గత నాలుగైదు నెలలుగా సినిమా షూటింగులు అన్నీ ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ మధ్య కొందరు ఫిల్మ్ మేకర్లు తమ సినిమాల షూటింగులు ప్రారంభిస్తున్నారు. అయితే ఇప్పటికీ స్టార్ హీరోలు మాత్రం షూటింగులకు దూరంగానే ఉంటున్నారు. ఇక ఫారెన్ లొకేషన్స్ లో షూటింగ్, విదేశీ షెడ్యూల్స్ గురించి అయితే పూర్తిగా మర్చిపోయారు.
అయితే బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ మాత్రం ధైర్యంగా ముందడుగు వేసి ఫారిన్ లొకేషన్లు షూటింగుకు సిద్ధం అయ్యారు. అక్షయ్ కుమార్ ప్రస్తుతం 'బెల్ బాటమ్' అనే చిత్రంలో నటిస్తున్నారు. 1980ల నేపథ్యంలో జరిగే ఈ సినిమా కథకు నిజ జీవిత సంఘటనలు ఆధారమని నిర్మాతలు అంటున్నారు. థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతున్న ఈ సినిమాకు తాజా షెడ్యూల్ లండన్లో ప్లాన్ చేశారు. 'బెల్ బాటమ్' టీమ్ ఇప్పటికే లండన్ చేరుకుని షూటింగ్ కూడా మొదలుపెట్టారు.
ఈ సందర్భంగా అక్షయ్ కుమార్ ఒక చిన్న వీడియోను తన ట్విటర్ ఖాతా ద్వారా షేర్ చేసి, "లైట్స్ కెమెరా మాస్క్ ఆన్ అండ్ యాక్షన్. కొత్త నిబంధనలు అన్నీ పాటిస్తూ 'బెల్ బాటమ్' షూటింగ్ జరుగుతోంది. ఇది క్లిష్ట సమయం, కానీ పని మాత్రం జరగాల్సిందే. ఈ సందర్భంగా కొంత అదృష్టం, మీ ప్రేమ అవసరం" అంటూ అక్షయ్ కుమార్ ట్వీట్ చేశారు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ సరసన వాణీ కపూర్, హ్యూమా ఖురేషి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈ సినిమాకు రంజిత్ తివారి ఈ చిత్రానికి దర్శకుడు.