ఐశ్వర్యా రాయ్ పేరు మళ్లీ తెలుగులో మార్మోగిపోయే సమయం వచ్చిందనిపిస్తోంది. అప్పుడెప్పుడో 'జీన్స్' సినిమాలో ఐశ్వర్యారాయ్ డబుల్ రోల్‌లో కనిపించి తెలుగు ఆడియన్స్‌ని మురిపించింది. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత తెలుగు తెరపై ఐశ్వర్యా రాయ్‌ని చూసే అవకాశం వచ్చింది. ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఓ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని రూపొందిస్తున్నారు. భారీ తారాగణంతో, భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న చిత్రమిది.
ఈ సినిమాలో ఐశ్వర్యా రాయ్‌తో పాటు, చాలా మంది తెలుగు, తమిళ, హిందీ భాషల నుండి ప్రముఖ తారాగణం కీలక పాత్రలు పోషిస్తోంది. ఇంతకీ ఎవరా తారాగణం అంటే, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, సౌత్ క్వీన్ నయనతార, 'మహానటి' కీర్తిసురేష్, జయం రవి, కార్తి, విక్రమ్, కట్టప్ప సత్యరాజ్ తదితరులు. 'పొన్నియన్ సెల్వన్' అనే నవల ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఐశ్వర్యారాయ్‌ది అత్యంత కీలక పాత్ర అని తెలుస్తోంది. అంతేకాదు, అప్పటిలాగే మళ్లీ ఐశ్వర్యా డబుల్ రోల్‌తో సందడి చేయనుంది. పొన్నియన్ సెల్వన్ అనే నవలలో రాణి నందిని, మందాకినీ అనే తల్లీ కూతుళ్ల పాత్రలున్నాయి. ఆ రెండు పాత్రలను ఐశ్వర్యతోనే చేయిస్తున్నాడు డైరెక్టర్ మణిరత్నం.
ఆ రెండు పాత్రలు సినిమాకి అత్యంత కీలకమట. వాటిలో తల్లి మందాకిని పాత్ర మరింత ప్రాధాన్యత సంతరించుకోదగ్గదనీ తెలుస్తోంది. మందాకిని పాత్ర ఎలా ఉండబోతోందంటే, మూగరాణి పాత్ర అనీ తెలుస్తోంది. అంటే ఐశ్వర్యా రాయ్ నటించబోయే పాత్ర కూడా అదే. ప్రస్తుతం అనుష్క 'నిశ్శబ్ధం' సినిమా కోసం మూగ ఆర్టిస్టు 'సాక్షి' పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. అలాంటి పాత్రలోనే తాజా సినిమాలో ఐశ్వర్యా రాయ్ కనిపించనుందన్న మాట. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. భారీ నుండి అతి భారీ అంచనాలతో తమిళ, తెలుగు, హిందీ, తదితర భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.