నటీనటులు : నాగార్జున, దియా మీర్జా, అలీ రెజా తదితరులు
దర్శకత్వం : అహిషోర్ సోలమన్
నిర్మాణం : మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్
సంగీతం : థమన్
సినిమాటోగ్రఫర్ : షానియేల్ డియో
ఎడిటర్: శ్రవణ్
రేటింగ్: 2.75/5
టెర్రరిజంపై ఎన్ని సినిమాలొచ్చినా, ఎన్ని కథలు చెప్పినా ఇంకా... అది ఎగర్ గ్రీన్ పాయింటే. ఎందుకంటే... ఉగ్రవాదం ఆరని చిచ్చు. ఆ భయాలు.. ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటాయి. ఇలాంటి కథల్లో దేశభక్తికీ, హీరోయిజానికి బోలెడంత స్పేస్ ఉంటుంది. సరిగ్గా చెప్పగలిగితే.. బాక్సాఫీసు దగ్గర ఢోకా లేనట్టే. వైల్డ్ డాగ్ అలాంటి కథే. బాంబు బ్లాస్టులతో దేశమంతా విధ్వంసం సృష్టిద్దామనుకున్న ఓ ఉగ్రవాదిని పట్టుకోవడానికి ఎన్.ఐ.ఏ బృందం చేసే ప్రయత్నం ఈ కథ. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఎవరికి నచ్చుతుంది? ఈ కథలో ఉన్న కమర్షియల్ పాయింట్స్ ఏమిటి?
* కథ
విజయ్ వర్మ (నాగార్జున) ఓ ఎన్.ఐ.ఏ అధికారి. తనకు వైల్డ్ డాగ్ అని పేరు. ఉగ్రవాదుల్ని ఎక్కడిక్కడ ఏరేస్తుంటాడు. ఓ ఉగ్రవాద దాడిలో.. తన కూతుర్ని కోల్పోతాడు. తన కోపంతో... ఉద్యోగానికి దూరంగా ఉంటాడు. అయితే... పూణెలో ఓ బాంబు దాడి జరుగుతుంది. దానికి సంబంధించిన ఎలాంటి క్లూ దొరకదు. ఈ కేసుని ఎన్.ఐ.ఏకి అప్పగిస్తుంది ప్రభుత్వం. అందుకోసం... విజయ్ వర్మని మళ్లీ రంగంలోకి దింపుతుంది. బాంబు దాడి వెనుక ఖాలీద్ అనే ఉగ్రవాది హస్తం ఉందని తెలుస్తుంది. ఆ ఖాలీద్ ఇండియాలోనే ఉన్నా, ఎవరికీ తెలియకుండా తప్పించుకుని తిరుగుతాడు. మరి.. వైల్డ్ డాగ్ టీమ్ ఖాలీద్ ని పట్టుకుందా, లేదా? వైల్డ్ డాగ్ టీమ్ నేపాల్ ఎందుకు వెళ్లాల్సివచ్చింది? అనేదే మిగిలిన కథ.
* విశ్లేషణ
ఉగ్రవాదిని పట్టుకోవడం అనేదే కాన్సెప్ట్ గా చేసుకుని ఇటీవల బాలీవుడ్ లో చాలా సినిమాలొచ్చాయి. `బేబీ` సూపర్ హిట్టయ్యింది. ఆ ప్రభావం `వైల్డ్ డాగ్`పై స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఫ్యామిలీ మేన్ లాంటి వెబ్ సిరీస్‌లూ, ఉరి లాంటి సినిమాలు చూసిన వాళ్లకు `వైల్డ్ డాగ్` పెద్దగా ఆసక్తి ని కలిగించదు. అయితే.. తెలుగు ప్రేక్షకులకు, సగటు సినీ అభిమానులకు ఇది కొత్త రకమైన సినిమానే అనుకోవాలి. కథంతా.. ఒకటే థ్రెడ్. ఉగ్రవాదిని పట్టుకోవడం అంతే. ఆ ప్రయత్నాల్లో వచ్చే యాక్షన్ మూమెంట్స్, ఛేజింగులూ, చేసే ఆపరేషన్లూ.. వీటి చుట్టూనే `వైల్డ్ డాగ్` నడుస్తుంది.
కొన్ని సన్నివేశాల్ని సహజంగా, ఆసక్తికరంగా మలిచాడు దర్శకుడు. ముఖ్యంగా ఇంట్రవెల్ కి ముందు.. ముంబైలో ఖాలీద్ ని పట్టుకోవడానికి చేసిన ప్రయత్నం... గ్రిప్పింగ్ గా సాగింది. అలాంటి యాక్షన్ సీన్లు.. ఇంకో రెండైనా ఉండి ఉంటే.. కచ్చితంగా బేబీలాంటి సినిమా అయ్యేది. ద్వితీయార్థం చాలా స్లోగా, ఫ్లాట్ గా మొదలవుతుంది. నేపాల్ లో.. ఖాలీద్ కోసం సాగే అన్వేషణ గ్రిప్పింగ్ గా ఉండదు. అయితే ఖాలీద్ దొరికేశాక అక్కడి నుంచి సరిహద్దు దాటడానికి చేసే ప్రయత్నం మాత్రం ఆకట్టుకునేలా మలిచాడు దర్శకుడు. ఇక్కడ కూడా బేబీ ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది.
దర్శకుడు కేవలం కథనే ఫాలో అయ్యాడు. అనవసరమైన యాడింగులు ఏమీ ఇవ్వలేదు. పాటలూ ఎలివేషన్ సీన్ల జోలికి వెళ్లలేదు. అదంతా.. వైల్డ్ డాగ్ ఒరిజినాలిటీని కాపాడాయి. హీరోకి ఓ ఫ్లాష్ బ్యాక్ పెట్టి.. కథతో ప్రేక్షకుడూ కనెక్ట్ అయ్యేలా చేశాడు. కొన్ని యాక్షన్ సీన్లు థ్రిల్లింగ్ గా అనిపిస్తే, ఇంకొన్ని.. సాదా సీదాగా సాగిపోతాయి. కథ, కథనంపై మరింత కసరత్తు చేసి, ఇంకొన్ని థ్రిల్లింగ్ మూమెంట్స్ రాసుకుంటే ఇంకాస్త బాగుండేది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇదో సరికొత్త యాక్షన్ సినిమాగా మిగిలిపోతుంది.
* నటీనటులు
నాగార్జున తన వయసు, స్థాయికి తగిన పాత్ర చేశాడు. చాలా కాలం తరవాత యాక్షన్ సీన్లలో కష్టపడాల్సివచ్చింది. వైల్డ్ డాగ్ టీమ్ లో అంతా ఓకే. కానీ అలీరాజాకే ఎక్కువ మార్కులు పడతాయి. రేయ్ లాంటి సినిమాలో గ్లామర్ డాల్ గా కనిపించిన షయామీఖేర్ .. తొలిసారి యాక్షన్ సీక్వెన్స్‌లలో... ఇరగ్గొట్టేసింది. అతుల్ కులకర్ణి సిన్సియర్ అధికారి పాత్రలో కనిపించారు.
* సాంకేతిక వర్గం
కథ పై దర్శకుడు పెద్దగా దృష్టి పెట్టలేదు. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా అల్లుకున్నాడు. స్క్రీన్ ప్లే ఇంకాస్త గ్రిప్పింగ్ గా ఉండాల్సింది. తమన్ ఇచ్చిన ఆర్.ఆర్.. ఈ సినిమాని నిలబెట్టింది. కెమెరా, ఇతర టెక్నికల్ టీమ్ వర్క్ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కనిపించాయి,
* ప్లస్ పాయింట్స్
ఉగ్రవాద నేపథ్యం
తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్
క్లైమాక్స్
* మైనస్ పాయింట్స్
అక్కడక్కడ స్లో నేరేషన్
* ఫైనల్ వర్డిక్ట్: `వైల్డ్ డాగ్`... ఓసారి చూసేయొచ్చు.