బాలీవుడ్ లో అక్షయ్ కుమార్‌కి మంచి క్రేజ్ వుంది. తనో యాక్షన్ హీరో. కామెడీ కూడా బాగా చేస్తాడు. ఎలాంటి పాత్ర అయినా సూటయిపోతుంది. అందుకే `లక్ష్మీ` (కాంచన రీమేక్) లోనూ అక్షయ్ మెప్పిస్తాడని అనుకున్నారు. తీరా చూస్తే.. ఈ సినిమా ఫట్టుమంది. థియేటర్లు మూసి ఉన్న రోజుల్లో.. ఓటీటీలో విడుదలైన లక్ష్మీ - ఏ వర్గాన్నీ మెప్పించలేకపోయింది. కనీసం అక్షయ్ ఫ్యాన్స్ కీ ఈ సినిమా నచ్చలేదు. సరికదా.. అసలు ఈ సినిమా ఎందుకు తీశారు? అనే సరికొత్త అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
కాంచన విడుదలై చాలా కాలం అయ్యింది. దాంతో పాటు ఈ సినిమా డబ్బింగ్ రూపంలో హిందీ ప్రేక్షకుల ముందుకు వెళ్లింది. అయినా ఈ సినిమా రీమేక్ చేశారంటే, కథలో మార్పులూ చేర్పులూ చేసుంటారని అనుకున్నారు.కానీ.. మార్పులకు పెద్దగా సాహసించలేదు లారెన్స్. ఇంత గ్యాప్ తరవాత.. చేసినా పాత కథనీ, స్క్రీన్ ప్లేని ఫాలో అయిపోయారు. పైగా ఈ హారర కామెడీ అక్షయ్ ఇమేజ్ కి ఏమాత్రం సరితూగలేదు. దాంతో ఈ కథని అక్షయ్ ఎలా ఒప్పుకున్నాడా అంటూ అంతా ఆశ్చర్యపోతున్నారు. అక్షయ్ ని బకరా చేశారని వాపోతున్నారు. బకరా చేసింది అక్షయ్ కుమార్ నా? ప్రేక్షకులనా? అనేది ఆలోచిస్తే.. రెండోదే కరెక్ట్ అనిపిస్తుంది. తీసిన సినిమానే మరోసారి తీసి, డబ్బులు వసూలు చేసుకోవాలనుకున్నారు నిర్మాతలు. దానికి వాళ్లే మూల్యం చెల్లించుకోవాల్సివచ్చింది.