మరో వారం రోజుల్లో ఆచార్య వచ్చేస్తోంది. అయితే.. ప్రమోషన్ల హడావుడి మాత్రం పెద్దగా కనిపించడం లేదు. శనివారం ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరుగుతుంది. సోమవారం నుంచి ప్రెస్ మీట్లూ, ఇంటర్వ్యూలు.. మొదలవుతాయి. ఎంత హడావుడి చేసినా ఈ వారం రోజులే. చిరంజీవి లాంటి హీరో సినిమాకి ఇదేనా పబ్లిసిటీ అని కొంతమంది పెదవి విరుస్తున్నారు. అయితే.. ఈ పబ్లిసిటీ వెనుక.. ఓ స్ట్రాటజీ ఉందట.
ఈ సినిమాపై ఎక్కువగా మాట్లాడి, అనవసరంగా హైప్ పెంచకూడదని చిత్రబృందం భావిస్తున్నట్టు టాక్. `మా సినిమాలో ఇదుంది.. అది ఉంది.. ఇంత గొప్పగా ఉంటుంది` అని డబ్బా కొట్టుకోకుండా... ఆడియన్స్ లో ఉన్న అంచనాల్ని ఇంకేమాత్రం పెంచకుండా.. తక్కువ అంచనాలతోనే థియేటర్లకు రావాలని... అప్పుడు సినిమా ఇంకా బాగా నచ్చుతుందని చిరు అండ్ కో భావిస్తోందట. అందుకే.. ఇప్పటి వరకూ ఈ సినిమా గురించి అటు చిరు గానీ, ఇటు కొరటాల గానీ ఎక్కువ మాట్లాడలేదు. ఎంత చెప్పాలో, అంఏత చెబుతున్నారు. కథ గురించి డిటైలింగ్‌లోకి వెళ్లడం లేదు.
మరోవైపు.. ఆచార్య సెన్సార్ కార్యక్రమాల్ని పూర్తి చేసుకుంది. సినిమా బాగుందని, ఫస్టాఫ్ తో పోలిస్తే... సెకండాఫ్ కి ఎక్కువ మార్కులు పడతాయన్నది సెన్సార్ రిపోర్ట్. సినిమాకి కావల్సింది అదే.. ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ బాగుండాలి. అప్పుడే హిట్టు. ఆ లెక్కన ఆచార్య హిట్టు కొట్టినట్టే.