తారాగణం: నాగ చైతన్య, లావణ్య, శ్రీకాంత్, రావు రమేష్, రేవతి, ప్రియదర్శి
నిర్మాణ సంస్థ: వారాహి చలన చిత్రం
సంగీతం: వివేక్ సాగర్
ఛాయాగ్రహణం: నికేత్
కథ: డేవిడ్
డైలాగ్స్: అబ్బూరి రవి
నిర్మాతలు: సాయి కొర్రపాటి & రజని కొర్రపాటి
కథనం-దర్శకత్వం: కృష్ణ
యూజర్ రేటింగ్: 2.75/5
నాగచైతన్య కెరీర్ ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోంది. మనం, ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలు చైతూ కథానాయకుడిగా ఎదగడానికి దోహదం చేశాయి. కాకపోతే.. చైతూకి లవ్ స్టోరీలే ఎక్కువ సూట్ అవుతాయి. కానీ... చైతూకి మాస్ హీరోగా మారాలని, మాస్ ఇమేజ్ తెచ్చుకోవాలని ఆరాటం. ఆ దారిలో వెళ్లి చేసిన ఏ సినిమా సరిగా వర్కవుట్ కాలేదు. అయినా సరే... మరో ప్రయత్నం చేశాడు. `యుద్దం శరణం`తో. తన స్నేహితుడు కృష్ణకి దర్శకుడిగా ఛాన్స్ ఇచ్చి చేసిన ఈ ప్రయత్నం... చైతూకి ఎలాంటి ఫలితాన్ని ఇచ్చింది? మాస్ హీరోగా మెప్పించాడా? ఈ సినిమా ఎవరికి నచ్చుతుంది??
* కథ...
మురళీ కృష్ణ (రావు రమేష్) సీతాలక్ష్మీ (రేవతి) భార్యాభర్తలు. ఇద్దరూ డాక్టర్లే. వీళ్ల అబ్బాయి అర్జున్ (నాగచైతన్య). తన కుటుంబం అంటే తనకు చాలా ఇష్టం. మంచి ఉద్యోగం వచ్చినా.. దాన్ని వదిలేసి, ఏదో చేయాలన్న తపనతో డ్రోన్ కెమెరాతో ప్రయోగాలు చేస్తుంటాడు. ఇంతలో అంజలి (లావణ్య) పరిచయం అవుతుంది. ఆమెని చూడగానే ప్రేమలో పడతాడు అర్జున్. అంజలి విషయం ఇంట్లో చెప్పాలనుకొనేలోగా... ఒక్కసారిగా అర్జున్ జీవితం తలకిందులవుతుంది. అమ్మానాన్న కనిపించకుండా పోతారు. తీరా చూస్తే... ఆ ఇద్దరూ యాక్సిడెంట్‌లో చనిపోయారన్న నిజం తెలుస్తుంది. అయితే అది యాక్సిడెంట్ కాదని, ఎవరో కావాలనే వాళ్లను చంపేశారని అర్జున్ కి అనుమానం వస్తుంది. సీతాలక్ష్మి, మురళీకృష్ణల్ని ఎవరు చంపారు..? నాయక్ (శ్రీకాంత్) అనే క్రిమినల్‌కీ ఈ హత్యలకు ఉన్న సంబంధం ఏమిటి? తలిదండ్రుల్ని చంపిన వాళ్లపై అర్జున్ ఎలా ప్రతీకారం తీర్చుకొన్నాడు?? అనేదే కథ.
* నటీనటులు..
నాగచైతన్యని పక్కింటి కుర్రాడిగా చూపిద్దామనుకొన్నాడు దర్శకుడు. అందుకే... హీరోయిజం కూడా సైడ్ అయిపోయింది. ఉన్నంతలో చైతూ ఈ కథని, తన పాత్రని నిలబెట్టడానికే ప్రయత్నించాడు. కానీ కథనం బలంగా లేకపోవడంతో తన శ్రమ ఫలించలేదు.
శ్రీకాంత్ ని ఓ కొత్త పాత్రలో చూస్తారిందులో. తానూ.. ఏదో చేయాలని చూసినా, ఆ పాత్ర కూడా బలంగా లేకపోయింది. శ్రీకాంత్‌ని ప్రతినాయకుడిగా చూపించాలనుకోవడంలో ఉద్దేశం మంచిదే.కానీ.. అందుకు తగిన పాత్ర కూడా రాసుకోవాలిగా.
లావణ్య త్రిపాఠి ఓ పాటలో హాట్ హాట్‌గా కనిపించింది. సెకండాఫ్‌లో ఆ పాత్రకు సరైన ప్రాధన్యం లేకుండా పోయింది. రేవతి, రావురమేష్.. తమ అనుభవాన్ని రంగరించారు.
* విశ్లేషణ...
ఈ సినిమా చూస్తున్నంతసేపూ... సాహసం శ్వాసగా సాగిపో గుర్తొస్తే అది ప్రేక్షకుల తప్పు కాదు. అందులోనూ, ఇందులోనూ ఉన్నది సేమ్ పాయింట్. ఒకే పాయింట్‌తో రెండు సినిమాలు రావడం తప్పు కాదు. కానీ ఆ రెండు సినిమాలూ ఒకే హీరో చేయడం, తొలి సినిమా బాల్చీ తన్నేసినా, అదే పాయింట్‌ని నమ్ముకోవడం ఆశ్చర్యం కలిగిస్తాయి. డ్రోన్ కెమెరా.. ఆ సహాయంతో హీరో మైండ్ గేమ్‌ని వాడి పగ తీర్చుకోవడం మినహా ఈ కథలో కొత్తదనం లేదు. కొత్త కథలు ఎవ్వరూ ఎక్స్‌పెక్ట్ చేయడం లేదు. కనీసం తీతలో అయినా కొత్తగా ఉంటే బాగుంటుందని భావిస్తున్నారు. కానీ.. అదీ ఈ సినిమాలో మిస్ అయ్యింది. ఫస్టాఫ్ ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్ స్టోరీలతోనే సరిపెట్టాడు దర్శకుడు. తనపై గౌతమ్ మీనన్ ప్రభావం చాలా ఉందనుకొంటా. సేమ్ టూ సేమ్ ఆయన స్టైల్‌ని ఫాలో అయిపోయాడు. ఇంట్రవెల్‌కి ముందు కథ గాడిలో పడుతుంది. తల్లిదండ్రుల హత్య, నాయక్ క్రూరత్వం, అర్జున్ ప్రతీకారం సెకండాఫ్‌కి లీడ్‌గా మారాయి. కథానాయకుడు విలన్‌పై ప్రతీకారం తీర్చుకొంటాడని ప్రతీ ప్రేక్షకుడూ గ్రహిస్తాడు. కానీ అదెలా? అనేదే కీ పాయింట్. దాన్ని ఆసక్తిగా, ప్రేక్షకుడి ఇగో సంతృప్తి పడేలా తీర్చిదిద్దాల్సిన బాధ్యత దర్శకుడిదే. కానీ... ఈ విషయంలోనూ దర్శకుడు మెప్పించలేకపోయాడు. హీరో - విలన్ల మైండ్ గేమ్‌లో ఒకట్రెండు సన్నివేశాలు బాగానే ఉంటాయి. అదే టెంపో సినిమా మొత్తం కొనసాగించడంలో పూర్తిగా విఫలం అయ్యాడు దర్శకుడు. దీన్నో యాక్షన థ్రిల్లర్ గా మలచాలని చూసిన దర్శకుడు కేవలం రివైంజ్ స్టోరీగానే నడిపించగలిగాడు. అదీ చప్పగా. క్లైమాక్స్ దృశ్యాలు మరీ రొటీన్‌గా సాగిపోయాయి.
* సాంకేతిక వర్గం..
ఇలాంటి కథలకు బలమైన కథనం అవసరం. ప్రేక్షకుడ్ని సీటు అంచున కూర్చోబెట్టేలా సన్నివేశాలు రాసుకోవాలి. ఈ విషయంలో దర్శకుడు పూర్తిగా విఫలం అయ్యాడు. కృష్ణకు ఇదే తొలి సినిమా. ఆ అనుభవ లేమి స్పష్టంగా కనిపిస్తుంది. కథ, కథనాల విషయంలో తప్పు చేసి, దర్శకుడిగా తేలిపోతే ఆ సినిమా ఇంకెలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పాటలకు అంతగా ప్రాధాన్యం లేదు. నేపథ్య సంగీతం మాత్రం బాగుంది.
* ప్లస్ పాయింట్స్
+ నాగచైతన్య
+ లవ్ ట్రాక్
* మైనస్ పాయింట్స్
- కథ, కథనం
- రొటీన్ సన్నివేశాలు
* ఫైనల్ వర్డిక్ట్: సాహసం స్వాసగా.. మరోసారి చూసుకో
రివ్యూ బై శ్రీ