ఏ సినిమా విడుదలకు ముందైనా చూడండి. హీరోలు, దర్శకులు మైకు పట్టుకుని దడదడలాడించేస్తుంటారు. `మా సినిమా హిట్టు.. ఇండ్రస్ట్రీ హిట్టు` అని స్టేట్‌మెంట్లు ముందే విసిరేస్తుంటారు. అది సహజం కూడా. ఎందుకంటే.. తమ సినిమాని తామే నమ్మకపోతే.. ప్రేక్షకులు ఎలా నమ్ముతారు..?
కాకపోతే.. అల్లు అర్జున్ స్ట్రాటజీనే అర్థం కావడం లేదు. ఈ సినిమా ప్రమోషన్లు.. చాలా నెమ్మదిగా సాగుతున్నాయి. దానికి తోడు. `ఈ సినిమా హిట్టయితే చాలు` అంటూ స్టేట్‌మెంట్లు ఇస్తున్నాడు బన్నీ. మంగళవారం బన్నీ.. తొలిసారి మీడియా ముందుకొచ్చి, పుష్ప గురించి మాట్లాడాడు. ఈ సినిమాపై మీ అంచనాలేంటి? అని అడిగితే.. `ప్రస్తుతానికి హిట్టయితే చాలు అనుకుంటున్నా` అని షాక్ ఇచ్చాడు. ``నిన్న సుకుమార్ తో మాట్లాడాను. తను కూడా అదే అన్నాడు. ఈ సినిమా హిట్టయితే చాలు డార్లింగ్ అంటున్నాడు` అంటూ మధ్యలో సుకుమార్ ని కూడా లాక్కొచ్చాడు. దానికి ఓ లాజిక్కూ పేర్చాడు.
``మేం సినిమా తీస్తాం. బాగా ఆడాలని అనుకుంటాం. దాన్ని ఏ రేంజుకి తీసుకెళ్తారన్నది ప్రేక్షకుల ఇష్టం. అల వైకుంఠపురంలో సినిమా అంత పెద్ద హిట్టవుతుందని నేను అనుకోలేదు. ప్రేక్షకులు దానికి బ్రహ్మరథం పట్టారు. పుష్ఫ కూడా అంతే`` అన్నాడు బన్నీ.
బన్నీ అలా అనడంలోనూ ఓ లాజిక్కు ఉంది. ఇటీవల కొంతమంది హీరోలు... ప్రీ రిలీజ్ ఫంక్షన్లలో పూనకం వచ్చినట్టు ఊగిపోయారు. సినిమా హిట్టు... రాసుకోండి.. అని బల్లగుద్ది మరీ చెప్పారు. కానీ ఆ సినిమాలన్నీ తుస్సుమన్నాయి. భారీ అంచనాలు పెంచకూడదన్న ఉద్దేశ్యంతో... బన్నీ ఈ స్ట్రాటజీ మెయిన్టీన్ చేస్తున్నాడేమో..?