కామెడీ హీరో అల్లరి నరేష్, ఇకపై కథా నేపథ్యం బలంగా వున్న సినిమాల్లోనే నటిస్తానంటున్నాడు. కామెడీ సినిమాల్ని తగ్గించేస్తాడో, పూర్తిగా మానేస్తాడోగానీ, ‘నాంది’ సినిమా ప్రమోషన్ కోసం వచ్చి ఆసక్తికరమైన వ్యాఖ్యలే చేశాడు. తనకు ‘గమ్యం’ లాంటి సినిమాలు ఎంతో మంచి పేరు తెచ్చాయనీ, ఇకపై అలాంటి సినిమాల్లోనే నటిస్తానని అన్నాడు. ‘నాంది’ సినిమా తన కెరీర్‌లోనే చాలా ప్రత్యేకమైన సినిమా అవుతుందని అల్లరి నరేష్ చెబుతున్నాడు. నో డౌట్, అల్లరి నరేష్ మంచి నటుడు.
అయితే, నటనా ప్రతిభను చాటుకోవడం ద్వారా అల్లరి నరేష్‌కి వచ్చిన పేరు కంటే, నటనతో పెద్దగా సంబంధం లేకుండా చేసే అడ్డగోలు కామెడీతోనే అతనికి మంచి పేరు వచ్చిందన్నది నిర్వివాదాంశం. కానీ, ఆ కామెడీ సినిమాలూ కొన్ని అతనికి దిమ్మ తిరిగే షాకులిచ్చాయి. దాంతో, మనోడు తన నటనా ప్రతిభపై మళ్ళీ ఫోకస్ పెట్టినట్లున్నాడు. అల్లరి నరేష్ కామెడీ, ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తుంది. తెలుగు సినిమాలకు సంబంధించి ఇటీవలి కాలంలో అల్లరి నరేష్ నవ్వించినంతగా ఇంకే కామెడీ హీరో నవ్వించలేదనడం అతిశయోక్తి కాకపోవచ్చు.
కానీ, ట్రాక్ తప్పేశాడు.. బహుశా అది దర్శకుల సమస్య కూడా అయి వుండొచ్చు. కానీ, కథల ఎంపికలో జాగ్రత్త వహిస్తే మాత్రం.. ఇటు కామెడీ సినిమాలు, అటు నటనా ప్రాధాన్యమున్న సినిమాలతో అల్లరి నరేష్ తిరుగులేని ఇమేజ్‌ని సొంతం చేసుకోవచ్చు. అంతేగానీ, కామెడీ సినిమాలు తగ్గించేస్తానంటే ఎలా.? అదే కదా అతనికి స్ట్రాంగ్ బేస్.