ఈ రోజుల్లో సినిమా చిన్నదైనా, పెద్దదైనా - పబ్లిసిటీ తప్పనిసరి. స్టార్లున్న సినిమాలకు ఓ స్థాయిలో పబ్లిసిటీ చేస్తారు. నిజానికి చేసినా, చేయకపోయినా ఆయా సినిమాలపై జనం దృష్టి తప్పకుండా ఉంటుంది. చిన్న సినిమాల పరిస్థితేంటి? `మేం సినిమా చూశాం.. మీరు చూడాల్సిందే` అంటూ ప్రచారం చేయాల్సిందే. కొత్త వాళ్లతో సినిమాలంటే ప్రేక్షకులు ముందే లైట్ తీసుకుంటున్నారు. అలాంటప్పుడు ఎంత ప్రచారం చేయాలో కదా? కానీ అలాంటి ప్రచారం ఏం లేకుండానే ఓ సినిమా వచ్చేస్తోంది. అదే. `ఆకాశవాణి`.
రాజమౌళి శిష్యుడు అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహించిన చిత్రమిది. సముద్రఖని ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. కీరవాణి తనయుడు కాలభైరవ సంగీత దర్శకుడు. బుర్రా సాయిమాధవ్ సంభాషణలు అందించారు. నిజానికి మంచి ప్యాడింగే ఉంది. పైగా రాజమౌళి కాంపౌండ్ సహాయ సహకారాలు పుష్కలంగా ఉన్నాయి. అలాంటప్పుడు ఎంత పబ్లిసిటీ చేసుకోవాలి? కానీ ఈ సినిమానిసైలెంట్ గా ఈనెల 24న ఓటీటీలోకి వదిలేశారు. సోనీ లో ఈ సినిమా ప్రసారం కానుంది. ఎంత ఓటీటీ సినిమా అయినా ఎంతో కొంత ప్రమోషన్ ఉండాలి కదా. అదేం లేకుండా ఈ సినిమాని విడుదల చేయడం చిత్రసీమనే ఆశ్చర్యపరుస్తోంది. నిజంగా ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేయాలనుకున్నారు. చివరి క్షణాల్లో ఓటీటీకి ఇచ్చేశారు. మన డబ్బులు మనకు వచ్చేశాయ్. ప్రమోషన్లు ఎందుకు? అని లైట్ తీసుకున్నారో ఏమిటో?