చిరుకి కరోనా సోకిన విషయం తెలిసిందే. అయినప్పటికీ `ఆచార్య` టీమ్ చిరంజీవి లేకుండానే ఇతర క్యాస్ట్ తో షూటింగ్ పునఃప్రారంభించారు. చిరు కనీసం నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే.. నెల వరకూ.. ఆచార్య షూటింగ్ లో ఆయన పాల్గొనే అవకాశాలు లేవు. ఆ తరవాత కూడా ఆయన మూడ్ ని బట్టి.. షూటింగ్ ఉంటుంది. `ఫర్లేదులే..` అనుకుంటే.. డిసెంబరు ద్వితీయార్థంలో షూటింగ్ మొదలెడతాడు. కాదనుకుంటే.. జనవరి వరకూ ఈ ఊసే ఉండదు.
2021 వేసవికి ఈ చిత్రాన్ని విడుదల చేద్దామనుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యమయ్యేట్టు కనిపించడం లేదు. ఎందుకంటే ఈ సినిమాలో చిరు - చరణ్ ఎపిసోడ్లు చాలా కీలకం. చిరు అందుబాటులోకి వచ్చినా, ఆ సమయంలో `ఆర్.ఆర్.ఆర్` షూటింగ్ తో చరణ్ బిజీ అయిపోతే... `ఆచార్య` అటకెక్కినట్టే. అందుకే ఈ సినిమా విడుదల కూడా వాయిదే పడే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. సమ్మర్ మిస్సయితే.. దసరాకే రావాలి. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కాజల్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు.