వెర్సటైల్ హీరో అడివి శేష్ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నారు. ఆయన బాలీవుడ్‌కు పరిచయం అవుతున్న ప్యాన్ ఇండియా మూవీ ‘మేజర్’. గూఢచారి ఫేమ్ శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్న ‘మేజర్’ చిత్రంలో ఎన్‌ఎస్‌జీ(నేషనల్ సెక్యూరిటీ గార్డు) కమాండో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో కనిపించనున్నారు అడివి శేష్.
తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో మేజర్ చిత్రాన్ని ఈ ఏడాది జూన్ 2న విడుదల చేయనున్నట్లు గతంలో చిత్రయూనిట్ ప్రకటించారు. కానీ ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ‘మేజర్’ సినిమా థియేట్రికల్ విడుదలను వాయిదా వేస్తున్నట్లు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది.
‘‘కోవిడ్ సేకండ్ వేవ్ కారణంగా దేశవ్యాప్తంగా పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. కోవిడ్ నియమ నిబంధలను పాటిస్తూ అందరూ జాగ్రత్తగా ఉంటున్నారని మేం అనుకుంటున్నాం. అలాగే జాగ్రత్తగా ఉండమని కోరుకుంటున్నాం. మా ‘మేజర్’ సినిమాను ప్రపంచవ్యాప్తంగా జూన్ 2న విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించడం జరిగింది. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ‘మేజర్’ సినిమా థియేట్రికల్ రిలీజ్‌ను వాయిదా వేస్తున్నాం. ప్రస్తుత కోవిడ్ పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత ‘మేజర్’ సినిమా కొత్త విడుదల తేదీని త్వరలో అధికారికంగా ప్రకటిస్తాం. దయచేసి విధిగా మాస్కులు ధరించండి. కోవిడ్ నియమనిబంధనలను, నియంత్రణ చర్యలను తప్పక పాటించండి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.