నటీనటులు : సత్య, ఆర్జవి రాజ్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు
దర్శకత్వం : రామ్ అబ్బరాజు
నిర్మాతలు : సినీష్, సందీప్ కిషన్
సంగీతం : అని వి
సినిమాటోగ్రఫర్ : మణికందన్
ఎడిటర్: చోట కె ప్రసాద్
రేటింగ్: 2/5
హాస్య నటులు హీరోలుగా అవతారం ఎత్తడం టాలీవుడ్ లో మామూలే. ఈసారి సత్య వంతు. సునీల్ తరహాలో కామెడీ చేస్తూ.. మెల్లమెల్లగా తనకంటూ ఓ పంథా సృష్టించుకున్నాడు సత్య. `మత్తు వదలరా` లాంటి సినిమాల్లో తాను ఓ హీరో అంతటి పాత్రల్నే పోషించాడు. ఇప్పుడు `వివాహ భోజనంబు`లో ఏకంగా హీరో అయిపోయాడు. సందీప్ కిషన్ నిర్మాతగా రూపొందించిన సినిమా కావడం, లాక్ డౌన్ నేపథ్యంలో ఎంచుకున్న కథ అవ్వడం వల్ల `వివాహ భోజనంబు`కి మంచి బజ్ ఏర్పడింది. థియేటర్లలో విడుదల కావల్సిన ఈ సినిమా అనివార్య పరిస్థితుల వల్ల ఓటీటీ (సోనీ)కి వెళ్లిపోయింది. ఈరోజే విడుదలైన ఈ `వివాహ భోజనంబు` కథాకమామిషూ ఏమిటి? హీరోగా.. సత్య బ్రేక్ సాధించాడా?
* కథ
మహేష్ (సత్య), అనిత (ఆర్జావీ రాజ్) ఇద్దరూ ప్రేమించుకుంటారు. మహేష్ చిరుద్యోగి. ఎల్ఐసీలో పని చేస్తుంటాడు. పైగా పరమ పిసినారి. అనితది ఉన్నత కుటుంబం. మహేష్ - అనితా.. ఎలా చూసినా ఈడూ జోడూ కాదు. అందుకే ఈ పెళ్లి చేయడం అనిత తండ్రి (శ్రీకాంత్ అయ్యంగార్)కి ఇష్టం ఉండదు. కరోనా పరిస్థితుల వల్ల... పరిమితమైన కుటుంబ సభ్యుల మధ్య పెళ్లి జరిగిపోతుంది. అయితే సడన్ గా లాడ్ డౌన్ విధించడం వల్ల అనిత కుటుంబం అంతా... మహేష్ ఇంట్లోనే ఉండిపోవాల్సివస్తుంది. ఆ లాక్‌డౌన్‌లో ఇంటిల్లిపాదినీ మేపలేక, ఇంట్లోంచి పంపించేయలేక... మహేష్ నానా పాట్లూ పడతాడు. అవేంటి? దాని పర్యవసానాలేంటి? అనేది తెరపైనే చూడాలి.
* విశ్లేషణ
ట్రైలర్ లోనే కథేంటో చెప్పేశారు. ఓ పిసినారి ఇంట్లో బంధుమేళం అంతా ఉండిపోతే ఎలా ఉంటుందన్నదే కాన్సెప్టు. దానికి లాడ్ డౌన్ నేపథ్యం జోడించారు. కొన్ని వాస్తవ సంఘటనల సమాహారం అని దర్శకుడూ చెప్పేశాడు. లాక్ డౌన్ సమయంలో.. ఇలాంటి సంఘటనలూ చాలా జరిగాయి. కాబట్టి... కథ, కథనం, సన్నివేశాలు మనకేమాత్రం కొత్తవి అనిపించవు. కరోనా బాధలు ఇప్పటికీ పడుతున్నాం కాబట్టి.. అవే తెరపై చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. చాలా సో ఫేజ్ లో ఈ సినిమా మొదలవుతుంది. పెళ్లి తతంగం, సత్య పిసినారి బుద్ధులు, శ్రీకాంత్ అయ్యంగార్ ఫస్ట్రేషన్... వీటి మధ్య కాస్త సరదా సరదాగానే సాగిపోతుంటుంది.
లాక్ డౌన్ ప్రకటించడంతో - సత్య కష్టాలు మొదలవుతాయి. ఇంట్లో ఉన్న బంధువులకు ఉప్మా పెట్టి విసిగించడం, వాళ్లని ఇంట్లోంచి వెళ్లగొట్టాలని చూడడం, `నా కూతురు నీకెలా పడింది` అంటూ.. అల్లుడిని అయ్యంగార్ అనుమానంగా చూస్తుండడం.. ఇంట్రవెల్ వరకూ ఇదే తంతు. కథ పిసరంత. దాన్ని రెండు గంటలు సాగదీయడం అంటే కష్టమే. దాంతో చూసిన సన్నివేశాన్నే మళ్లీ చూసినట్టు అనిపిస్తుంటుంది. లాడ్ డౌన్ సమయంలో ఆశీర్వాద్ ఆటా కోసం పడిన పాట్లు, అప్పుడు వచ్చిన మీమ్స్, సరదా వీడియోలూ.. ఈ సినిమా కోసం వాడేసుకున్నారు. అవన్నీ ప్రేక్షకులు రిలేట్ చేసుకుంటారు. కాకపోతే... ఇప్పటికీ అవే కష్టాలూ బాధలూ ఉన్నాయి. వాటినే తెరపై చూపించడం కాస్త విసిగించే విషయమే.
సందీప్ కిషన్ ఓ అంబులెన్స్ డ్రైవర్ గా ఎంట్రీ ఇస్తాడు. తన బిల్డప్ షాట్లకేసమయం ఎక్కువ తీసుకున్నాడు. ఇంగ్లీషు సామెతల్ని తరగేసి చెప్పి, కామెడీ పండిద్దామనుకున్నాడు.కానీ ఆ ట్రాక్ అంతగా రక్తి కట్టలేదు. పైగా... సినిమా మరింత సాగిన ఫీలింగ్ కలుగుతుంది. హీరో హీరోయిన్ల ఫ్లాష్‌బ్యాక్ లవ్ స్టోరీ కూడా కుదరలేదు. క్లైమాక్స్ అతికినట్టు అనిపిస్తుంది.
* నటీనటులు
సత్యది మంచి కామెడీ టైమింగ్. ఈ సినిమాతోనూ అదే ప్రూవ్ అయ్యింది. రాసుకున్న అరాకొర కామెడీ సీన్లనే.. సత్య బాగా పండించగలిగాడు. తన వల్లే కొన్ని సీన్లు బాగున్నాయనిపింయింది. అర్జావీ రాజ్ బాగుంది. ఎక్స్‌ప్రెషన్స్ దగ్గరకొచ్చే సరికి తడబడింది. సుదర్శన్ మరోసారి ఆకట్టుకుంటాడు. సందీప్ కిషన్ నిర్మాత కాబట్టి.. తన పాత్రని పెంచేశారు. అంత అవసరం లేదనిపిస్తుంది. శ్రీకాంత్ అయ్యంగార్ - సత్యల కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఇటీవల మరణించిన టీఎన్నార్ ఫుల్ లెంగ్త్ పాత్ర లో కనిపించారు.
* సాంకేతిక వర్గం
పాటలు సోసోగా ఉన్నాయి. ఈ సినిమాకి పాటల్ని పక్కన పెట్టినా పెద్దగా నష్టం ఉండదు. బడ్జెట్ పరిమితులు కనిపించాయి. దాని వల్ల.. క్వాలిటీ లోపించింది. కొన్ని మాటలు, సన్నివేశాలు కరోనా పరిస్థితులకు అద్దం పట్టాయి. కొన్ని డైలాగులు ఫన్నీగా ఉన్నాయి. ఉదాహరణకు టీఎన్నార్ తో సత్య `మీరు ఇంటర్వ్యూ మొదలెడితే మూడు గంటల వరకూ వదలరు` అంటాడు. టీఎఎన్నార్ యూ ట్యూబ్ లో ఇంటర్వ్యూలు సుదీర్ఘంగా సాగుతాయి కదా. ఇది ఆయనపై పంచ్ అన్నమాట. కథ కొత్త కాదు.కేవలం సన్నివేశాలతో ఆ కొత్తదనం చూపించాలి. వినోదం పండించాలి. ఇవి రెండూ అరకొర పండాయంతే.
* ప్లస్ పాయింట్స్
సత్య కామెడీ
* మైనస్ పాయింట్స్
లవ్ ట్రాక్
ఎమోషన్స్
క్లైమాక్స్
* ఫైనల్ వర్డిక్ట్: రుచులు తక్కువ