చిత్రం: అన్నీ మంచి శకునములే
నటీనటులు: సంతోష్ శోభన్, మాళవిక నాయర్
దర్శకత్వం: నందిని రెడ్డి
నిర్మాత: ప్రియాంక దత్
సంగీతం: మిక్కీ జె మేయర్
ఛాయాగ్రహణం: సన్నీ కూరపాటి & రిచర్డ్ ప్రసాద్
కూర్పు: జునైద్
బ్యానర్: స్వప్న సినిమా మరియు మిత్ర విందా మూవీస్
విడుదల తేదీ: 18 మే 2023
ఐక్లిక్ మూవీస్ రేటింగ్: 2.25/5
వైజయంతీ మూవీస్ కి పునర్ వైభవం తీసుకొచ్చారు ప్రియాంక దత్, స్వప్న దత్. స్వప్న సినిమాపై వాళ్ళు నిర్మించిన ఎవడే సుబ్రమణ్యం, మహానటి, జాతిరత్నాలు, సీతారామం.. ఇలా చిత్రాలన్నీ విజయాలు సాధించడమే కాదు క్లాసిక్స్ గా నిలిచాయి, అందుకే చిన్న సినిమా అయినప్పటికీ ‘అన్నీ మంచి శకునములే’ మంచి అంచనాలు ఏర్పడ్డాయి. నందిని రెడ్డి ఓ బేబీ లాంటి హిట్ ఇచ్చిన తర్వాత చేసిన సినిమా ఇది. అలాగే సంతోష్ శోభన్ తనకు మంచి బ్రేక్ ఇస్తుందని నమ్మకాలు పెట్టుకున్న సినిమా. మరి స్వప్న సినిమా విజయపరంపర కొనసాగిందా? నందిని రెడ్డికి మరో విజయం దక్కింది ? సంతోష్ శోభన్ కి తొలి విజయం వచ్చిందా ?
కథ : సుధాకర్ (నరేష్), ప్రసాద్ (రాజేంద్ర ప్రసాద్) ఈ ఇరు కుటుంబాలు విక్టోరియా పురం అనే హిల్ స్టేషన్ లో నివాసముంటాయి. ఓ విలువైన ఎస్టేట్‌కి సంబంధించి రెండు కుటుంబాల మధ్య ఎప్పటి నుంచో ఓ కోర్టు కేసు నడుస్తూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రెండు కుటుంబాల మధ్య ఓ అనూహ్య సంఘటన జరుగుతుంది. డాక్టర్ (ఊర్వశి) పొరపాటు వల్ల సుధాకర్ ఇంట్లో పుట్టిన అబ్బాయి రుషి (సంతోష్ శోభన్) ప్రసాద్ ఇంట్లో పెరుగుతాడు. ప్రసాద్ కూతురు ఆర్య (మాళవికా నాయర్) సుధాకర్ కూతురుగా పెరుగుతుంది. తర్వాత ఏం జరిగింది? ఎలాంటి సమస్యలు వచ్చాయి? ఇరు కుటుంబాల మధ్య వున్న గొడవలు పెరిగాయా ? తగ్గాయా ? రుషి. ఆర్యల ప్రయాణం ఎలాంటి మలుపులు తిరిగాయి? అనేది మిగతా కథ.
విశ్లేషణ: హాస్పిటల్ లో ఒకరి పిల్లలు మరొకరికి మారిపోతే ? ఈ పాయింట్ పై ఇది వరకే కొన్ని సినిమాలొచ్చాయి. అందులో అలా వైకుంఠపురములో కథ ఇంకా గుర్తుండే వుంటుంది. అయితే ఈ పాయింట్ తీసుకొని ఈ కథకు కాఫీ ఎస్టేట్ గొడవ అనే మరో ఉపకథ కూడా చేర్చారు. అయితే ఇంతలో ఏ పాయింట్ కూడా ఒక మంచి కథని చుశామనే ఫీలింగ్ అయితే కలిగించలేదు.
రెండు కుటుంబాల మధ్య ఆస్తి గొడవలు ఉన్నాయని చెబుతూ సినిమా మొదలౌతుంది. ఆసుపత్రిలో బిడ్డల మార్పిడితో అల వైకుంఠపురములో గుర్తు తెచ్చినప్పటికీ అది ఆసక్తికరంగానే వుంటుంది. అయితే తర్వాత కథనంలో వేగం తగ్గిపోతుంది. ఒక ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ అందించడానికి సరిగ్గా ప్లాన్ చేసుకోవాలే కానీ ఒక పాయింట్ చాలు. కానీ ఇందులో కోర్టు గొడవ, ఇంటి వ్యవహారాలూ, ఆర్య, రిషిల స్నేహం, వాళ్ల మధ్య గొడవలూ, విడిపోవడం, మళ్లీ కలవడం.. ఇవన్నీ అసలు కథని ఒక దిశ అంటూ లేకుండా చేస్తాయి.
దర్శకురాలు నందిని రెడ్డి బాలీవుడ్ హమ్ ఆప్కే కౌన్, కపూర్ అండ్ సన్స్, కరణ్ జోహార్ తీసే ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ స్టయిల్ లో ఈ కథని డీల్ చేయాలని ప్రయత్నించారని స్పష్టంగా అర్ధమౌతుంది. రిషి, ఆర్యల స్నేహం, ప్రేమలో ఆ హిందీ ఛాయలు కనిపిస్తాయి. అయితే వాటిని కన్వెసింగా తీయడంలో తడబడ్డారు. వారి స్నేహం, ప్రేమ.. చాలా చోట్ల క్లూలెస్ గా వుంటుంది. కొన్ని చోట్ల డ్రామా లెస్ గా మరి కొన్ని చోట్ల ఓవర్ డ్రామా కనిపిస్తాయి. ఈ కథలో కీలకమైన వారి ట్రాక్ ని చాలా పేలవంగా చిత్రీకరించారు. హాస్పటల్ లో మార్పిడి జరిగిన అంశాన్ని చివర్లో చూపించి పాత్రలని ఎమోషనల్ చేసి భావోద్వేగాలని పిండేయాలనే ప్రయత్నం జరిగింది, కానీ ఆ ముగింపు వ్యవహరం అంతా చాలా అసహజంగా తెరపైకి వచ్చింది.
నటీనటులు: రిషి పాత్రకు సంతోష్ సరిపోయాడు. తన నటన కూడా బావుంది. అయితే ఎందుకో ఆ పాత్రని బలంగా తీర్చిదిద్దలేదు. మాళవిక నాయర్ ఎప్పటిలానే సహజంగా కనిపించింది. రాజేంద్ర ప్రసాద్, గౌతమి, రావు రమేష్, నరేష్, షావుకారు జానకి వారి అనుభవం చూపించారు. తొలి ప్రేమ తరవాత.. వాసుకి చేసిన సినిమా ఇది. అయితే ఆ పాత్ర రెగ్యులర్ గానే వుంటుంది. వెన్నెల కిషోర్ కాసేపు నవ్విస్తాడు. మిగతా నటులు పరిధిమేర కనిపించారు.
టెక్నికల్: ఫోటోగ్రఫీ నీట్ గా ఉంది. మిక్కీ అందించిన అంత గుర్తుపెట్టుకునేలా లేవు. నేపథ్య సంగీతం కూడా సొసొ గానే వుంటుంది. ఎడిటర్ సన్నివేశాలని ఇంకా షార్ఫ్ చేయాల్సింది. విక్టోరియా పురం ఊటీ విలేజ్ ఈ సినిమా కోసం క్రియేట్ చేశారు. లోకేషన్స్ లో గ్రీనరీ వుంటుంది. నిర్మాతలు ఖర్చుకి ఎక్కడా రాజీపడలేదు. ఈ కథకు కావాల్సింది సమకూర్చారు.
ప్లస్ పాయింట్స్:
కొన్ని ఫీల్ గుడ్ మూమెంట్స్
నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్:
బలహీనమైన కథ, కథనం
సాగదీత,
పండని భావోద్వేగాలు
ఫైనల్ వర్దిక్ట్: అప శకునం....