టాలీవుడ్ లో ఈమధ్య ఓ మంచి సంప్రదాయం కనిపిస్తోంది. సినిమా అయిపోగానే.. షూటింగ్ చివరి రోజు - ఆ సినిమాకి పనిచేసినవాళ్లందరికీ హీరోలు, హీరోయిన్లు.. చిన్న చిన్న బహుమానాలు ఇచ్చి సంతోష పెడుతున్నారు. నిజానికి ఈ పోకడ తమిళ పరిశ్రమలో ఎక్కువ. విజయ్, ధనుష్ లాంటి వాళ్లు షూటింగ్ చివరి రోజు చిత్రబృందానికి మంచి పార్టీ ఇచ్చి, బంగారు గొలుసులో, సెల్ ఫోన్లో ఇచ్చి పంపుతుంటారు. అలాంటి పనే చేశాడు అల్లు అర్జున్.
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న చిత్రం `పుష్ప`. ఈ సినిమాపై బన్నీ చాలా ఆశలు పెట్టుకున్నాడు. చాలా కష్టపడ్డాడు కూడా. తనే కాదు... చిత్రబృందం అంతా ఈ సినిమా కోసం చెమటోడ్చింది. రాత్రీ పగలూ అనే తేడా లేకుండా పనిచేసింది. డిసెంబరు 17న ఈ సినిమా విడుదల కావాలి. అందుకోసం అయితే.. నిద్ర కూడా మానేసి టీమ్ పనిచేస్తోంది. అందుకే బన్నీ... తన టీమ్ పై తనకున్న ప్రేమని, అభిమానాన్ని చూపించాలనుకున్నాడు. అందులో భాగంగా... టీమ్ అంతటికీ.. బంగారు బిస్కెట్లు ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. అందుకోసం ప్రత్యేకంగా బంగారు బిస్కెట్లు తయారు చేయించాడట. బంగారు బిస్కెట్లకు ఒక వైపు పుష్ప అని.. మరోవైపు ఇంగ్లీష్ లో ఏ ఏ (అల్లు అర్జున్) అని అక్షరాలు ఉంటాయట. టీమ్ అందరికీ ఈ బహుమానం ఉంటుందా? లేదంటే కీలక సభ్యులకేనా? అనేది తెలియాల్సివుంది.
మరోవైపు సుకుమార్ కూడా తన డైరక్షన్ టీమ్ కి కొన్ని బహుమానాలు ఇవ్వబోతున్నాడని టాక్. అదేంటన్నదీ తెలియాల్సివుంది. మొత్తానికి ఇటు హీరో, అటు దర్శకుడు.. తన టీమ్‌కి గిఫ్టులు ఇవ్వడానికి రెడీ అయిపోయారన్నమాట. ఇది మంచి సంప్రదాయమే.