నటీనటులు : అర్.జె. బాలాజీ, నయనతార, అభినయ, ఊర్వశి తదితరులు
దర్శకత్వం : అర్.జె. బాలాజీ, ఎన్.జె. శరవణన్
నిర్మాతలు : ఇషారి గణేష్
సంగీతం : గిరీష్ గోపాలకృష్ణన్
సినిమాటోగ్రఫర్ : దినేష్ కృష్ణన్
ఎడిటర్: సెల్వ ఆర్.కె
రేటింగ్: 2.75/5
దేవుడు... ఈ పాయింట్ మంచి కమర్షియల్ వస్తువు. ఎందుకంటే.. - మన నేలలో సెంటిమెఒట్ ఎక్కువ. భయం - భక్తీ ఎక్కువ. దేవుడి కథ అనగానే - దానిపై ఫోకస్ పడుతుంది. అందుకే భక్తి ప్రధానంగా సాగే చిత్రాలకు ఆదరణ దక్కుతుంది. `అమ్మోరు తల్లి` కూడా అలాంటి కథే. భక్తిని, దొంగ స్వాముల దందానీ మిక్స్ చేసి తీసిన సినిమా ఇది. తమిళంలో `మూకుత్తి అమ్మన్` పేరుతో విడుదలైంది. డిస్నీ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమా ఎలా వుంది? ఎవరికి నచ్చుతుంది?
* కథ
రామస్వామి (బాలాజీ)కి ముగ్గురు చెల్లెళ్లు. తండ్రి.. ఇంట్లోంచి వెళ్లిపోవడంతో కుటుంబ భారం తనమీదే పడుతుంది. ఓ చిన్న టీవీ ఛానల్‌లో రిపోర్టరుగా పని చేస్తుంటాడు. ఎదుగూ బొదుగూ లేని ఉద్యోగం, జీవితం. భగవతి బాబా (అజయ్ ఘోష్) అరాచకాల్ని బయటపెట్టి, తాను ఆక్రమించుకున్న 11 వేల ఎకరాల భూమి గురించి ఓ కథనం ప్రసారం చేయాలన్నది రామస్వామి ఆలోచన. అయితే... తన ఆలోచన కార్యరూపం దాల్చదు.
ఈ కష్టాలు తొలగిపోవాలంటే.. తమ కులదైవం ముక్కుపుడక అమ్మవారిని దర్శించుకోవాలని తల్లి (ఊర్వశి) పట్టుపట్టడంతో ఆ గుడికి వెళ్తారు. అక్కడ అనూహ్యంగా ముక్కు పుడక అమ్మవారు (నయనతార) ప్రత్యక్షం అవుతుంది. తన గుడిని... తిరుపతి అంత పెద్ద పుణ్యక్షేత్రం చేయాలని రామస్వామిని కోరుతుంది. అసలు ముక్కు పుడక అమ్మవారు రామస్వామికే ఎందుకు దర్శనం ఇచ్చింది? రామ స్వామి ఏం చేశాడు? అన్నదే కథ.
* విశ్లేషణ
దొంగ బాబాల నేపథ్యంలో చాలా కథలు వచ్చాయి. బాలీవుడ్ లోఅయితే ఇలాంటి సినిమాలు మరింత ఎక్కువగా వచ్చాయి. `ఓ మై గాడ్`, `పీకే` ఇలాంటి సినిమాలే. `అమ్మెరు తల్లి` కూడా అందుకు భిన్నంగా సాగే కథ కాదు. భక్తులు, దొంగ బాబాలపై సెటైర్లు ఎక్కువే వినిపిస్తాయి. దేవుళ్లనీ వదల్లేదు. అయితే చెప్పాలనుకున్న విషయాన్ని వినోదాత్మకంగా చూపించడంలో చిత్రబృందం విజయవంతమైంది. రామస్వామి ఇంటి వ్యవహారాలు, ఉద్యోగ కష్టాలూ... వినోదాన్ని పంచుతాయి. నయనతార ఎంట్రీతో... కథ ఊపందుకుంటుంది. అన్యాక్రాంతం అవుతున్న దేవుడి మాన్యాలను దేవుడే కాపాడాలనుకోవడం, దానికి ఓ సామాన్యుడి సాయం కోరడం ఈ కథలోని కొత్తదనం.
సెటైరిక్ సినిమాలు తీయడం కూడా అంత తేలిక కాదు. ఆ సెటైర్ హద్దుల్లో ఉండాలి. లేదంటే... విమర్శలు ఎదురవుతాయి. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో ఆ ఇబ్బంది కనిపిస్తుంది. భక్తుల మనోభావాల్ని ఇబ్బంది పెట్టేలా కొన్ని సన్నివేశాల్ని రూపొందించారు. అయితే.. వాటిపై ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి. దేవుడి పాత్రలో గాంభీర్యం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే.. ఈసారి ఆ దేవుడితో కూడా వినోదం పండించాలనిచూశాడు దర్శకుడు. అది ప్లస్ పాయింట్ గా మారింది. మధ్యతరతి జీవితాల్లోని బాధల్ని, వాళ్లు పడే కష్టాల్ని, చెప్పుకునే గొప్పల్నీ... కూడా లైటర్ వే లోనే చెప్పారు. ద్వితీయార్థంలో కథనం బాగా నెమ్మదిస్తుంది. ఒకే పాయింట్ చుట్టూ సినిమా తిరగడం వల్లే ఈ సమస్య. ట్రిమ్ చేసుకునే అంశాలు కొన్ని ఉన్నాయి. అనవసరమైన సాగదీత కూడా కనిపిస్తుంది. వాటిని ఉపసంహరించుకోగలిగితే.. ఇంకా బాగుండేది.
* నటీనటులు
నయనతార ఓ సూపర్ స్టార్. తనకు తగిన పాత్ర. ముక్కుపుడక అమ్మవారిగా.. దైవత్వం ఉట్టి పడేలా కనిపించింది. ఆ పాత్రతో నవ్వులూ పిండుకోవడం వల్ల.. దేవుడి పాత్రలో కొత్త డైమెన్షన్ కనిపించింది. ఈ కథకు తనే హీరో. ఇక.. బాలాజీ హీరోగా, కథకుడిగా, దర్శకుడిగా మూడు బాధ్యతల్నీ సక్రమంగా నిర్వర్తించాడు. తన కామెడీ టైమింగ్ బాగుంది. ఇక అజయ్ ఘోష్ పాత్ర మరో ప్రధాన ఆకర్షణ అని చెప్పాలి. అజయ్‌ని తెలుగులో సరిగా వాడుకోవడం లేదుగానీ, తమిళ వాళ్లు మాత్రం తన టాలెంట్ ని పసిగట్టారు. అందుకే అక్కడ తనకు మంచి పాత్రలు దక్కుతున్నాయి.
* సాంకేతిక వర్గం
పాటల్లో తమిళ నేటివిటీ ఎక్కువ గా కనిపించింది. విజువల్ గా గ్రాండ్ గా చూపించాల్సిన సీన్లకు మాత్రమే బాగా ఖర్చు పెట్టారు. గ్రాఫిక్స్ బాగున్నాయి. ఎడిటింగ్ ఇంకాస్తషార్ప్‌గా ఉండాల్సింది. మొత్తానికి.. `అమ్మోరు తల్లి` ఓ సరదా ప్రయత్నం. థియేటర్లు ఇంకా తెరచుకోని ఇలాంటి సమయంలో.. ఓటీటీలు మంచి కాలక్షేపం కలిగిస్తున్నాయి. హాయిగా ఇంటిపట్టున ఉండి, రెండు గంటలు కేటాయించగలిగిన సినిమా ఇది.
* ప్లస్ పాయింట్స్
నయనతార
వినోదం
సెటైర్లు
* మైనస్ పాయింట్స్
సెకండాఫ్
* ఫైనల్ వర్డిక్ట్: 'అమ్మ' కరుణించింది