ఓ పాటపై హక్కు ఎవరిది అన్నది ఎప్పటికీ ప్రశ్నార్థకమే. పాటకు ట్యూన్ కట్టేది సంగీత దర్శకుడు. కట్టినందుకు డబ్బులు ఇచ్చేది నిర్మాత. ఆ నిర్మాతేమో ఆడియో కంపెనీకి హక్కుల్ని అమ్ముకుంటాడు. అలాంటప్పుడు ఆ పాటపై అధికారం ఎవరిది? అనేది ఎలా తేలుతుంది..? అందుకే ఓ పాటని రీమిక్స్ చేసినప్పుడు దానికి అందుకున్న పారితోషికం ఎవరికి ఇవ్వాలన్నది పెద్ద ప్రశ్న.
ఇప్పుడు `సిటీమార్` విషయంలోనూ అదే తలెత్తింది. `డీజే` సినిమాలోని సూపర్ హిట్ సాంగ్.. సిటీమార్. ఈ పాటని. రాధే కోసం రీమిక్స్ చేశారు. అందుకోసం డీఎస్‌పీకి భారీ పారితోషికం దక్కిందని సమాచారం. అయితే ఈ పారితోషికం లో తమకూ వాటా రావాలని ఆదిత్య మ్యూజిక్ సంస్థ డిమాండ్ చేస్తోందని తెలుస్తోంది. డీజే ఆడియో రైట్స్ ని అప్పట్లో భారీ మొత్తానికి కొనుగోలు చేసింది ఆదిత్య. అందుకే... వాటా కావాలని అడుగుతోందట. దేవి మాత్రం ఈ రూపంలో అందిన డబ్బుని తన జేబులో వేసుకున్నాడు. ఈ విషయమై ఆదిత్య కంపెనీకీ, దేవిశ్రీ ప్రసాద్ కీ మధ్య వివాదం నడుస్తోందని, హక్కుల విషయంలో డీఎస్‌పీ తమని మోసం చేశాడని ఆదిత్య కంపెనీ అభియోగం చేస్తోందని సమాచారం. మరి ఈ వివాదం ఎప్పటికి తెగుతుందో?