వందమంది దోషులు తప్పించుకోవొచ్చు గానీ, ఒక్క నిర్దోషికీ శిక్ష పడకూడదన్నది న్యాయ శాస్త్ర సూత్రం. కానీ అదే జరుగుతోందా? ఎంతో మంది నిర్దోషులు, అమాయకులు... చేయని నేరానికి జైలు జీవితం అనుభవిస్తున్నారు. దోషులు ఎంచక్కా.. బయట దొరల్లా చలామణీ అవుతున్నారు. అలా చేయని నేరానికి జైలు శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీ.. తిరగబడితే ఎలా ఉంటుందో.. చెప్పే కథతో `నాంది` తెరకెక్కుతోంది. అల్లరి నరేష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రధారి. ఈనెల 19న విడుదల అవుతోంది.
ఈరోజు.. మహేష్ బాబు చేతుల మీదుగా ట్రైలర్ విడుదల అయ్యింది. రాజగోపాల్ అనే ఓ వ్యక్తి హత్యకు గురవుతాడు. ఆ నేరం... సూర్య ప్రకాష్ (అల్లరి నరేష్) పై పడుతుంది. `రాజగోపాల్ గారిని నేను మర్డర్ చేయడమేంటి సార్..? ఇప్పటి వరకూ రాజగోపాల్ గారి గురించి వినడం తప్ప.. ఆయన గురించి నాకేం తెలీదు సార్` అంటూ పోలీసుల్ని ఎంత వేడుకుంటున్నా.. తననే దోషిగా పేర్కొంటూ పోలీసులు అతన్ని అరెస్ట్ చేస్తారు. అక్కడి నుంచి.. ఈ కథ మొదలవుతుంది. ``ఇక్కడి చట్టాలు చేతకానివాడిపై వాడడం కోసమే. పవర్‌లో ఉన్నవాడ్ని ఏం పీకలేవు`` అనే పోలీస్ డైలాగుల్లో ఈ కథలోని డెప్త్ అర్థం అవుతుంది. ``ఇండియన్ పీనల్ కోడ్ టార్గెట్ శిక్షలు వేయడం కాదు సూర్య.
న్యాయం చేయడం కూడా`` అంటూ ఓ నిజాయతీ గల లాయర్ (వరలక్ష్మీ శరత్ కుమార్) ఈ కేసుని వాదించడానికి ముందుకొస్తుంది. ``నాకు జైలూ కొత్తా కాదు. హంతకుడు అనే ముద్రా కొత్త కాదు`` అంటూ సూర్య తిరగబడడం ప్రారంభిస్తాడు. చివరికి ఏమైందన్నదే కథ. కోర్టు రూమ్ చుట్టూ నడిచే సన్నివేశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఫొటోగ్రఫీ, లైటింగ్, మేకింగ్, షార్ట్.. ఇవన్నీ ఓ డార్క్ సినిమా చూడబోతున్నామన్న ఫీలింగ్ కలిగిస్తున్నాయి. మొత్తానికి నరేష్ ఏదో ఓ మంచి ప్రయత్నం అయితే చేస్తున్నాడనిపిస్తోంది. చివరి రిజల్ట్ ఎలా ఉంటుందో?