నటీనటులు : తేజ సజ్జా, దక్ష నగర్కర్, రఘు బాబు, ఆనందీ, గెటప్ శ్రీను తదితరులు
దర్శకత్వం : ప్రశాంత్ వర్మ
నిర్మాతలు : రాజ్ శేఖర్ వర్మ
సంగీతం : మార్క్ కె రాబిన్
సినిమాటోగ్రఫీ : అనిత్
ఎడిటింగ్ : సాయి బాబు
రేటింగ్: 2.75/5
జాంబి జోనర్ కథలు హాలీవుడ్ సినీ ప్రియులకు సుపరిచితమే. మనుషుల్ని కొరుక్కుతినే జాతి జాంబీ. అలా కొరికితే.. వాళ్లు కూడా జాంబీలు గా మారిపోతారు. అలా... ఒకరి నుంచి ఒకరు, ఆ తరవాత.. ఊరంతా జాంబీలే. ఇదీ.. జాంబి జోనర్ స్పెషాలిటీ. హారర్ సినిమాలకు ఓ మెట్టు పైన ఉన్న జోనర్ ఇది. హాలీవుడ్ లో ఎప్పుడో వచ్చేసింది. తెలుగులో మాత్రం `జాంబి రెడ్డి`తో జాంబి కథలకు అంకురార్పణ జరిగిందనుకోవాలి. `అ`, `కల్కి` లాంటి వెరైటీ సినిమాలు తీసిన ప్రశాంత్ వర్మ... మరి ఈ జోనర్ ని ఎలా డీల్ చేశాడు? తెలుగు ప్రేక్షకులకు ఈ జాంబీ కథ నచ్చుతుందా? లేదా?
* కథ
మారియో (తేజా సజ్జా) వీడియో గేమర్. అంటే.. వీడియో గేముల్ని రూపొందిస్తుంటాడు. తన స్నేహితులతో కలిసి డిజైన్ చేసిన ఓ గేమ్.. బాగా పాపులర్ అవుతుంది. కానీ అంతలోనే.. అవరోధాలు ఎదురవుతాయి. ఆ గేమ్ లో కొన్ని అవాంతరాలొస్తాయి. వాటిని సాల్వ్ చేయాలంటే... స్నేహితుడైన కల్యాణ్ (హేమంత్) సహాయం కావాలి. కానీ కల్యాణ్‌కి పెళ్లి కుదురుతుంది. తనకి కర్నూల్ లో పెళ్లి. అందుకే.. మారియో తన స్నేహితులతో కలిసి కర్నూలు బయలుదేరతాడు. అక్కడ... కరోనాకి వాక్సిన్ కనిపెట్టడానికి ప్రయోగాలు చేస్తున్న ఓ సైకో సైంటిస్ట్ ఉంటాడు. తన ప్రయోగాలు వికటించడంతో.. జాంబీలు పుట్టుకొస్తుంటారు. చివరికి ఊరు ఊరంతా జాంబీలుగా మారిపోతారు. ఆ జాంబీల నుంచి హీరో, తనని తాను రక్షించుకుంటూ, స్నేహితుల్ని ఎలా రక్షించాడన్నది అసలు కథ.
* విశ్లేషణ
`గో కరోనా.. గో కరోనా గో..గో` అనే పాటతో ఈ సినిమా మొదలవుతుంది. అందుకే.. ఇది కరోనా కథేమో అనుకుంటారంతా. కానీ... అటూ ఇటూ టర్న్ తీసుకుని జాంబీల వరకూ వెళ్తుంది. కథని ప్రారంభించిన విధానం స్లోగా ఉంది. హీరో కర్నూలు వెళ్లి, పెళ్లిని ఆపడానికి ప్రయత్నించడం.. వరకూ మామూలు ఫ్యాక్షనిస్టు కథలానే సాగుతుంది. అయితే.. హీరో స్నేహితుల్లో ఒకడు జాంబీగా మారడం దగ్గర్నుంచి అసలు ఆట ఆరంభం అవుతుంది. ఇంట్రవెల్ సమాయానికి ఊరంతా జాంబీల మయం అయిపోతుంది. మధ్యమధ్యలో కొన్ని కామెడీ బిట్లు, విలన్ ఇంటి నుంచి.. హీరో తప్పించుకునే యాక్షన్ ఘట్టం... ఇవి కాస్త రక్తి కట్టించడంతో.. ఫస్టాఫ్ పాస్ అయిపోతుంది.
ద్వితీయార్థంలో రెండు విషయాలున్నాయి. ఒకటి జాంబీల నుంచి హీరో తప్పించుకోవడం, వాటికి విరుగుడు కనుక్కోవడం. జాంబీ కథ అనగానే.. ఒళ్లు గగుర్పాటుకి గురి చేసే సన్నివేశాలుంటాయని ముందే ఫిక్సవ్వడం సహజం. అలాంటి సీన్లు కొన్ని ఉన్నాయి. అయితే.. వాటి తో పాటు వినోదాన్ని, థ్రిల్లింగ్ నీ మిక్స్ చేస్తూ.. బాలెన్స్ చేయగలిగాడు. సన్నివేశం నుంచే వినోదం పుట్టుకొస్తుంది, తప్ప ప్రత్యేకంగా కామెడీ కోసం వెకిలి వేషాలు వేయలేదు. దర్శకుడి చేతిలో ఉన్న పరిధి చాలా చిన్నది. ఎంత తిరిగినా జాంబీల చుట్టూనే తిరగాలి. అక్కడక్కడ తిరుగుతూ ఉన్నా... బోర్ కొట్టించకుండా చేశాడు. అలాగని మరీ జాంబీల చుట్టూనే కథ నడిపి విసిగెత్తించలేదు. అన్ని విషయాల్నీ బాలెన్స్ చేసుకున్నాడు.
దర్శకుడు స్క్రిప్టు పకడ్బందీగా రాసుకున్నాడు. హీరోయిన్ పాత్రని సాధారణంగా పరిచయం చేసినా.. ఓ ట్విస్టు జోడించడం బాగుంది. అలానే.. ఈ జాంబీలకు విరుగుడు మంత్రం.. దైవం చేతిలో ఉంది అని చూపించి.. అన్ని వర్గాల్నీ సంతృప్తి పరచగలిగాడు. క్లైమాక్స్ కి ముందు రక్తపాతం ఎక్కువైనట్టు కనిపించినా, చివర్లో.. హ్యాపీ ఎండింగ్ తో.. ఇంటికి పంపించాడు.
* నటీనటులు
ఓ బేబీతో పూర్తి స్థాయి పాత్రలకు షిఫ్ట్ అయిన తేజా సజ్జాకు హీరోగా తొలి సినిమా. హీరోయిజం అనేగానే కొన్ని ఎలివేషన్లు ఆశిస్తారు. అలాంటివి ఇస్తూనే, పరిధి దాటకుండా జాగ్రత్త పడ్డాడు. తన డైలాగ్ డెలివరీ,,హావ భావాలూ బాగున్నాయి. హీరోయిన్ కూడా.. ఓకే అనిపిస్తుంది. రాయలసీమ యాసలో... డైలాగులు బాగానే పలికింది. హీరో స్నేహితుల బ్యాక్, గెటప్ శ్రీను, హర్షవర్థన్... వీళ్లంతా నవ్వించే ప్రయత్నం చేశారు.
* సాంకేతిక వర్గం
టెక్నికల్ గా ఈ సినిమా బాగుంది. గుడి నేపథ్యంలో సాగే సన్నివేశాల్ని బాగా తీశారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా పెద్ద ప్లస్ పాయింట్. గో కరోనా.. పాట కరోనా రోజుల్ని గుర్తుకు తెచ్చింది. ప్రశాంత్ వర్మలో టాలెంట్ వుంది. ఆ సంగతి ఆ సినిమాతోనే అర్థమైంది. జాంబీ జోనర్ మనకు కొత్త అయినా.. అందరికీ నచ్చేలా తీయగలిగాడు. రాబోయే రోజుల్లో తెలుగు తెరపై మరిన్ని జాంబీ కథలు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
* ప్లస్ పాయింట్స్
జాంబీ జోనర్
వినోదం
సాంకేతిక వర్గం
* మైనస్‌పాయింట్స్
రక్తపాతం
ఫైనల్ వర్డిక్ట్: జుంబారే.. జాంబీ