ఏజెంట్ మూవీ రివ్యూ & రేటింగ్‌

మరిన్ని వార్తలు

చిత్రం: ఏజెంట్
నటీనటులు: అఖిల్, మమ్ముట్టి, సాక్షి వైద్య
దర్శకత్వం: సురేందర్ రెడ్డి
 

నిర్మాత: రామబ్రహ్మం సుంకర
సంగీతం: హిప్ హాప్ తమిజా
ఛాయాగ్రహణం: రసూల్ ఎల్లోర్
కూర్పు: నవీన్ నూలి
 

బ్యానర్: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌
విడుదల తేదీ: 28 ఏప్రిల్ 2023

ఐక్లిక్ మూవీస్ రేటింగ్‌: 2/5
 

అక్కినేని కుటుంబం నుంచి వ‌చ్చిన మ‌రో హీరో అఖిల్‌. చూడ్డానికి బాగుంటాడు. డాన్సులు బాగా చేస్తాడు. న‌ట‌న కూడా ఓకే. చేతిలో అన్న‌పూర్ణ స్టూడియోస్ లాంటి ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ ఉంది. ఇండ‌స్ట్రీలో బోలెడ‌న్ని ప‌రిచ‌యాలు ఉన్నాయి. కానీ ఏం లాభం..?  త‌న‌కి స‌రైన హిట్ లేదు. తొలి సినిమా అఖిల్ నుంచీ.. అఖిల్ దండ‌యాత్ర కొన‌సాగుతూనే ఉంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ ఓకే అనిపించింది కానీ, త‌న‌ని పూర్తి స్థాయిలో సంతృప్తి పరిచిన సినిమా అయితే కాదు. ఇప్పుడు ఏజెంట్ తో మ‌రోసారి త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోవ‌డానికి ముందుకొచ్చాడు. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌కుడు అవ్వ‌డం, అఖిల్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ సినిమా కావ‌డంతో... ఈ సినిమాపై అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. దానికి తోడు పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని విడుద‌ల చేద్దామ‌నుకొన్నారు. మ‌రి... ఏజెంట్ ఏం చేశాడు?  అఖిల్ పై అభిమానులు పెట్టుకొన్న న‌మ్మ‌కాలు ఈసారైనా నిజ‌మ‌య్యాయా, లేదా?


క‌థ‌: రిక్కీ (రామ‌కృష్ణ‌) కి రా ఏజెంట్ అవ్వాల‌ని కోరిక‌. చిన్న‌ప్ప‌టి నుంచీ... అదే ధ్యాస‌లో ఉంటాడు. ప‌రీక్ష‌లు కూడా రాస్తాడు. కానీ ఇంట‌ర్వ్యూలో మాత్రం ఫెయిల్ అవుతాడు. చివ‌రికి.. రా సిస్ట‌మ్‌ని హ్యాక్ చేసి, రా చీఫ్ మ‌హ‌దేవ్ (మ‌మ్ముట్టి) దృష్టిలో ప‌డ‌తాడు. అప్ప‌టికే మ‌హ‌దేవ్ ఓ మిష‌న్‌లో త‌ల‌మున‌క‌లై ఉంటాడు. రాలో ప‌ని చేసి, ఇప్పుడు రాకి వ్య‌తిరేకంగా ప‌నిచేస్తున్న గాడ్ అలియాస్ ధ‌ర్మ‌ని అడ్డుకోవ‌డ‌మే ఈ మిష‌న్. ఆ మిష‌న్‌లో రిక్కీని భాగ‌స్వామిగా చేస్తాడు. మ‌రి ఈ మిష‌న్‌లో రిక్కీకి ఎలాంటి ప్ర‌తికూల ప‌రిస్థితులు ఎదుర‌య్యాయి?  ఇంత‌కీ గాడ్ ఎవ‌రు?  త‌ను ఎందుకు `రా`కి వ్య‌తిరేకంగా మారిపోయాడు?  ఇవ‌న్నీ తెలియాలంటే `ఏజెంట్‌` చూడాల్సిందే.


విశ్లేష‌ణ‌: యాధృచ్చిక‌మో, ఏమో తెలీదు కానీ, ఇటీవ‌ల వ‌చ్చిన ప‌ఠాన్ సినిమాకీ, ఏజెంట్ కీ క‌థ‌లో కొన్ని ద‌గ్గ‌ర పోలిక‌లు ఉన్నాయి. ఇద్ద‌రూ ఒకే హాలీవుడ్ సినిమా చూసి ఇన్‌స్పైర్ అయ్యారో, లేదంటే... ఒకేలా ఆలోచించారో తెలీదు కానీ, రెండు క‌థ‌ల మెయిన్ థీమ్ మాత్రం ఒక్క‌టే. ప‌ఠాన్ బాలీవుడ్ లో రికార్డులు బ‌ద్ద‌లు కొట్టింది. కానీ... ఏజెంట్ మాత్రం పూర్తిగా తేలిపోయాడు. రా క‌థ‌ల్లో యాక్ష‌న్‌కి పెద్ద పీట వేస్తారు. కాక‌పోతే.. క‌థ‌లో మ‌లుపులు ఆక‌ట్టుకొనేలా ఉంటాయి. ప‌ఠాన్ లో కూడా కొన్ని మ‌లుపులు షాక్ ఇస్తాయి. ఏజెంట్ క‌థ‌ల్లో అవే కీల‌కం. కానీ.. ఆ ట్విస్టులు ఏజెంట్ లో అస్స‌లు క‌నిపించ‌వు.


హీరో అడ్డుకొనే మిష‌న్... ఎంత భ‌యంక‌ర‌మైన‌దో చూపించి, ఆ త‌ర‌వాత‌.. ఆ మిష‌న్ ని హీరో ఎలా అడ్డుకొన్నాడో చూపించ‌డం... ఇలాంటి క‌థ‌ల్లో స్వ‌త‌హాగా క‌నిపిస్తుంటాయి. ఏజెంట్ కూడా అంతే. కాక‌పోతే... ఆ మిష‌న్‌, దానిపై హీరో చేసే పోరాటం ఏమాత్రం ఆస‌క్తిని క‌లిగించ‌వు. దేశ‌భ‌క్తిని పెంపొందించే స‌న్నివేశాలు కానీ, తెరపై యాక్ష‌న్ ని చూసి థ్రిల్ అయిపోవ‌డాలు కానీ... ఈ సినిమాలో క‌నిపించ‌వు.


నిజానికి హీరో క్యారెక్ట‌రైజేష‌నే అత‌క‌లేదు. వైల్డ్ గా ప్ర‌వ‌ర్తించ‌డం, మాట్లాడ‌డం హీరో స్వ‌భావం. అది చెప్పుకోవ‌డానికి బాగుంది కానీ, తెర‌పై అందంగా, ఆక‌ర్ష‌ణీయంగా, వినోదంగా తీర్చిదిద్ద‌డంలో మాత్రం సురేంద‌ర్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు. అస‌లు రా ఏజుంట్ కి ఏమాత్రం న‌ప్ప‌ని క్యారెక్ట‌రైజేష‌న్ అది. ఆ క్యారెక్ట‌రైజేష‌న్ వ‌ల్ల వినోదం పుట్టాలి. కానీ.. అది జ‌ర‌గ‌లేదు స‌రిక‌దా, చిరాకు వ‌స్తుంది. పోనీ.. కంటిన్యుటీ అయినా ఉందా, అంటే అదీ లేదు. కొన్నిసార్లు ఆ పాత్ర వైల్డ్ గా ఉంటుంది, ఇంకొన్ని సార్లు బేల‌గా మారిపోతుంది. 


ఇలాంటి క‌థ‌ల్లో ల‌వ్ ట్రాక్ కి చోటు ఉండ‌దు. కానీ అఖిల్ కి ల‌వ్ లేక‌పోవ‌డం ఏమిటి?  అని ద‌ర్శ‌కుడు అనుకొన్నాడేమో?  ఓ హీరోయిన్‌ని తెచ్చిపెట్టాడు. ఆ ల‌వ్ ట్రాక్ బాగున్నా - సినిమాని కాస్తో కూస్తో భ‌రించేవాళ్లు. కానీ.. ఆ ట్రాక్ స‌హ‌జ‌త్వానికి బాగా దూరంగా ఉంది. హీరో ప‌రీక్ష‌లు రాయ‌డం, ఫ‌లానా చోట నాకు పోస్టింగ్ కావాల‌ని, ఎగ్జామ్ పేప‌ర్ లోనే.. డిమాండ్ చేయ‌డం అతిగా అనిపిస్తుంది. అస‌లు రా ప‌నితీరు గురించి ద‌ర్శ‌కుడికి అవ‌గాహ‌న ఉందా, లేదా?  అనేది అంతుచిక్క‌దు. సెకండాఫ్ అయితే క‌థ పూర్తిగా ట్రాక్ త‌ప్పేసింది. ఎక్క‌డెక్క‌డో తిప్పి, ఏదేదో చేసి, చివ‌రికి కంగాళీగా మార్చేశాడు ద‌ర్శ‌కుడు. ఏ సినిమాలో అయినా ఫ్యాన్స్‌కి న‌చ్చేలా కొన్ని మూమెంట్స్ ఉంటాయి. అవి కూడా ఈ సినిమాలో క‌నిపించ‌వు.

 

న‌టీన‌టులు: అఖిల్ ఈ సినిమా కోసం బాగా క‌ష్ట‌ప‌డ్డాడు. కానీ ఫ‌లితం మాత్రం క‌నించ‌లేదు. అస‌లు ఆ క్యారెక్ట‌రైజేష‌నే.. అఖిల్ కి సూట్ కాలేదు. ఈ పాత్ర చేయ‌డానికి త‌న‌కు ఇంకాస్త స‌మ‌యం కావాలి. బిలివ‌బులిటీ క‌ల‌గాలి. అఖిల్ కి ప్రేమ‌క‌థ‌లు చేసే వ‌యసు. త‌న వ‌య‌సుని, ఇమేజ్‌ని మించి సాహ‌సాలు చేయాల‌నుకోవ‌డంతోనే పొర‌పాట్లు జ‌రుగుతున్నాయి.


మ‌మ్మ‌ట్టి క్యారెక్ట‌ర్ ఒక్క‌టే డీసెంట్ గా ఉంది. ఆయ‌నో సూప‌ర్ స్టార్‌. ఈ క్యారెక్ట‌ర్‌ని స‌రిగా హ్యాండిల్ చేస్తే చాలు.. అని సురేంద‌ర్ రెడ్డి అనుకొని ఉంటాడు. అందుకే ఆ పాత్ర చుట్టూ న‌డిచే సీన్లని కాస్త ఇంట్రెస్టింగ్ గా తీర్చిదిద్దుకొన్నాడు. సాక్షి వైద్య చూడ్డానికి బాగుంది. కానీ ఆమె పాత్ర‌ని మ‌లిచిన తీరు బాగోలేదు. ల‌వ్ ట్రాక్ తో ప్రేక్ష‌కుడు క‌నెక్ట్ అవ్వ‌క‌పోతే.. హీరోయిన్ ఎంత అందంగా ఉన్నా ప్ర‌యోజ‌నం ఉండ‌దు. డినో మోరియాని స‌రిగా వాడుకోలేదు. వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ ఉన్నా.. ఉప‌యోగం లేదు.


సాంకేతిక వ‌ర్గం: వ‌క్కంతం వంశీ రాసిన క‌థ ఇది. సురేంద‌ర్ రెడ్డితో వ‌క్కంతం ప‌ని చేసిన సినిమాల్లో క‌థాబ‌లం క‌నిపిస్తుంది. కానీ.. ఏజెంట్ మాత్రం పూర్తిగా పేల‌వ‌మైన క‌థ‌గా మిగిలిపోయింది. క‌థ స‌రిగా లేనప్పుడు టెక్నీషియ‌న్లు మాత్రం ఏం చేస్తారు. పాట‌లు కుర‌ద్లేదు. నేప‌థ్య సంగీతం ఇంకా బాగుండాల్సింది. యాక్ష‌న్ సీన్లు బాగున్నా.. అఖిల్ చేసే అతి వ‌ల్ల అవి కూడా ఎక్క‌వు. సురేంద‌ర్ రెడ్డి స్క్రీన్ ప్లేలో మ‌లుపులు లేవు. సినిమా రిచ్‌గా ఉంది కానీ, కావ‌ల్సిన మూల క‌థ లేక‌పోవ‌డంతో బేల‌గా త‌యారైంది.

 

ప్ల‌స్ పాయింట్స్:
మ‌మ్ముట్టి

మైన‌స్ పాయింట్స్‌:
మిగిలిన‌వ‌న్నీ..


ఫైన‌ల్ వ‌ర్డిక్ట్:  మిస్ ఫైర్‌...


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS