. థ్రిల్లర్ సినిమాలకు అదే ఆయువు కూడా. సీక్వెన్స్‌లాంటి కొన్ని సన్నివేశాలు చక చక సాగిపోవడం, వాటి వెనుక ఓ మిస్టరీ చేధించడం, చివరికి నిందితుడ్ని పట్టుకోవడం ఈ నేపథ్యంలో చాలా సినిమాలొచ్చినా.. వాటిపై ఆసక్తి ఏమాత్రం సన్నగిల్లలేదు. సరిగ్గా కూర్చోబెట్టగలిగే స్క్రిప్టు వస్తే... ప్రేక్షకులు చూడ్డానికి ఇప్పటికీ సిద్ధంగానే ఉన్నారు. `డిటెక్టివ్` అలాంటి సినిమానే.
* కథ ..
ఆది (విశాల్) ఓ డిటెక్టివ్. చాలా కేసుల్ని సులభంగా పరిష్కరించాడు. మనస్సాక్షికి విరుద్ధంగా ఒక్క కేసు కూడా టేకప్ చేయడు. తన బుర్రకు పదునుపెట్టే కేసొస్తే మాత్రం వదలడు. ఓ కుక్కపిల్లని చంపిందెవరో తెలుసుకోవడానికి ఇన్వెస్టిగేషన్ మొదలెడతాడు ఆది. ఆ కుక్కపిల్ల చావు చుట్టూ చాలా అంశాలు ముడిపడి ఉంటాయి. వేల కోట్ల డబ్బు, ఓ ముఠా వరుస హత్యలు అన్నీ కుక్కపిల్ల చావు చుట్టూ ఉన్నవే. వాటిని ఓ `పన్ను` సహాయంతో తీగ లాగే ప్రయత్నం చేస్తాడు ఆది. మరి ఈ కేసులో చిక్కుముడులు ఎలా విప్పాడు?? పోలీసులకు సైతం అంతు చిక్కని ఓ సమస్యకి పరిష్కారం ఎలా కనుగొన్నాడు అనేదే కథ.
* నటీనటులు..
విశాల్ డిటెక్టివ్ పాత్రలో ఒదిగిపోయాడు. తనకు ఇదో కొత్త తరహా పాత్ర. డిటెక్టివ్‌లు ఎలా ఆలోచిస్తారు?? వాళ్ల బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందన్న విషయంలో విశాల్ చాలా పరిశోధన చేసినట్టున్నాడు. దాన్ని చక్కగా తెరపై చూపించగలిగాడు. విశాల్ క్యారెక్టరైజేషనే కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. విశాల్‌కి స్నేహితుడిగా నటించిన ప్రసన్న కూడా ఆకట్టుకొంటాడు. అను ఇమ్మానియేల్‌ది చిన్న పాత్రే. కానీ ఆ కాసేపయినా అందంగా, అమాయకంగా కనిపించింది. సిమ్రాన్ ఓ చిన్న పాత్రలో మెరిసింది.
* విశ్లేషణ..
సహజ మరణాలుగా భ్రమింపజేసే కొన్ని హత్యలు వరుసగా జరుగుతుంటాయి. మెరుపుదాడికి తండ్రీ కొడుకులు చనిపోవడం, ఓ పోలీస్ ఆఫీసర్ ఉన్నట్టుండి కుప్పకూలడం.. వీటితో కథ మొదలవుతుంది. ప్రారంభ సన్నివేశాలు చాలా పట్టుగా తెరకెక్కించాడు దర్శకుడు. సులభంగానే ప్రేక్షకుడూ కథలో లీనం అవుతాడు. కుక్కపిల్ల మరణం చుట్టూ ఉన్న కారణాలను అన్వేషిస్తూ సాగిన ప్రయాణం కొత్త కొత్త మలుపులకు దారిస్తుంది. అవన్నీ ఆసక్తికరంగానే రాసుకొన్నాడు దర్శకుడు. కేసు ఇన్వెస్టిగేషన్ చేసే విధానం, దాని కోసం ఆది అప్రోచ్ ఇవన్నీ కొత్తగా అనిపిస్తాయి. ద్వితీయార్థంలో కాస్త కన్‌ఫ్యూజన్ కనిపిస్తుంది. సైన్స్‌కి సంబంధించిన సూత్రాలు, ఇంజనీరింగ్ లెక్కలతో బాగా గందరగోళపరిచాడు దర్శకుడు. అవన్నీ సామాన్య ప్రేక్షకుడికి అర్థమవడం చాలా కష్టం. అసలు ఈ వరస హత్యలు ఎందుకు జరిగాయి, దానికి కారణం ఏమిటన్న విషయం కూడా ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పడంలో దర్శకుడు విఫలం అయ్యాడు. అయితే చాలా సన్నివేశాల్లో దర్శకుడి పనితనం కనిపిస్తుంది. కథానాయిక పాత్రని ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా వాడుకోవడం బాగుంది.
* సాంకేతిక వర్గం..
ఇది దర్శకుడి సినిమా. తన క్రియేటివిటీ మొత్తం చూపించాడు. కెమెరా విభాగం నుంచి వచ్చాడు కాబట్టి, అది తనకు బాగా ప్లస్ అయ్యింది.
సన్నివేశాల్ని పోట్రయిట్ చేసే పద్ధతి ఆకట్టుకొంటుంది. కాకపోతే మరీ మేధావితనానికి పోయాడు. ఆర్.ఆర్ అదిరిపోయింది. సీన్‌ని బాగా ఎలివేట్ చేసింది. కెమెరా, ఎడిటింగ్ షార్ప్ గా పనిచేశాయి.
* ప్లస్ పాయింట్స్
+ థ్రిల్ మూమెంట్స్
+ విశాల్
+ నేపథ్య సంగీతం
* మైనస్ పాయింట్స్
- గందరగోళం
* ఫైనల్ వర్డిక్ట్: డిటెక్టివ్... ఇంటిలిజెంట్ థ్రిల్లర్
రివ్యూ బై శ్రీ