బుల్లి తెర నటులు, యాంకర్లు... వెండి తెరపైకి రావడం కొత్తేం కాదు. ఇది వరకూ చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ ఎవ్వరూ సక్సెస్ కాలేదు. అనసూయ లాంటి ఒకరిద్దరు మాత్రమే ఇక్కడ కూడా నెగ్గుకు రాలేదు. మేల్ యాంకర్ల సంగతి సరేసరి. అయితే ఇప్పుడు మరో కుర్ర యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ప్రదీప్‌కి నటన కొత్త కాదు. వరుడు, అత్తారింటికి దారేది లాంటి చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేశాడు.
అయితే అప్పట్లో తననెవరూ గుర్తు పట్టలేదు. కానీ ఇప్పుడు టీవీలో తను ఓ స్టార్. కాబట్టి.. తన సినిమా వస్తుందంటే ఆసక్తి పెరుగుతుంది. అలా అందరి దృష్టినీ తన వైపుకు తిప్పుకున్న సినిమా `30 రోజుల్లో ప్రేమించడం ఎలా`. ఈ శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రదీప్ తొలి సినిమా కావడం వల్లో.... నీలీ నీలీ ఆకాశం లాంటి సూపర్ హిట్ పాట ఉండడం వల్లో.. తెలీదు గానీ, ఈ సినిమాపై బయ్యర్లు ఆసక్తి కనబరిచారు.
తెలంగాణలో కోటిన్నరకు ఈ సినిమా రైట్స్ అమ్ముడయ్యాయి. ఆంధ్ర నుంచి 2.1 కోట్లు.. సీడెడ్ నుంచి 55 లక్షలు వచ్చాయి. మొత్తానికి 4.3 కోట్ల బిజినెస్ చేసింది. మేకింగ్ కి కూడా దాదాపుగా అంతే అయినట్టు టాక్. ఇప్పటికైతే నిర్మాతలు సేఫ్. బయ్యర్లూ సేఫ్ గా ఉండాలంటే.. ఈ సినిమాకి హిట్ టాక్ రావాల్సిందే.